సాక్షి, చినగంజాం: ఉప్పు రైతులకు 2004కు పూర్వం, 2014 తరువాత గడ్డుకాలంగా చెప్పుకోవచ్చు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఉప్పు నిల్వలు విపరీతంగా పెరిగాయి. రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పేరుకు పోయిన ఉప్పు కువ్వలను తక్కువ ధరకు అమ్మి రైతులు సొమ్ము చేసుకోవాల్సి వచ్చింది. వైఎస్ ప్రభుత్వం హయాంలో ఉప్పు రైతులకు ఎన్నడూ లేని విధంగా విద్యుత్ బిల్లులో అనూహ్యరీతిలో రాయితీ, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు పంటనష్ట పరిహారం చెల్లింపు తక్షణమే అందజేసి ఆదుకున్నాడు.
ఉప్పు రైతుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పంటనష్ట పరిహారం చెల్లింపు మహానేత వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయేలా చేశాయి. వైఎస్ అనంతరం వచ్చిన ప్రభుత్వాలు మళ్లీ తిరిగి విద్యుత్ బిల్లులను యథావిధిగా పెంచి వారు ఉసురుపోసుకున్నాయి. జిల్లాలో మొత్తం 3450 ఎకరాల్లో ఉప్పు సాగవుతుంది. ఏడాదికి 67,645 మెట్రిక్ టన్నులు ఉప్పు ఉత్పత్తి అవుతుంది. జిల్లాలోని పాకలలో 1085 ఎకరాలలో సాగవుతుండగా ఏడాదికి 12,940 మెట్రిక్ టన్నులు, పాదర్తి, కనపర్తిలలో 690 ఎకరాలలో 12 వేల మెట్రిక్ టన్నులు, చినగంజాం నార్త్ 475 ఎకరాలలో 8370 మెట్రిక్ టన్నులు, సౌత్‌లో 1200 ఎకరాల్లో 34,335 మెట్రిక్ టన్నులు ఉప్పు రైతులు ఉత్పత్తి చేస్తున్నారు.
ఉప్పు సాగు మీద జిల్లాలో వేలమంది సన్న, చిన్న కారు రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. టీడీపీ హయాంలో ఒక్క విద్యుత్ బిల్లుల పరంగా రైతులు తీవ్రంగానే నష్ట పోయారు. ఉప్పు సాగుకు ఒక ఎకరాకు నెలకు సుమారు 75 యూనిట్లు విద్యుత్ ఖర్చువుతుంది. ప్రతి ఏడాది తొమ్మిది నెలలపాటు ఉప్పు సాగవుతుంది. టీడీపీ హయాంలో యూనిట్‌కు రూ.4.05 చొప్పున రైతులను ముక్కుపిండి వసూలు చేశారు. జిల్లాలో వందలాది మంది రైతులు విద్యుత్ బిల్లులు కట్టలేక సతమతమయ్యారు. ప్రభుత్వం ఇస్తానన్న ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా విద్యుత్ బిల్లులు విపరీతంగా పెంచి వసూలు చేస్తుండటంతో సాగు చేయడమే మానేశారు. ఒక వైపు అనుకూలించని ప్రకృతి, పెట్టుబడులు విపరీతంగా పెరిగి పోవడం, పెరిగిన విద్యుత్ బిల్లులు ఉప్పు రైతులకు శాపంగా మారాయి.
జిల్లాలోని 3450 ఎకరాల్లో ఒక ఎకరాకు 75 యూనిట్‌ల చొప్పున మొత్తం 2,58,750 యూనిట్లు విద్యుత్ అవసరం కాగా, చంద్రబాబు హయాంలో యూనిట్‌కు రూ.4.05 వంతున వసూలు చేశారు. విద్యుత్ బిల్లుల కోసం జిల్లాలోని ఉప్పు రైతులు ఒక నెలకు రూ.12,29,062 చెల్లించారు. ఉప్పు సాగు ఏడాదిలో కనీసం 9 నెలలు సాగనుండగా మొత్తం రూ 1,10,61,562 ఖర్చువుతుంది. ఇక వైఎస్ ప్రభుత్వం రూ.4.05 ఉన్న యూనిట్ విద్యుత్ ధరను రూ.1.05కు తగ్గించడంతో ఉప్పు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన పాలన సాగించిన ఆరేళ్లలో రైతులు బంగారం పండించుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉప్పు కొఠారులలో రైతుల నుంచి యూనిట్‌కు రూ.3.75 కరంటు చార్జీలు, కస్టమర్ చార్జీలు కలుపుకొని స్లాబు సిస్టం ప్రకారం రూ.4.05 వరకు వసూలు చేస్తున్నారు.
జిల్లాలో ఉప్పు రైతులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నానా ఇబ్బందులు పడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన ఉప్పుకు గిట్టుబాటు ధరలేక, పెట్టిన పెట్టుబడులు సకాలంలో అందక అప్పుల పాలవుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో రైతులకు ఏడుగంటల విద్యుత్ అందిస్తానని ఊక దంపుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఆచరణలో వచ్చేటప్పటికీ అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో రైతులు అవస్థలు పడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలేకపోవడం, విద్యుత్ చార్జీల భారం, కరెంటు కోత, ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టపోయిన రైతులను సకాలంలో ఆదుకోకపోవడం వంటి సమస్యలతో సతమతమయ్యారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకొనే లేదు
బాబు హయాంలో పలు మార్లు తుఫాన్, వరద బీభత్సం కారణంగా కొఠార్లు మునిగి ఇబ్బందులు పడ్డాం. కనీసం పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇచ్చే ఆలోచన కూడా చేయలేదు. మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంట నష్ట పరిహారం ఇచ్చి ఆదుకున్నాడు. గతంలో ఏ నాయకుడు పంట నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అది ఆయనొక్కడికే సాధ్యమైంది.
– రంగని వెంకటేశ్వర్లు రెడ్డి, మూలగాని వారిపాలెం రైతు
టీడీపీ కాలంలో ఉప్పు సాగు చేయలేక పోతున్నాం
టీడీపీ ప్రభుత్వం హయాంలో పూర్తిగా ఉప్పు సాగుకు దూరమవుతున్నాం. ఇక ముందు సాగు చేస్తామో లేదో అన్న భయం ఏర్పడింది. ఉప్పు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు మోసం చేశాడు. కరంటు బిల్లులు పేరుతో కష్టపడిన సొమ్ముంతా ప్రభుత్వానికే చెల్లించాల్సి వస్తుంది.
– శవనం ఏడుకొండలు రెడ్డి, మూలగాని వారిపాలెం
చంద్రబాబు హయాంలో గిట్టుబాటు ధర లేదు
చంద్రబాబు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉప్పుకు గిట్టుబాటు ధర లభించలేదు. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. తక్కువ రేటుకు ఉప్పును అమ్ముకోవాల్సి వచ్చింది. వైఎస్ వచ్చాకే మాకు విద్యుత్ బకాయిలు, గిట్టుబాటు ధర లభించాయి. ఆయన పోవడంతోటే ఉప్పు రైతుల సంక్షేమం కూడా దెబ్బతింది.
– గెల్లి వెంకట లక్ష్మీనారాయణ, చినగంజాం ఉప్పు రైతు
కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం
టీడీపీ ప్రభుత్వం హయాంలో కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడ్డాం, పడుతున్నాం. యూనిట్‌కు రూ.4.05 వసూలు చేస్తున్నారు. నెల తిరిగేసరికి బిల్లులు కట్టలేక సాగు ఖర్చు తడిసి మోపెడవుతుంది. మహానేత వైఎస్ వచ్చాక రూ.1.05 చేయడంతో ఊపిరి పీల్చుకున్నాం. అప్పులు తీర్చుకొని కాస్తంత అన్నం తినగలిగాం. మళ్లీ టీడీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నాం.
– కుక్కల వెంకటేశ్వరరెడ్డి, ఉప్పు రైతు, రాజుబంగారుపాలెం
Comments
Please login to add a commentAdd a comment