నిజాయతీ రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం: జగన్ | Samaikya Sankharavam for honest Politics | Sakshi
Sakshi News home page

నిజాయతీ రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం: జగన్

Published Sat, Nov 30 2013 6:29 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

నిజాయతీ రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం: జగన్ - Sakshi

నిజాయతీ రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం: జగన్

కుప్పం: నిజాయితీతో కూడిన  రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం  బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ సాయంత్రం జరిగిన  సమైక్య శంఖారావం  భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పంలోకి ప్రవేశించిన జగన్కు అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు ఘనస్వాగతం పలికారు. జైజగన్ నినాదాలతో కుప్పం మారుమోగిపోయింది.

చిత్తూరు జిల్లా ప్రత్యేకతలు తెలియజేస్తూ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాయలు ఏలిన రతనాల సీమ - వెంకటేశ్వరుడు కొలువైన, కాణిపాకం వినాయకుడు ఉన్న నేల చిత్తూరు జిల్లా అని అన్నారు. చందమామలో  మచ్చలు ఉన్నట్లుగా మన చిత్తూరు జిల్లాకు రెండు మచ్చలు చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.  అది మన ఖర్మ అని కూడా అన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలతోపాటు అందరూ  సమైక్యంగా ఉండాలని కోరుకుంటుంటే వీరిద్దరూ విడిపోవాలని కోరుకుంటున్నారని విమర్శించారు. నిజాయితో కూడిన రాజకీయాలకు వారు దూరంగా ఉన్నారన్నారు.  సమైక్య శంఖారావం పిలుపుతో నాయకులలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రాన్ని ఎవరు విడగొడతారో చూద్దాం అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం అని పిలుపు ఇచ్చారు. ఎన్నికలు వస్తున్నాయి, 30 పైచిలుకు పార్లమెంటు స్థానాలు గెలుచుకుని  ఢిల్లీ కోటలు బద్దలు కొడదాం అన్నారు. కాంగ్రెస్ పెద్దలకు, ప్యాకేజీ అడుగున్న చంద్రబాబుకు రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాలు తెలుసా? అని అడిగారు. నీటి విషయాలు చూడండి. మహారాష్ట్ర అవసరాలు తీరిన తరువాత, కర్ణాకటలోని అల్మట్టీ డ్యామ్ నిండితే గానీ మన రాష్ట్రానికి నీరు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులలో మరో రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీళ్లు లేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చిరించారు. మిగులు జలాలపై మనకు ఉన్న హక్కును తీసివేసే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఇలా ఉంటే, విడిపోతే పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించాలన్నారు. చిన్న చిన్న ఉద్యోగులు తమ సంపాదనతో హైదరాబాద్లో ఇల్లులు కొనుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో ఆస్తుల విలువ పడిపోతే సోనియా గాంధీ ఇస్తారా? కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తారా? ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు నాయుడు ఇస్తారా? అని ప్రశ్నించారు. కుమ్మక్కు రాజకీయాలు చేసేది చంద్రబాబు, వేలెత్తి చూపేది జగన్వైపు అన్నారు. ఢిల్లీ అధికారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం ఇది అన్నారు.

విదేశీయుల భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ పార్లమెంటులో ఒక బిల్లు ఆమోదిస్తే, మీ పరిస్థితి ఏమిటని సోనియా గాంధీని ప్రశ్నించారు. కలసి ఉంటున్న తెలుగువారిని విడదీయాలని మీకు ఎలా అనిపించిందని సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ నేతలు కల్లు తాగిన కోతుల్లా తయారయ్యారని విమర్శించారు.
విభజనకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎందుకు లేఖ ఇవ్వలేదని ప్రశ్నించారు.

బూర్గుల రామకృష్ణారావు వంటి వారు విశాలాంధ్ర కోసం పోరాడారని, పదవులు వదులుకున్నారని గుర్తు చేశారు.
చరిత్ర తెలియనివారు బలంగా ఉన్న తెలుగుజాతిని విడగొట్టాలనుకుంటున్నారని బాధపడ్డారు. తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేయడానికి రాష్ట్రాన్ని విడగొడుతున్నారని మండిపడ్డారు. తన కొడుకుని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడానికి మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగులను భయపెట్టి వారితో సమ్మె విరమింపజేశారన్నారు. అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడంలేదు? సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం ఎందుకు ప్రవేశపట్టడంలేదు? అని కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు.  వైఎస్ హయాంలో కేంపస్ ఇంటర్వ్యూలు జరిగేవని,  ఏటా 57వేల ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు.  ప్రతి రాష్ట్రానికి వెళ్లి సమైక్యాంధ్రకు అక్కడి నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్ఫుడు ఈ రాష్ట్రం విడిపోతే, రేపు మీ రాష్ట్రాలు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని వారికి తెలియచెబుతున్నట్లు చెప్పారు.  అభివృద్ధిలో హైదరాబాద్ పరిస్థితి దిగజారిపోతోందన్నారు. కోయంబత్తూరు కూడా హైదరాబాద్ కంటే ముందు ఉందని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులకు పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఈ పరిస్థితులలో ఉద్యోగాలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. జై సమైక్యాంధ్ర, జై వైఎస్ఆర్, జై తెలుగుతల్లి అని నినాదాలు చేస్తూ జగన తన ప్రసంగాన్ని ముగించారు.  

అంతకు ముందు ఆయన కుప్పం మండలం తంబుగానిపల్లెలో వైఎస్ఆర్ ఆలయాన్ని ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement