‘సాక్షి’పై కక్ష సాధింపు
(సాక్షిప్రతినిధి, అనంతపురం) ‘సాక్షి’ టీవీ ప్రసారాలను రాష్ట్రవ్యాప్తంగా ఆపేయాలని మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్స్ (ఎంఎస్‌ఓలు)ను ‘చినబాబు’ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఎంఎస్‌ఓలు విముఖత చూపగా.. వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేసి ప్రసారాలు నిలిపేయించినట్లు సమాచారం. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్షకు దిగడం.. ఆ దృశ్యాలను ‘సాక్షి’ టీవీ ప్రసారం చేయడంపై చినబాబు తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.
గురువారం ఉదయమే ఎంఎస్‌ఓల సంఘం రాష్ట్రనేతలకు నేరుగా ఫోన్ చేసి.. ‘సాక్షి’ టీవీ ప్రసారాలను ఆపాలని హుకుం జారీ చేశారు. అయితే.. ఇందుకు వారు మొదట అంగీకరించలేదు. ఛానల్ ప్రసారాలు ఆపడం సరికాదని, గతంలో తెలంగాణలో ఏబీఎన్ ప్రసారాలు ఆపేసినప్పుడు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏపీలో ‘సాక్షి’ని ఆపేయడం తగదని, పైగా ఎంఎస్‌ఓలు, కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు.
నెలవారీ కలెక్షన్లపై కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. వారి సూచనలను ఏమాత్రమూ పరిగణనలోకి తీసుకోని చినబాబు ‘అవన్నీ తర్వాత ముందు ఛానల్ ఆపేయండి’ అని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతోనే గురువారం మధ్యాహ్నం నుంచి ‘సాక్షి’ ప్రసారాలు ఆపేశారు. చినబాబు ఎంఎస్‌ఓ సంఘం నేతలకు ఫోన్ చేసి మాట్లాడిన అంశాన్ని అనంతపురంతో పాటు చాలా జిల్లాల్లో ప్రజాప్రతినిధులతో పాటు మీడియాప్రతినిధులు కూడా జోరుగా చర్చించుకున్నారు. ఈ చర్య సరికాదని, టీవీ ప్రసారాలను నిలిపేయడమంటే భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని పలువురు జర్నలిస్టు యూనియన్ నాయకులు ఖండించారు.
ప్రెస్‌మీట్లకు అనుమతించొద్దు
తెలుగుదేశంపార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, నాయకుల ప్రెస్‌మీట్లకు కూడా ‘సాక్షి’ పత్రిక, టీవీ విలేకరులను అనుమతించొద్దని శుక్రవారం అధికారికంగా జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కార్యక్రమాల వివరాల ఎస్‌ఎంఎస్, మెయిల్స్ కూడా పంపొద్దని సూచించినట్లు సమాచారం. దీంతో జిల్లా అధ్యక్షులు.. టీడీపీ మీడియా ఇన్‌చార్జ్‌లను ఆ మేరకు ఆదేశించారు. ఇకపై ‘సాక్షి’ విలేకరులను ఎలాంటి కార్యక్రమాలకూ ఆహ్వానించొద్దని, సమాచారం కూడా ఇవ్వొద్దని పార్టీ ఆదేశించినట్లు టీడీపీలోని కీలక నేతలు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు.