
బ్రేక్ అడిగింది...ఓకే అన్నారు..!
ప్రపంచంలో చాలా దేశాలకు...
అమెరికా నచ్చదు, అందాలపోటీలూ నచ్చవు.
దెన్, ‘మిస్ అమెరికా’ నీనా మాత్రం ఎందుకు నచ్చాలి?
నచ్చాలి. నచ్చింది కూడా!
ఎందుకంటే - నీనా... మన అమ్మాయి అని కాదు.
నీనా... అమెరికా అమ్మాయిల్ని బీట్ చేసిందని కాదు.
నీనా... పోటీల కోసం బరువు తగ్గిందని కాదు.
పాశ్చాత్య అందాల వేదికపై - తనను కాకుండా, తన దేశ సౌందర్యాన్ని ప్రదర్శించింది నీనా!
తనకు కాకుండా, భారతీయ సంస్కృతికి, భారతీయ తత్వజ్ఞతకు...
కిరీటం పెట్టించుకుంది నీనా!
కథక్ డాన్సర్‌గా... ఆమె ఇచ్చిన రెండిషన్‌కు క్వశ్చన్‌కు ఆన్సర్‌గా... ఆమె ఇచ్చిన డెఫినిషన్‌కుఅమెరికా ఫ్లాట్ అయిపోయింది.
పాతికేళ్లయినా లేని ఈ అంతస్సౌందర్యరాశికి ఇంతటి పరిణతి ఎక్కడిది?
ఆమెను మలిచిన పెంపకం ఎలాంటిది?
ఇదే ఈవారం మన ‘లాలిపాఠం’.
అందానికి నిర్వచనం ఏమిటి? అమెరికా వేదిక మీద నీనా దావులూరి చెప్పిన సమాధానమే అసలైన అందం. అందాన్ని కొలిచే కొలమానం ఉందా? ఉందనే అనుకుంటున్నాయి ఈ పోటీలను నిర్వహించే సంస్థలు. అంతటితో ఆగకుండా గీటుపెట్టి నిర్ణయిస్తామంటూ ప్రశ్నావళిని కూడా తయారుచేశాయి. మానసిక స్థయిర్యం, కృషి, పట్టుదల, విశాలదృక్పథం, సమయస్ఫూర్తి, మాటతీరు, మానసిక వికాసం... ఇలా ఎన్నో అంశాల సుమహారమే అసలైన అందం అన్నారు నిర్వహకులు. ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయంటూ ముందడుగు వేసింది నీనా దావులూరి. భారతీయ మూలాలను, సాంస్కృతిక నేపథ్యాన్ని కొనసాగిస్తూ పాశ్చాత్య భావజాలం మధ్య పెరిగిన అమ్మాయి నీనా. ఆమెలో ఆత్మవిశ్వాసం ఉండాల్సినంత ఉంది. ఇందుకు మిస్ అమెరికా పోటీలో అందాన్ని విశ్లేషిస్తూ ఆమె చెప్పిన సమాధానమే గీటురాయి. ఈ అమ్మాయిని ఎలా తీర్చిదిద్ది ఉంటారు ఆ అమ్మానాన్నలు? నీనా అమ్మ షీలారంజని, నాన్న ధనకోటేశ్వరచౌదరి పిల్లల పెంపకంలో పాటించిన విలువలేంటి? ఈ వివరాలను విజయవాడలో ఉన్న నీనా అమ్మమ్మ కోటేశ్వరమ్మ, పెద్దమ్మ డాక్టర్ శశిబాల ఇలా చెప్తున్నారు.
మా చెల్లి కోరినట్లే..!
‘‘మా చెల్లి, మరిది గారు అమెరికాలో స్థిరపడ్డారు. నీనా అమెరికాలోనే పుట్టింది. అయితే రెండవ నెల నుంచి రెండేళ్లు నా దగ్గరే ఇండియాలో పెరిగింది. మా చెల్లెలు పిల్లల పెంపకం విషయంలో కచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. పిల్లల్ని ఏటా ఇండియాకి పంపిస్తూ ‘వీళ్లకు ఈ వెకేషన్‌లో కూచిపూడి, భరతనాట్యం వంటివి నేర్పించు, మన నేటివిటీ తెలిసేలా చెయ్యి’ అని చెప్పేది. తాను కోరినట్లే పిల్లలకు ఆరేళ్ల వయసు వచ్చినప్పటి నుంచి నేర్పించాం’’ అని శశిబాల చెప్తుండగా కోటేశ్వరమ్మగారు మాట్లాడుతూ ‘‘ఇక్కడ మొదలు పెట్టిన డాన్సుని ఇక్కడితోనే వదిలేయలేదు మా మనుమరాళ్లు. అమెరికా వెళ్లి అక్కడ స్కూల్ ప్రోగ్రాముల్లో లంబాడీ డాన్సు వంటివి ప్రదర్శించారు. మా చిన్నమ్మాయి పిల్లల్ని సాయంత్రం డాన్సు క్లాసులకు తీసుకెళ్లేది. తిరిగి ఇంటికొచ్చేసరికి రాత్రి తొమ్మిదయ్యేది. పిల్లలిద్దరూ అమెరికాలోనే పియానో, క్లారినెట్ కూడా నేర్చుకున్నారు. గుజరాతీ వాళ్ల దగ్గర కథక్ కూడా నేర్చుకుంది నీనా. మిస్ అమెరికా పోటీల్లో వేదిక మీద ప్రదర్శించింది కథక్ బాణీనే. మనవాళ్ల పెళ్లిళ్లలో నాట్యం చేసేది. నీనాకి డాన్సంటే అంత ఇష్టం. మిస్ అమెరికా పోటీల్లో ఇష్టమైన కళ ఏదంటే డాన్స్ అనే చెప్పింది. అందుకే నాట్యాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చారు’’ అన్నారు.
ఒక్క ఏడాది టైమిస్తే..!
ఈ కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. ఈ నేపథ్యంలో పిల్లలకు నేర్పిన విలువల గురించి శశిబాల మాట్లాడుతూ... ‘‘చిన్నప్పటినుంచి మీనా, నీనా ఇద్దరికీ పుస్తకాలు చదివే అలవాటు చేశాం. ఏ విషయాన్ని అయినా నిశితంగా, లోతుగా అధ్యయనం చేస్తారు. వీళ్లలో తాము తెలుసుకున్న విషయాన్ని చక్కగా ఆచరణలో పెట్టగలిగిన నేర్పు కూడా ఉంది. వాళ్లతో ఏ టాపిక్ చర్చించినా పరిణితితో మాట్లాడుతారు. పెద్దమ్మాయి మీనాకి ఎంతటి భూతదయ అంటే... ‘ఒక ప్రాణిని చంపే హక్కు ఎవరిచ్చారు’ అంటుంది, మాంసాహారం తినదు. పిల్లల్ని ఇలా తీర్చిదిద్దడంలో మా చెల్లి పాత్ర ఎక్కువనిపిస్తుంది నాకు. చిన్నప్పుడు మా చెల్లి కూడా చాలా చురుగ్గా ఉండేది. అదే పిల్లలకూ వచ్చింది. దానికి తోడుగా వాళ్లు పెరిగిన పెద్ద ప్రపంచం చాలా దోహదం చేసింది. ఒక వ్యక్తిలో పరిణతి, వ్యక్తిత్వ వికాసం వంటివి వారి పరిసరాలు, ఎక్స్‌పోజర్‌ను మీద ఆధారపడి ఉంటాయి. అమెరికాలో స్కూళ్లలో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ. ప్రతి విద్యార్థీ పాల్గొనేటట్లు చేస్తారు. మీనా కూడా పీజంట్ పోటీల్లో పాల్గొని గెలిచింది. తర్వాత తను పూర్తిగా చదువులోనే నిమగ్నమైంది. నీనా మాత్రం ఒక ఏడాది టైమిస్తే ఈ పోటీల్లో పాల్గొని ఆ తర్వాత మెడిసిన్ చేస్తానని అడిగింది వాళ్ల అమ్మానాన్నల్ని. సరదా పడుతోంది కదా అని సరేనన్నారు మా చెల్లి, మరిదిగారు’’ అన్నారు.
తల్లిదండ్రుల్లో క్రమశిక్షణ!
పాశ్చాత్య సమాజంలో పిల్లల్ని తీర్చిదిద్దడంలో పాఠశాలల పాత్ర, తల్లిదండ్రుల నడవడి గురించి చెబుతూ ‘‘అక్కడ పేరెంట్స్ మీట్‌కి పేరెంట్స్ తప్పనిసరిగా హాజరవుతారు. చదువు, విద్యేతర కార్యక్రమం గురించి ‘ఫలానా వస్తువు పంపించాల’ంటే పంపించి తీరుతారు. అంత క్రమశిక్షణ పాటిస్తారు తల్లిదండ్రులు. అదే పిల్లలకూ అలవాటవుతుంది’’ అన్నారు కోటేశ్వరమ్మ.
కుటుంబం ప్రభావమే ఎక్కువ!
పిల్లలు ఏ సమాజంలో పెరిగినా మొదటగా ప్రభావం చూపించేది కుటుంబమేనంటారు కోటేశ్వరమ్మ. ‘‘అమెరికాలో ఉన్న భారతీయులు ప్రార్థనలు, సత్సంగాలు నిర్వహిస్తుంటారు. మా చిన్నమ్మాయి ఆ కార్యక్రమాలకు పిల్లల్ని కూడా తీసుకెళ్లేది. వీళ్లంతా అనాథలకోసం భోజనం తీసుకెళ్లి ఇచ్చేవారు. ఓల్డేజ్ హోమ్స్‌కి వెళ్లి పాటలు పాడి వాళ్లకు వినోదాన్ని పంచడం కూడా అలాగే అలవాటైంది నీనాకి. అలాగని ఆధ్యాత్మికమే జీవితంగా పెరిగారని కాదు. డైలీ రొటీన్ అక్కడి సమాజంలో ఉన్నట్లే’’ అన్నారామె. నీనా మిస్ అమెరికా పోటీ కోసం ఆహారపు అలవాట్లు మార్చుకోవడాన్ని చెప్తూ ‘‘బరువు తగ్గిన మాట వాస్తవమే కానీ విపరీతమైన లావు లేదు. నీనాకు చాక్లెట్లు చాలా ఇష్టం. బరువు తగ్గడం కోసం పట్టుబట్టి మరీ చాక్లెట్లు మానేసింది. వాళ్ల అమ్మ కూడా బరువు పెరగనివ్వని వంటలనే చేసేది’’ అన్నారు కోటేశ్వరమ్మ.
తనకు తానుగానే..!
మిస్ అమెరికా పోటీలలో గెలవడానికి నీనా తనకు తానే అన్నీ సమకూర్చుకున్నదంటారు శశిబాల. ‘‘డ్రస్‌లు డిజైన్ చేసుకోవడంలో వాళ్ల అమ్మ, అక్క సహాయం చేశారు. పేరెంట్స్ చేసిందల్లా నీనాకి కావల్సిన వనరులు సమకూర్చడం, మోరల్ సపోర్టుతో ప్రోత్సహించడమే. అభిరుచిని కూడా క్రమశిక్షణతో చేయాలనుకోవడమే నీనా విజయరహస్యం’’ అన్నారు శశిబాల.
ఇరవై నాలుగేళ్ల అమ్మాయి... ‘సౌందర్యం అంటే పై మెరుగులతో వచ్చేది కాదు, పుట్టుకతో వచ్చిన దానిని యథాతథంగా స్వీకరించడమే అని, అంతర్లీనంగా ఉన్న మానసిక పరిణితే అసలైన సౌందర్యం’ అనీ న్యాయనిర్ణేతలకు చెప్పింది. పదాలు వేరైనా ఇదే భావాన్ని మన జ్ఞానులు చెప్పారు. డాక్టర్ శశిబాల, కోటేశ్వరమ్మ చెప్పిన మాటలు వింటే భారతీయ తత్వజ్ఞానాన్ని అగ్రవేదిక మీద ప్రకటించగలిగిన ఆత్మవిశ్వాసం నీనాకు తల్లిదండ్రుల పెంపకంలోనే వచ్చిందనిపించింది.
- వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ప్రతినిధి
ఫొటోలు: ఎం. ఆర్. మోహన్, విజయవాడ
నీనా గురించి...మిస్ అమెరికా
అంతకుముందు...
మిస్ న్యూయార్క్, మిస్ సెరిక్యూజ్.
మిస్ అమెరికా అవుట్‌స్టాండింగ్ టీన్ -
2007 పోటీలో రెండవస్థానం