సాక్షి, ఏలూరు : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమానికి మద్దతు పలకని ఏ రాజకీయ పార్టీకైనా వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవని పశ్చిమగోదావరి జిల్లా సమైక్యవాదులు హెచ్చరించారు. ఏలూరు నగరంలోని ఐఏడీపీ హాల్‌లో ‘సాక్షి’ దినపత్రిక, ‘సాక్షి’ టీవీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన చైతన్యపథం ‘ఎవరెటు’ చర్చా వేదిక కార్యక్రమానికి సమైక్యవాదులు పెద్దఎత్తున తరలివచ్చారు. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసినట్టుగానే మిగిలిన పార్టీల నేతలూ వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
60 ఏళ్ల వయసులో ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరుతూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను చూసైనా పదవులు పట్టుకుని వేలాడుతున్న మంత్రులు, ఎంపీలు సిగ్గుపడాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా విజయమ్మలా పదవుల్ని వదిలిప్రజల్లోకి రాని నేతలను క్షమించేదిలేదని హెచ్చరించారు. రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా నది ఎండిపోతుందన్నారు. కృష్ణా నదికి నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ అడ్డు తగులుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు ఎల్. విద్యాసాగర్ మాట్లాడుతూ తెలంగాణలో సకల జనుల సమ్మెను రాజకీయ నాయకులు నడిపించారని, విభజన ప్రకటన వెలువడిన వెంటనే సీమాంధ్రలో ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమం ప్రారంభించారన్నారు.
న్యాయవాది పి. విజయలక్ష్మి మాట్లాడుతూ, తెలంగాణ ప్రక్రియ రాజకీయ నాయకులు అడుతున్న రాక్షస క్రీడ అని ధ్వజమెత్తారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తూ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌వీఎస్ ప్రసాదరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీకి సంబంధించిన 60శాతం ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలోని 123 ఆర్టీసీ డిపోలనూ మూసుకోవాల్సి వస్తుందన్నారు. ఏలూరు మర్చంట్స్ చాంబర్ అధ్యక్షుడు నేరెళ్ల రాజేంద్ర మాట్లాడుతూ.. అపరాలు, కొన్నిరకాల కూరగాయలు తెలంగాణ ప్రాంతం నుంచే ఇక్కడకు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రం ముక్కలైతే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని వివరించారు. జాతీయ విద్యాసంస్థలు, ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయని, సీమాంధ్రులే వాటిని అభివృద్ధి చేశారని జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల అధ్యక్షుడు ఎంబీఎస్ శర్మ చెప్పారు. ఇప్పుడు వాటిని వదులుకోమంటే విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు.
ఆందోళనను విరమించే ప్రసక్తే లేదు
రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు ఆందోళనను విరమించేది లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం మరో స్వాతంత్య్ర ఉద్యమాన్ని తలపిస్తోంది. ‘విభజించు-పాలించు’ అనే బ్రిటిష్ పాలకుల సిద్ధాంతం తరహాలోనే కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకుంటోంది. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరటం సిగ్గుచేటు.
- శైలజ, ఉపాధ్యారుుని
విద్యుత్ ఉత్పత్తి భారం అవుతుంది
రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ భారం అవుతుంది. జల విద్యుత్, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు మన దగ్గర ఉన్నా ఇంధన వనరు లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. దానివల్ల ఇక్క డి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇంధన కొరతతో మూతపడే ప్రమాదముంది. ఇది ఇరు ప్రాంతాలకు ఇబ్బం దికరమే. గ్యాస్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని కేసీఆర్, దిగ్విజయ్ మనకు సూచిస్తున్నారు. ప్రస్తుతం యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం రూపాయి ఉంటే గ్యాస్ వినియోగం వలన రూ.6 అవుతుంది. ఇది తీరని భారం.
- తురగా రామకృష్ణ, జిల్లా కన్వీనర్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
పదవుల్ని వదిలి ప్రజల్లోకి రండి
Published Thu, Aug 22 2013 1:35 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement