
3న రాష్ట్ర బంద్.. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు మలి విడత అసెంబ్లీలో చర్చకు రానున్న నేపథ్యంలో.. జనవరి 3న రాష్ట్ర బంద్‌కు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక (ఎస్‌ఆర్‌పీవీ) పిలుపు ఇచ్చింది. ఈ మేరకు జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. సమైక్య ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు శనివారం వివిధ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఏపీఎన్జీవో భవన్‌లో జరిగిన ఈ భేటీకి ఎస్‌ఆర్‌పీవీ చైర్మన్ అశోక్‌బాబు, కాంగ్రెస్ ప్రతినిధిగా మంత్రి శైలజానాథ్, టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బాబూ రాజేంద్రప్రసాద్, సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధిగా జగదీశ్ యాదవ్ , వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ నెల 21న జరిగిన భేటీకి హాజరైన పార్టీల్లో ఈసారి సీపీఎం, లోక్‌సత్తా హాజరుకాకపోగా.. ఎంఐఎం, వైఎస్సార్‌సీపీ దూరంగా ఉన్నాయి.
ఉదయం 11కు ప్రారంభం కావాల్సిన ఈ భేటీ 12.30కు మొదలై గంటన్నర పాటు జరిగింది. అనంతరం భేటీ తీర్మానాలు, జనవరి 2 నుంచి 10 వరకు నిర్వహించ తలపెట్టిన సమైక్య ఉద్యమ కార్యాచరణను అశోక్‌బాబు విలేకరులకు వెల్లడించారు. ఈ భేటీలో ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైద్యుల జేఏసీ కన్వీనర్ కడియాల రాజేంద్ర, పంచాయితీరాజ్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ మురళీకృష్ణ, మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు, ఏపీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు, ఎస్‌ఆర్‌పీవీ కన్వీనర్ శ్రీరామ్, సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కుమార్ చౌదరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్ష భేటీ తీర్మానాలు..
అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యేతో జిల్లా కేంద్రాల్లో 2వ తేదీన ఉదయం 11కు ప్రమాణాలు చేయించడం. సమైక్యాంధ్రకు మద్దతుగా గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామ సభలు నిర్వహించి, విభజనకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించడం. వివిధ రాజకీయ పక్షాలు రూపొందించిన ఫార్మాట్లలో అఫిడవిట్లను ఎమ్మెల్యేల నుంచి సేకరించి.. ఆయా పార్టీల ప్రతినిధుల ద్వారానే రాష్ట్రపతికి అందజేయడం.
ఉద్యమ కార్యాచరణ ఇలా: 2న ‘ఉద్యమ గర్జన’పేరిట విశాఖలో భారీ సభ. 3న రాష్ట్ర బంద్, అన్ని జిల్లా కేంద్రాలు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షా శిబిరాల ప్రారంభం. 4న అన్ని జిల్లాల్లో మానవహారాలు. 6న రిలే నిరాహార దీక్షలు, ప్రదర్శనలు. 7న విద్యార్థులతో దీక్షలు, ప్రదర్శనలు, 8న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో దీక్షలు, 9న రైతులతో నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, 10న మహిళలతో నిరాహార దీక్షలు.