Salt farmers
-
కాసుల వర్షం కురిపిస్తోన్న ‘తెల్ల బంగారం’
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉప్పురైతుల దశ తిరిగింది. వాతావరణం పూర్తిగా అనుకూలించడంతో ఉప్పుసాగు జోరుగా సాగుతోంది. ధరలు సైతం ఊహించని విధంగా పెరగడంతో తెల్ల బంగారం కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు నాలుగేళ్ల కిందట 75 కేజీల బస్తా ధర కేవలం రూ. 70 మాత్రమే ఉండేది. ప్రస్తుతం రూ. 300 పలుకుతోంది. యాబై ఏళ్లలో ఇంత ధర ఎప్పుడూ లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. సింగరాయకొండ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీల్లోని కొఠారుల్లో సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగవుతోంది. వర్షాకాలం మినహా మిగిలిన కాలాల్లో దాదాపు 9 నెలల పాటు ఉప్పు సాగు చేస్తారు. ప్రతి నెల సుమారు 20 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి అవుతోంది. సుమారు 7 వేలకు పైగా ఉప్పు రైతులు, 10 వేలకు పైగా కూలీలకు ఉపాధి పొందుతున్నారు. 50 ఏళ్లలో అత్యధికం ప్రస్తుతం ఉప్పు ధర నాణ్యతను బట్టి 75 కేజీల బస్తా రూ.300 వరకు పలుకుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.270 పలికింది. ఇదే అత్యధిక ధర అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు ధరలు మరింత పెరిగాయి. ఈ ఏడాది తమిళనాడులో అధిక వర్షాలతో ఉప్పు ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో తమిళనాడు వ్యాపారులు రాష్ట్రానికి రావడంతో ఏప్రిల్‌లో ధరలు బాగా పెరిగాయి. మూడు నాలుగేళ్ల కిందట 75 కేజీల బస్తా రూ.75 లకు కూడా ధర రాని దుస్థితి. దీంతో చాలా మంది ఉప్పు రైతులు సాగుకు సెలవు ప్రకటిద్దామనుకున్నారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ధరలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ధర రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంతో పాటు, తెలంగాణ, మహారాష్ట్ర ఉప్పు సరఫరా అవుతోంది. పెరిగిన కూలి ఉప్పు ధరలు ఆశాజనకంగా ఉండటంతో కూలీలకు కూలి సైతం పెరిగింది. ఇప్పటి వరకు కొఠారుల్లో మూడు గంటలు పనిచేస్తే పురుషులకు రూ.400 ఇస్తుండగా ప్రస్తుతం రూ.500, మహిళలకు రూ.300 ఇస్తుండగా రూ.350 పెరిగిందని రైతులు తెలిపారు. ఇతర రాష్ట్రాల వ్యాపారుల రాకతో.. ఈ ప్రాంతంలో వ్యాపారుల సిండికేట్ కారణంగా ఉప్పు రైతులకు ఆశించిన ధర చేతికి వచ్చేది కాదు. కానీ ఈ ఏడాది తమిళనాడు వ్యాపారులు నేరుగా రైతులను కలవడంతో ధరలు ఆశాజనంగా పెరిగాయని ఉప్పు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల వ్యాపారులు నేరుగా రావటంతో ఇప్పటివరకు సిండికేట్‌తో వ్యాపారులు లాభపడుతుండగా ఇప్పుడు రైతులే ఆ లాభాలను పొందుతున్నారు. ఉప్పును కూడా ఆర్బీకేల కొనుగోలు చేస్తే మరింత లాభం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి 10 ఎకరాలను కౌలుకు తీసుకొని ఉప్పు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉప్పు తయారీ బాగుంది. తమిళనాడు వ్యాపారులు నేరుగా రైతులను కలవడంతో మంచి ధరలు వస్తున్నాయి. – పురిణి శ్రీనివాసులరెడ్డి గతంలో ఎప్పుడూ ఈ ధర లేదు 50 ఏళ్లలో ఎన్నడూ ఈ ధర లేదు. గతంలో వ్యాపారుల సిండికేట్, వర్షాభావ పరిస్థితులతో గిట్టుబాటు ధరలు రాక తీవ్రంగా నష్టపోయేవాళ్లం. రెండేళ్లుగా ధరలు ఆశాజ నకంగా ఉండటంతో సాగు లాభదాయకంగా ఉంది. – కుర్రి నరసింహారావు -
ఉప్పు రైతుకు మంచి రోజులు
సింగరాయకొండ: సరైన ధర లభించక ఎప్పుడూ డీలా పడే ప్రకాశం జిల్లా ఉప్పు రైతులకు ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చాయి. వాతావరణం అనుకూలించడంతో ఉప్పు ధరలు అనూహ్యంగా పెరిగాయి. జిల్లాలో చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీల్లో నాలుగు వేల ఎకరాల్లో ఉప్పును సాగు చేస్తున్నారు. వర్షాకాలంలో తప్ప మిగిలిన కాలాల్లో ఉప్పు సాగులో ఉంటుంది. ప్రతి నెలా సుమారు 20 వేల టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం 75 కిలోల ఉప్పు బస్తా నాణ్యతను బట్టి రూ.170 నుంచి రూ.225 వరకు పలుకుతోంది. గత 70 ఏళ్లలో ఇదే అత్యధిక ధర కావడంతో సాగుదార్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతం పీడ.. 2014–2019 వరకు వర్షాభావ పరిస్థితుల వల్ల బస్తా ఉప్పు రూ.60 నుంచి రూ.120 పలకడంతో రైతుకు నష్టాలే మిగిలాయి. దీనికి తోడు వ్యాపారుల సిండికేట్‌తో రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ ఏడాది ముందే వర్షాలు కురవడంతో ఆగస్టు నుంచే ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో ఉప్పుకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా నుంచి రోజుకు 20 లారీల ఉప్పు మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, తెలంగాణ, మహారాష్ట్రకు సరఫరా అవుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. గతంలో నష్టపోయాం గతంలో వ్యాపారుల సిండికేట్‌తోపాటు, «వర్షాభావ పరిస్థితుల కారణంగా ధరలు లేక తీవ్రంగా నష్టపోయాం. ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంది. వ్యాపారుల సిండికేట్ లేకపోతే ఇంకా మంచి ధర లభిస్తుంది. – పాకనాటి రమణారెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం నాడు రూ.40కే అమ్మాను గత 30 ఏళ్లుగా ఉప్పు సాగు చేస్తున్నా. నాకు ఊహ తెలిశాక 75 కిలోల ఉప్పు బస్తా ధర రూ.180 ఉండటం ఇదే తొలిసారి. గతంలో గిట్టుబాటు ధరలు లేక రూ.40కే అమ్మాను. – సామంతుల ఆదినారాయణరెడ్డి, ఉప్పు రైతు, బింగినపల్లి -
ఆశల ఉప్పుసాగు
ఉప్పు సత్యాగ్రహంలో బ్రిటిష్ వారినే గజగజలాడించిన ఉప్పు రైతులు గత ప్రభుత్వ విధానాల వల్ల దయనీయ స్థితితో అల్లాడిపోయారు. అకాల వర్షాలు, వాతావరణంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల కారణంగా తీరంలోని ఉప్పు ఉత్పత్తిదారులు తీవ్రనష్టాలను చవిచూశారు. గత ఐదు సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాల నుంచి ఇంకా కోలుకోని ఉప్పు రైతులు ఈ ఏడాది కూడా గిట్టుబాటు కాదని తెలిసినా ఉప్పు ఉత్పత్తికి సిద్ధమయ్యారు. సాక్షి,విడవలూరు: ఎప్పటికైనా మంచి రోజులు రాకపోతాయా అని జిల్లాలోని విడవలూరు, అల్లూరు, ముత్తుకూరు తీర ప్రాంతంలో ఉప్పు ఉత్పత్తికి సిద్ధమవుతున్న రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉప్పు ఉత్పత్తికి ఇదే అనుకూల సమయంగా భావించే రైతులు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. విడవలూరు మండలంలోని రామతీర్థం, అల్లూరు మండలంలోని ఇస్కపల్లి, గోగులపల్లి, ముత్తుకూరు మండలాల్లో సుమారు 4,000 ఎకరాల్లో సొసైటీల ద్వారా ఉప్పు ఉత్పత్తి చేస్తుంటారు. వ్యవసాయాధారిత ప్రాంతాలైన ఈ మూడు తీర ప్రాంత మండలాల్లో ఉప్పు ఉత్పత్తిది రెండో స్థానంగా నిలుస్తోంది. ప్రస్తుతం రైతులు ఉప్పు మడులను 10 అడుగుల చదరపు ఆకారంలో సిద్ధం చేసుకున్నారు. ఆ మడులలో నాణ్యమైన ఉప్పును ఉత్పత్తి చేసేందుకు ఇసుకను చల్లి మహిళా కూలీలతో మడులను తొక్కించడం జరుగుతోంది. మడులు సిద్ధం చేసిన తరువాత మోటర్ల సాయంతో నీటిని నింపి వారం తరువాత ఉప్పును బయటకు తీస్తారు. మడులను సిద్ధం చేస్తున్న మహిళలు గత మూడు సంవత్సరాలుగా వాతావరణంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉప్పు ఉత్పత్తి అంతంతమాత్రంగానే చేశారు. దీనికితోడు ఉప్పునకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా మారింది. ఉప్పు ఉత్పత్తి ఆశాజనకంగా సాగుతున్న తరుణంలో అకాల వర్షాల కారణంగా సాగు చేసిన ఉప్పు నీటిపాలయ్యేది. అప్పులు చేసి ఉత్పత్తి చేసిన ఉప్పంతా కళ్లేదుటే కొట్టుకుపోవడంతో ఆవేదన చెందారు. దీనికితోడు గత ప్రభుత్వం విధించిన అదనపు విద్యుత్ చార్జీలు వారి పాలిట శాపంగా మారాయి. ఉప్పు ఉత్పత్తి చేసే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తరుణంలో వారికి కొంత మేలు చేయాలన్న సంకల్పంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో రైతులు చెల్లిస్తున్న విద్యుత్ చార్జీలను భారీగా తగ్గించారు. ఒక యూనిట్‌కు రూ.4 చెల్లిస్తున్న తరుణంలో రైతులకు ఖర్చులు భారీగా పెరిగి ఉప్పు ఉత్పత్తి చేయడం మానుకునే తరుణంలో వైఎస్సార్ వారి కష్టాలను తెలుసుకున్నారు. 2008వ సంవత్సరం మార్చి 23వ తేదీన ఉప్పు రైతులకు విద్యుత్ యూనిట్ రూ.4 నుంచి కేవలం ఒక రూపాయికి తగ్గించారు. అయితే ఇది కొంత కాలమే ఉప్పు రైతులకు వరంగా మారింది. వైఎస్సార్ మరణాంతరం ఉప్పు రైతులను పట్టించుకునే నాథుడే కరువైనాడు. దీంతో మళ్లీ విద్యుత్ చార్జీలు యథావిధిగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉప్పునకు గిట్టుబాటు ధర లేని కారణంగా వైఎస్సారే బతికి ఉంటే గిట్టుబాటు ధర కలి్పంచేవారని రైతులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా తమ కష్టాలను గుర్తించి తమకు అండగా నిలవాలని ఉప్పు రైతులు కోరుతున్నారు. ఉప్పు రైతుల కష్టాలు తీర్చిన మహానేత ఉప్పు ఉత్పత్తిదారుల కష్టాలను తెలుసుకుని ఆదుకున్న మహానేత వైఎస్సార్. ఆయన కాలంలోనే మేమంతా ఆనందంగా ఉన్నాం. ఆయనే జీవించి ఉంటే ఉప్పునకు కూడా గిట్టుబాటు ధర కలి్పంచేవారు. ప్రస్తుతం పెరిగిన విద్యుత్ చార్జీలు, తగ్గిన ఉప్పు ధరలతో సతమతమవుతున్నాం. – చెంచురత్నం, రైతు -
ఉప్పు రైతు అప్పులు తీర్చిన వైఎస్సార్
ఉప్పు సత్యాగ్రహానికి నాంది పలికిన గడ్డ అల్లూరు. బ్రిటిష్ వారినే గడగడలాడించిన ఉప్పు రైతులు ఆనాటి పాలకుల దుర్మార్గ పాలనకు అప్పుల పాలయ్యారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక ఉద్యమ పాత్ర పోషించిన ఉప్పు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలులేదు. ఈ దశలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఉప్పు రైతుల కష్టాలు తీర్చేందుకు ఉదారంగా నడుంబిగించారు. ఉప్పు రైతులకు పెనుభారంగా మారిన విద్యుత్ చార్జీలను మూడింతలు తగ్గించి, పాత బకాయిలను సైతం మాఫీ చేసి, మెరుగైన మార్కెట్ సౌకర్యాన్ని కల్పించిన ఘతన ఆయనదే. వైఎస్సార్ మరణించి పదేళ్లు అయినా ఉప్పు రైతులు ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు. విడవలూరు: జిల్లాలో అల్లూరు, విడవలూరు, ముత్తుకూరు తీర గ్రామాలు ఉప్పు ఉత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలు. విడవలూరు మండలంలోని రామతీర్థం, అల్లూరు మండలంలోని ఇస్కపల్లి, గోగులపల్లి, ముత్తుకూరు మండలాల్లో సుమారు 4000 ఎకరాల్లో సొసైటీలు ద్వారా ఈ ఉప్పు ఉత్పత్తిని చేస్తుంటారు. వ్యవసాయాధారిత ప్రాంతాలైన ఈ మూడు తీర మండలాల్లో ఉప్పు ఉత్పత్తిది రెండో స్థానంగా నిలుస్తోంది. 2004 నాటికి ముందున్న ప్రభుత్వాల పాలనలో ఉప్పు రైతులు అప్పులు పాలయ్యారు. ఉప్పు ఉత్పత్తిలో కీలమైన విద్యుత్ చార్జీలు పెనుభారంగా ఉండేవి. అప్పట్లో యూనిట్ విద్యుత్ ధర రూ.4 ఉండేది. మరో పక్క మార్కెట్ సౌకర్యం లేక.. ప్రకృతి ప్రతికూల పరిస్థితుల్లో నష్టపోయి విద్యుత్ చార్జీలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉండేవారు. ఈ దశలో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఉప్పు ఉత్పత్తిదారులు కష్టాలను తెలుసుకున్నారు. రూపాయికి తగ్గిన విద్యుత్ చార్జీలు ఉప్పు ఉత్పత్తి చేసే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తరుణంలో వారికి కొంత మేలు చేయాలన్న ధేయ్యంతో వైఎస్సార్ రైతులు చెల్లిస్తున్న విద్యుత్ చార్జీలను భారీగా తగ్గించారు. 2008 మార్చి 23వ తేదీన ఉప్పు రైతులకు విద్యుత్ యూనిట్ రూ.4 నుంచి రూపాయికి తగ్గించారు. ఇది ఉప్పు రైతులకు వరంగా మారింది. అయితే వైఎస్సార్ మరణాంతరం ఉప్పు రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో మళ్లి విద్యుత్ చార్జీలు యథావి«ధిగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
సంక్షేమం ‘ఉప్పు’ పాతర
సాక్షి, చినగంజాం: ఉప్పు రైతులకు 2004కు పూర్వం, 2014 తరువాత గడ్డుకాలంగా చెప్పుకోవచ్చు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఉప్పు నిల్వలు విపరీతంగా పెరిగాయి. రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పేరుకు పోయిన ఉప్పు కువ్వలను తక్కువ ధరకు అమ్మి రైతులు సొమ్ము చేసుకోవాల్సి వచ్చింది. వైఎస్ ప్రభుత్వం హయాంలో ఉప్పు రైతులకు ఎన్నడూ లేని విధంగా విద్యుత్ బిల్లులో అనూహ్యరీతిలో రాయితీ, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు పంటనష్ట పరిహారం చెల్లింపు తక్షణమే అందజేసి ఆదుకున్నాడు. ఉప్పు రైతుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పంటనష్ట పరిహారం చెల్లింపు మహానేత వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయేలా చేశాయి. వైఎస్ అనంతరం వచ్చిన ప్రభుత్వాలు మళ్లీ తిరిగి విద్యుత్ బిల్లులను యథావిధిగా పెంచి వారు ఉసురుపోసుకున్నాయి. జిల్లాలో మొత్తం 3450 ఎకరాల్లో ఉప్పు సాగవుతుంది. ఏడాదికి 67,645 మెట్రిక్ టన్నులు ఉప్పు ఉత్పత్తి అవుతుంది. జిల్లాలోని పాకలలో 1085 ఎకరాలలో సాగవుతుండగా ఏడాదికి 12,940 మెట్రిక్ టన్నులు, పాదర్తి, కనపర్తిలలో 690 ఎకరాలలో 12 వేల మెట్రిక్ టన్నులు, చినగంజాం నార్త్ 475 ఎకరాలలో 8370 మెట్రిక్ టన్నులు, సౌత్‌లో 1200 ఎకరాల్లో 34,335 మెట్రిక్ టన్నులు ఉప్పు రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. ఉప్పు సాగు మీద జిల్లాలో వేలమంది సన్న, చిన్న కారు రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. టీడీపీ హయాంలో ఒక్క విద్యుత్ బిల్లుల పరంగా రైతులు తీవ్రంగానే నష్ట పోయారు. ఉప్పు సాగుకు ఒక ఎకరాకు నెలకు సుమారు 75 యూనిట్లు విద్యుత్ ఖర్చువుతుంది. ప్రతి ఏడాది తొమ్మిది నెలలపాటు ఉప్పు సాగవుతుంది. టీడీపీ హయాంలో యూనిట్‌కు రూ.4.05 చొప్పున రైతులను ముక్కుపిండి వసూలు చేశారు. జిల్లాలో వందలాది మంది రైతులు విద్యుత్ బిల్లులు కట్టలేక సతమతమయ్యారు. ప్రభుత్వం ఇస్తానన్న ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా విద్యుత్ బిల్లులు విపరీతంగా పెంచి వసూలు చేస్తుండటంతో సాగు చేయడమే మానేశారు. ఒక వైపు అనుకూలించని ప్రకృతి, పెట్టుబడులు విపరీతంగా పెరిగి పోవడం, పెరిగిన విద్యుత్ బిల్లులు ఉప్పు రైతులకు శాపంగా మారాయి. జిల్లాలోని 3450 ఎకరాల్లో ఒక ఎకరాకు 75 యూనిట్ల చొప్పున మొత్తం 2,58,750 యూనిట్లు విద్యుత్ అవసరం కాగా, చంద్రబాబు హయాంలో యూనిట్‌కు రూ.4.05 వంతున వసూలు చేశారు. విద్యుత్ బిల్లుల కోసం జిల్లాలోని ఉప్పు రైతులు ఒక నెలకు రూ.12,29,062 చెల్లించారు. ఉప్పు సాగు ఏడాదిలో కనీసం 9 నెలలు సాగనుండగా మొత్తం రూ 1,10,61,562 ఖర్చువుతుంది. ఇక వైఎస్ ప్రభుత్వం రూ.4.05 ఉన్న యూనిట్ విద్యుత్ ధరను రూ.1.05కు తగ్గించడంతో ఉప్పు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన పాలన సాగించిన ఆరేళ్లలో రైతులు బంగారం పండించుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉప్పు కొఠారులలో రైతుల నుంచి యూనిట్‌కు రూ.3.75 కరంటు చార్జీలు, కస్టమర్ చార్జీలు కలుపుకొని స్లాబు సిస్టం ప్రకారం రూ.4.05 వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఉప్పు రైతులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నానా ఇబ్బందులు పడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన ఉప్పుకు గిట్టుబాటు ధరలేక, పెట్టిన పెట్టుబడులు సకాలంలో అందక అప్పుల పాలవుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో రైతులకు ఏడుగంటల విద్యుత్ అందిస్తానని ఊక దంపుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఆచరణలో వచ్చేటప్పటికీ అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో రైతులు అవస్థలు పడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలేకపోవడం, విద్యుత్ చార్జీల భారం, కరెంటు కోత, ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టపోయిన రైతులను సకాలంలో ఆదుకోకపోవడం వంటి సమస్యలతో సతమతమయ్యారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకొనే లేదు బాబు హయాంలో పలు మార్లు తుఫాన్, వరద బీభత్సం కారణంగా కొఠార్లు మునిగి ఇబ్బందులు పడ్డాం. కనీసం పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇచ్చే ఆలోచన కూడా చేయలేదు. మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంట నష్ట పరిహారం ఇచ్చి ఆదుకున్నాడు. గతంలో ఏ నాయకుడు పంట నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అది ఆయనొక్కడికే సాధ్యమైంది. – రంగని వెంకటేశ్వర్లు రెడ్డి, మూలగాని వారిపాలెం రైతు టీడీపీ కాలంలో ఉప్పు సాగు చేయలేక పోతున్నాం టీడీపీ ప్రభుత్వం హయాంలో పూర్తిగా ఉప్పు సాగుకు దూరమవుతున్నాం. ఇక ముందు సాగు చేస్తామో లేదో అన్న భయం ఏర్పడింది. ఉప్పు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు మోసం చేశాడు. కరంటు బిల్లులు పేరుతో కష్టపడిన సొమ్ముంతా ప్రభుత్వానికే చెల్లించాల్సి వస్తుంది. – శవనం ఏడుకొండలు రెడ్డి, మూలగాని వారిపాలెం చంద్రబాబు హయాంలో గిట్టుబాటు ధర లేదు చంద్రబాబు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉప్పుకు గిట్టుబాటు ధర లభించలేదు. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. తక్కువ రేటుకు ఉప్పును అమ్ముకోవాల్సి వచ్చింది. వైఎస్ వచ్చాకే మాకు విద్యుత్ బకాయిలు, గిట్టుబాటు ధర లభించాయి. ఆయన పోవడంతోటే ఉప్పు రైతుల సంక్షేమం కూడా దెబ్బతింది. – గెల్లి వెంకట లక్ష్మీనారాయణ, చినగంజాం ఉప్పు రైతు కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం టీడీపీ ప్రభుత్వం హయాంలో కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడ్డాం, పడుతున్నాం. యూనిట్‌కు రూ.4.05 వసూలు చేస్తున్నారు. నెల తిరిగేసరికి బిల్లులు కట్టలేక సాగు ఖర్చు తడిసి మోపెడవుతుంది. మహానేత వైఎస్ వచ్చాక రూ.1.05 చేయడంతో ఊపిరి పీల్చుకున్నాం. అప్పులు తీర్చుకొని కాస్తంత అన్నం తినగలిగాం. మళ్లీ టీడీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నాం. – కుక్కల వెంకటేశ్వరరెడ్డి, ఉప్పు రైతు, రాజుబంగారుపాలెం -
ఉప్పు రైతు కుదేలు
వజ్రపుకొత్తూరు(పలాస) : అకాల వర్షాలు ఉప్పు రైతుల ఆశలను ఆవిరిచేస్తున్నాయి. మండుటెండలో ఒళ్లు గుళ్ల చేసుకుని పండించిన ఉప్పు పంట మొ త్తం సోమవారం రాత్రి కురిసిన జల్లులకు నాశనమైపోయింది. గత మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉప్పు పంట దిగుబడి బాగుందని ఆశించిన తరుణంలో అకాల వర్షం కురవడంతో ఈసారి తీవ్ర నష్టాలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వజ్రపుకొత్తూరు మండలంలోనే సుమారు రూ.5 లక్షల నష్టం సంభవించినట్లు ఉప్పు అధికారులు, రైతులు చెబుతున్నారు. తాజా వర్షాలతో ఉప్పు రాశులన్నీ వర్షార్పణం అయ్యాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. మడుల్లోనే ఉప్పు.. వజ్రపుకొత్తూరు మండలంలో కొండవూరు, నగరంపల్లి, పూండి గల్లీ పరిధిలో సుమారు 350 ఎకరాల్లో ఉప్పు పంట సాగవుతోంది. 520 మంది రైతులు, కార్మికులు ఉప్పు పరిశ్రమపై ఆధారపడి పని చేస్తున్నారు. ఒక రైతు ఏడాదికి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రూ.45 వేలు వరకు సంపాదిస్తాడు. ఈ ఏడాది మరికొద్దిరోజుల్లో విక్రయాలు ప్రాంభం అవుతాయనుకునే సమయంలో అకాల వర్షం కురవడంతో ఉప్పంతా మడుల్లోనే ఉండిపోయింది. ఉప్పు రాశులు తడిసిపోవడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో ప్రారంభంలోనే రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఒక్కో రైతుకు దాదాపు రూ.2 వేల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. వజ్రపుకొత్తూరు మండలంలో ఏటా సుమారు 675 టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడి నుంచి ఒడిశాకు తరలిస్తుంటారు. ఈ ఏడాది ఎగుమతి సగానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో బ్యాంకర్లు, ప్రభుత్వం స్పందించి తమకు రుణాలు ఇప్పించాలని, వరికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేలా ఉప్పు పంట నష్టానికి పరిహారం మంజూరు చేయాలని యూనియన్ అధ్యక్షుడు కొరికాన అప్పారావు, వై.కోదండరావు, గోపి, తదితరులు కోరుతున్నారు -
ఉప్పు రైతుకు అప్పు తిప్పలు
పట్టించుకోని ప్రభుత్వం ఆవేదనలో రైతులు పూసపాటిరేగ : జిల్లాలోని తీరప్రాంతంలో ఉప్పురైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు.ఉప్పుసాగుకు వేలల్లో ఖర్చు చేస్తున్నప్పటికీ, పంట చేతికందుతున్న సమయంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటకలిసిరాకపోవడంతో ఉప్పు రైతులు అప్పుల పాలవుతున్నారు. పూసపాటిరేగ మండలం కోనాడలో బ్రిటిష్ కాలంలో 1947 ముందు నుంచి ఉప్పుసాగవుతోంది. లక్షల రూపాయల మదుపులు పెట్టి సాగు చేసినదంగా హుద్‌హుద్ తుఫాన్ సమయంలో వృథా అయింది.తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పైసా కూడా పరిహారం అందించలేదు., ఉప్పుసాగుకు కావాల్సిన పరిస్థితులు అన్నీ కలిసి వచ్చిన తరువాత ప్రకృతి సహకరించక పోవడంతో ఖర్చు అంతా వృథా అవుతూ రైతులు నష్టపోతున్నారు. కొంత కాలంగా ఇదే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం ఆ రైతులను కనీసం పట్టించుకోవడం లేదు. ఆదుకోని ప్రభుత్వం ఉప్పురైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పురైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక శాఖ ఆధ్వర్యంలో రైతులకు కావాల్సిన రుణసౌకర్యాలతో పాటు, ఉప్పురైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉప్పుసాగును నిర్వీర్యం చేసేవిధంగా అధికారులు కనీసం పట్టించుకోవడంలేదు. దీంతో ఉప్పురైతులకు ప్రోత్సాహం కరువవడంతో పాటు పండించిన అరకొర పంటకు మార్కెట్లో గిరాకీ లేకపోవడంతో ఉప్పుసాగుపై రైతులు నిరాశ చెందుతున్నారు. ఉత్తరాంధ్రలో మూడుచోట్ల మాత్రమే ఉప్పు సాగవుతోంది. విజయనగరం జిల్లాలో కోనాడ,విశాఖ జిల్లాలో భీమిలి, శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం ప్రాంతాలలో మాత్రమే ఉప్పుసాగవుతోంది. తగ్గిన గిరాకి కొత్త కొత్త బ్రాండ్లతో రెడీమేడ్ ఉప్పు మార్కెట్లలోకి రావడంతో రైతులు తయారుచేసిన కల్లు ఉప్పుకు గిరాకీ తగ్గుతోంది. ఇక్కడ తయారు చేసిన ఉప్పు నిల్వ ఉంచిన చేపలు,రసాయన పరిశ్రమలలోకి మాత్రమే వాడుతున్నారు,ప్రజావసరాలుకు ఇక్కడ ఉప్పును వినియోగించకపోవడంతో ధరలు లేక రైతులు దివాలా తీస్తున్నారు. కేజీ ఉప్పు 1 రూపాయి చొప్పున కూడా కొనుగోలు చేసే వారు లేరని కోనాడకు చెందిన ఉప్పు రైతులు చాట్ల తోటరెడ్డి ,ఉల్లి అజయ్‌కుమార్ గోపాల్ ,కొల్లా వెంకటప్రసాదులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉప్పురైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ఉప్పు రైతు డీలా!
- ధరల పతనంతో ఆందోళన - పెట్టుబడులు దక్కని వైనం - పేరుకుపోయిన ఉప్పు నిల్వలు సింగరాయకొండ : ఉప్పు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండలంలో ఊళ్లపాలెం, పాకల, బింగినపల్లి ప్రాంతాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో రైతులు ఉప్పు పండిస్తున్నారు. పాకలలో సుమారు 100 ఎకరాలు, ఊళ్లపాలెంలో సుమారు 2,700, బింగినపల్లిలో 1200 ఎకరాల్లో ఉప్పు ఉత్పత్తి చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని భూములను లీజుకు తీసుకుని రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎండల కారణంగా ఉప్పు తయారీ గణనీయంగా పెరగడంతో ధరలు పడిపోవమేకాక, ఉత్పత్తికి తగ్గ అమ్మకాలు లేక ఉప్పు నిల్వలు పేరుకుపోతున్నాయి. 70 కిలోల బస్తా ఉప్పు తయారీకి సుమారు రూ.90 ఖర్చవుతుండగా, ప్రస్తుతం మేలు రకం ఉప్పు బస్తా ధర రూ.75 మాత్రమే పలుకుతోంది. నాణ్యత కొంచెం తగ్గిన ఉప్పు బస్తా ధర రూ.50గా ఉంది. ప్రస్తుతం ఉప్పు ధరకు, తయారీ ఖర్చుకు పొంతన లేకపోవడంతో నష్టానికి అమ్ముకోలేక, నిల్వ ఉంచుకోలేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంత భూములున్న కొందరు రైతులు ఉప్పు పండించడం మానుకోగా, లీజుదారులు మాత్రం ఉప్పు సాగు చేసినా, మానేసినా ఆర్థికంగా నష్టపోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన కూలి రేట్లు, డీజిల్ ధరలతో ఉప్పు తయారీ భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు తీవ్రంగా ఎండలు కాస్తుండడంతో తయారయ్యే ఉప్పు చేదుగా ఉంటోందని, ఇది అమ్మకానికి పనికి రాదని ఉప్పు రైతులు తెలిపారు. సాధారణంగా జూన్ నాటికి రాష్ట్రం మొత్తం మీద కొన్నిప్రాంతాల్లోనైనా వర్షాలు పడేవని, దీనివల్ల మిగతా చోట్ల తయారైన ఉప్పుకు డిమాండ్ ఉండేదని, ప్రస్తుతంలో రాష్ట్రంలో ఎక్కడా వాన జాడ లేకపోవడంతో అన్ని ప్రాంతాల్లో గణనీయంగా ఉత్పత్తి జరిగి ఎగుమతులు లేవని ఉప్పు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు ఎప్పుడు పడతాయో, గిట్టుబాటు ధర లభించి తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ఉప్పు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
నీరుగారిన ఉప్పు రైతు
సంతబొమ్మాళి, న్యూస్‌లైన్: ప్రకృతి వైపరీత్యాలతో ఉప్పు రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. నాలుగేళ్ల నుంచి అతలాకుతలమవుతున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఉప్పురైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో సుమారు రూ.50 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. మండలంలోని నౌపడ, భావన పాడు, మర్రిపాడు, యామలపేట, మూలపేట, లింగూడు పంచాయతీల్లో సుమారు 4800 ఎకరాల్లో ఉప్పును సాగు చేస్తున్నారు. ఉప్పు పంట సీజన్ కావడంతో డిసెంబర్ నుంచి మే వరకు ఉప్పు సాగు చేస్తారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు ఉప్పు కరిగిపోవడంతో ఆరు నెలల తమ శ్రమ నీటిపాలైందని వాపోతున్నారు. గతంలో పైలీన్ తుపానుతో నష్టం వాటిల్లినపుడు ఎకరాకు రూ.9 వేల పరిహారం కోరితే రూ.4 వేలు చెల్లించాలని అధికారులు ప్రతిపాదించారని, ఆ డబ్బులు ఇంతవరకు రాలేదని చెప్పారు. లైలా, నీలం, జల్ తుపాన్లకు సంబంధించి ఇంతవరకూ పరిహారం అందలేదన్నారు. తమకు సకాలంలో పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
ఉప్పు.. నిండా అప్పు
నరసాపురం అర్బన్, న్యూస్‌లైన్ : గిట్టుబాటు ధర లేదు.. గిడ్డంగులు లేవు.. అధికారిక గుర్తింపు లేదు.. నిత్యం దళారుల చేతిలో మోసం.. సమస్యలతో సహజీవనం.. ఇది నరసాపురం ప్రాంతంలో ఉప్పు రైతుల దుస్థితి. స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లు గడిచినా.. పాలకులు ఎందరు మారినా.. వీరి కష్టాలు.. కన్నీళ్లు మాత్రం కరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో 2012లో ఇక్కడ పర్యటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉప్పు రైతుల కష్టాలు తెలుసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ‘మీ కష్టాలన్నీ తీరుస్తా’ అని భరోసా ఇచ్చారు. దీంతో వీరంతా జననేత పాలన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పది వేల కుటుంబాలకు ఆధారం నరసాపురం ప్రాంతంలో 19 కిలోమీటర్ల మేర సముద్రం తీరం విస్తరించి ఉంది. తీర గ్రామాలైన పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, వేములదీవి, చినమైనవానిలంక, బియ్యపుతిప్ప, పేరుపాలెం గ్రామాల్లో సుమా రు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగుచేస్తున్నారు. సుమారు 10 వేల మత్స్యకార కుటుంబాలు ఉప్పు పంటనే జీవనాధారంగా బతుకుతున్నాయి. చేపల వేట మాదిరిగా ఉప్పు సాగు కష్టంతో కూడుకున్నది కావడం వీరిని ఇబ్బంది పెడుతోంది. దళారుల చేతిలో మోసం 60 రోజులపాటు 6 నుంచి 10 మంది రాత్రీపగలూ కష్టపడితే ఒక ఎకరంలో ఉప్పు పండుతుంది. ఇందుకు సుమారు రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఖర్చవుతోంది. తీరా పండించిన పంటను అమ్ముకునేందుకు మార్గం లేక రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితిలో అల్లాడుతున్నారు. రైతుల వద్దకు వచ్చి దళారులు బస్తా ఉప్పుకు ఇంత ధర అని నిర్ణయిస్తారు. ప్రస్తుతం రూ. 50 చొప్పున బస్తా కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్లో బస్తా ధర రూ. 250 నుంచి రూ.300 వరకు ఉంది. దీనిని బట్టి చూస్తే రైతులు ఏ మేర నష్టపోతున్నారో అర్థమవుతుంది. ప్రభుత్వ సాయం.. శూన్యం ఉప్పుకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉప్పు సాగును జాతీయ పంటగా గుర్తించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఇటు సరైన ధర లేక.. అటు ప్రభుత్వ సాయం అందక రైతులు కష్టాలను చవిచూస్తున్నారు. ప్రకృతి విపత్తులూ రైతులను వెంటాడుతున్నాయి. గిడ్డంగుల సదుపాయం లేక పండించిన ఉప్పు మడుల వద్ద రాశులుగా ఉంచడంతో నష్టాలు వాటిల్లుతున్నాయి. ఏమాత్రం వర్షం కురిసినా ఉప్పు మడుల్లోనే కరిగిపోతోంది. గతంలో లైలా, జల్, నీలం తుపానుల కారణంగా వేలాది ఎకరాల్లో ఉప్పు కరిగిపోయింది. అయినా ప్రభుత్వ సాయం అందలేదు. రైతులకు ప్రభుత్వం నుంచి రుణాలూ అందడం లేదు. దీంతో రైతులు అప్పులపాలవుతున్నారు. రాజన్న రాజ్యం కోసం ఎదురుచూపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2012లో నరసాపురం తీర గ్రామాల్లో పర్యటించారు. వేములదీవి గ్రామంలో ఉప్పు మడుల్లోకి దిగి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తా ను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉప్పు పంటపై ప్ర త్యేక దృష్టి పెడతానని.. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు గిడ్డంగుల ఏర్పాటుకు కృషిచేస్తానని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఇది రైతులు కొండంత భరోసా కల్పించింది. రైతులు ఆయన మాటల్ని గుర్తుచేసుకుంటూ రాజన్న రాజ్యం కోసం ఎదురుచూస్తున్నారు.