ఉప్పు.. నిండా అప్పు
నరసాపురం అర్బన్, న్యూస్‌లైన్ : గిట్టుబాటు ధర లేదు.. గిడ్డంగులు లేవు.. అధికారిక గుర్తింపు లేదు.. నిత్యం దళారుల చేతిలో మోసం.. సమస్యలతో సహజీవనం.. ఇది నరసాపురం ప్రాంతంలో ఉప్పు రైతుల దుస్థితి. స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లు గడిచినా.. పాలకులు ఎందరు మారినా.. వీరి కష్టాలు.. కన్నీళ్లు మాత్రం కరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో 2012లో ఇక్కడ పర్యటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉప్పు రైతుల కష్టాలు తెలుసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ‘మీ కష్టాలన్నీ తీరుస్తా’ అని భరోసా ఇచ్చారు. దీంతో వీరంతా జననేత పాలన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
పది వేల కుటుంబాలకు ఆధారం
నరసాపురం ప్రాంతంలో 19 కిలోమీటర్ల మేర సముద్రం తీరం విస్తరించి ఉంది. తీర గ్రామాలైన పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, వేములదీవి, చినమైనవానిలంక, బియ్యపుతిప్ప, పేరుపాలెం గ్రామాల్లో సుమా రు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగుచేస్తున్నారు. సుమారు 10 వేల మత్స్యకార కుటుంబాలు ఉప్పు పంటనే జీవనాధారంగా బతుకుతున్నాయి. చేపల వేట మాదిరిగా ఉప్పు సాగు కష్టంతో కూడుకున్నది కావడం వీరిని ఇబ్బంది పెడుతోంది.
దళారుల చేతిలో మోసం
60 రోజులపాటు 6 నుంచి 10 మంది రాత్రీపగలూ కష్టపడితే ఒక ఎకరంలో ఉప్పు పండుతుంది. ఇందుకు సుమారు రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఖర్చవుతోంది. తీరా పండించిన పంటను అమ్ముకునేందుకు మార్గం లేక రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితిలో అల్లాడుతున్నారు. రైతుల వద్దకు వచ్చి దళారులు బస్తా ఉప్పుకు ఇంత ధర అని నిర్ణయిస్తారు. ప్రస్తుతం రూ. 50 చొప్పున బస్తా కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్‌లో బస్తా ధర రూ. 250 నుంచి రూ.300 వరకు ఉంది. దీనిని బట్టి చూస్తే రైతులు ఏ మేర నష్టపోతున్నారో అర్థమవుతుంది.
ప్రభుత్వ సాయం.. శూన్యం
ఉప్పుకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉప్పు సాగును జాతీయ పంటగా గుర్తించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఇటు సరైన ధర లేక.. అటు ప్రభుత్వ సాయం అందక రైతులు కష్టాలను చవిచూస్తున్నారు. ప్రకృతి విపత్తులూ రైతులను వెంటాడుతున్నాయి. గిడ్డంగుల సదుపాయం లేక పండించిన ఉప్పు మడుల వద్ద రాశులుగా ఉంచడంతో నష్టాలు వాటిల్లుతున్నాయి. ఏమాత్రం వర్షం కురిసినా ఉప్పు మడుల్లోనే కరిగిపోతోంది. గతంలో లైలా, జల్, నీలం తుపానుల కారణంగా వేలాది ఎకరాల్లో ఉప్పు కరిగిపోయింది. అయినా ప్రభుత్వ సాయం అందలేదు. రైతులకు ప్రభుత్వం నుంచి రుణాలూ అందడం లేదు. దీంతో రైతులు అప్పులపాలవుతున్నారు.
రాజన్న రాజ్యం కోసం ఎదురుచూపు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2012లో నరసాపురం తీర గ్రామాల్లో పర్యటించారు. వేములదీవి గ్రామంలో ఉప్పు మడుల్లోకి దిగి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తా ను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉప్పు పంటపై ప్ర త్యేక దృష్టి పెడతానని.. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు గిడ్డంగుల ఏర్పాటుకు కృషిచేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇది రైతులు కొండంత భరోసా కల్పించింది. రైతులు ఆయన మాటల్ని గుర్తుచేసుకుంటూ రాజన్న రాజ్యం కోసం ఎదురుచూస్తున్నారు.