సాక్షి ఫొటోగ్రాఫర్‌పై పోలీసుల నిర్బంధకాండ | Sakshi Photojournalist House Arrest In Amaravati | Sakshi
Sakshi News home page

సాక్షి ఫొటోగ్రాఫర్‌పై పోలీసుల నిర్బంధకాండ

Published Sat, Mar 30 2019 7:21 AM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM

Sakshi Photojournalist House Arrest In Amaravati

ధర్నాచేస్తున్న జర్నలిస్ట్‌లతో చర్చిస్తున్న మాచవరం సీఐ (ఇన్‌సెట్‌లో) అక్రమ నిర్భందానికి గురైన సాక్షి ఫొటోగ్రాఫర్‌ విజయకృష్ణ

సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో ఉన్న సాక్షి ఫొటో జర్నలిస్టుపై పోలీసులు నిర్బంధకాండకు పాల్పడ్డారు. తాను సాక్షి ఫొటోగ్రాఫర్‌నని చెప్పినా.. అందుకు సంబంధించిన గుర్తింపు కార్డులు చూపినా పోలీసులు వినిపించుకోలేదు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాలతో శుక్రవారం మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి గంటల తరబడి అక్రమంగా నిర్బంధించారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు పోలీసుస్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో పోలీసులు దిగివచ్చారు. సాక్షి ఫొటోగ్రాఫర్‌ విజయకృష్ణను విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయాలని శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు విధుల నుంచి రిలీవ్‌ కావాల్సి ఉంది.

అదే సమయంలో ఇంటెలిజెన్స్‌ పోలీసుల వాహనాల్లో టీడీపీ అభ్యర్థులకు భారీఎత్తున డబ్బుల సంచులు చేరవేస్తున్నారనే సమాచారం రావడంతో అక్కడ సాక్షి ఫొటోగ్రాఫర్‌ విజయకృష్ణ కెమేరాతో వేచి ఉన్నారు. అతన్ని గమనించిన ఇంటెలిజెన్స్‌ సిబ్బంది కెమేరా లాక్కొని కార్యాలయంలోనికి తీసుకెళ్లి నిర్బంధించారు. కెమేరాలోని ఫొటోలన్నీ డిలీట్‌ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఫొటోలతోపాటు మరికొన్ని ముఖ్యమైన ఫొటోలున్నాయని ఫొటోగ్రాఫర్‌ బదులిచ్చారు. అయినా బెదిరించిన ఇంటెలిజెన్స్‌ సిబ్బంది కెమేరా లాక్కొని వారి సొంత ఫొటోగ్రాఫర్‌తో చిప్‌ ఫార్మెట్‌(ఫొటోలు డిలీట్‌) చేయించారు. అక్కడితో ఆగకుండా ఫొటోగ్రాఫర్‌ నుంచి గుర్తింపు కార్డులను, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. 

లోకల్‌ పోలీసులకు అప్పగించాం..
విషయం తెలుసుకున్న సాక్షి స్టేట్‌బ్యూరో ఇన్‌చార్జి ఎన్‌.వెంకటరెడ్డి ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడారు. సాక్షి ఫొటోగ్రాఫర్‌ను ఇంటెలిజెన్స్‌ ఆఫీసు వద్ద పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారని, ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ మాట్లాడుతుండగానే.. మేము లోకల్‌ పోలీసులకు అప్పగించాం. అక్కడ మాట్లాడుకోండంటూ ఫోన్‌ కట్‌ చేశారు. అనంతరం విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును ఫోన్‌లో సంప్రదించగా తనకు సమాచారం లేదని, తెలుసుకుంటానని జవాబిచ్చారు.

బాస్‌ల డైరెక్షన్‌.. పోలీసుల యాక్షన్‌..
మాచవరం పోలీసులు ఇంటెలిజెన్స్‌ పోలీస్‌ బాస్‌ డైరెక్షన్‌లో ఓవరాక్షన్‌ చేశారు. గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగానే నిర్బంధించారు. విషయం తెలిసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన పలువురు జర్నలిస్టులు ఫొటోగ్రాఫర్‌ను నిర్బంధించడాన్ని తప్పుబట్టారు. ఫొటోగ్రాఫర్‌ను వదిలిపెట్టడానికి పోలీసులు నిరాకరిస్తూ.. తమ బాస్‌ల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. జర్నలిస్టులు సీఐ వచ్చాక మాట్లాడగా.. అక్కడకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో లెటర్‌ రాసిస్తే విడిచిపెడతామని ఆయన మెలికపెట్టారు. ఏ తప్పూ లేనప్పుడు ఎందుకు లెటర్‌ రాసివ్వాలని ప్రశ్నించిన జర్నలిస్టులు అక్రమ నిర్బంధానికి నిరసనగా మాచవరం పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఫొటోగ్రాఫర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో సీఐ శ్రీనివాస్‌ యాదవ్‌.. పోలీస్‌ కమిషనర్, ఇతర పోలీస్‌ బాస్‌లతో మాట్లాడి ఫొటోగ్రాఫర్‌ను విడిచిపెట్టారు. 

ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి...
ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌(ఏపీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకట్రావు తప్పుబట్టారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌ ఎదుట జరిగిన ఆందోళన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్టును కావాలనే నిర్బంధించారని, తాను జర్నలిస్టునని గుర్తింపుకార్డు చూపాక కూడా దౌర్జన్యానికి పాల్పడటం సరైంది కాదని అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శాంతిశ్రీ,, సాక్షి స్టేట్‌ బ్యూరో ఇన్‌చార్జి ఎన్‌.వెంకటరెడ్డి, సాక్షి ఫొటో ఎడిటర్‌ కె.రవికాంత్‌రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టులు సి.మాణిక్యాలరావు, మల్లు విశ్వనాథరెడ్డి, ఆకుల అమరయ్య, సీహెచ్‌ శ్రీనివాసరావు, జీపీ వెంకటేశ్వర్లు, వనం దుర్గాప్రసాద్, డొక్కా రాజగోపాల్‌లతోపాటు పలువురు జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు, స్థానిక విలేకరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement