అలుపెరగని యోధులు
Published Sun, Sep 29 2013 3:24 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యతో సీమాంధ్ర ఎడారిగా మారనుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు లేక పొలాలు రోడ్లుగా మారతాయని చెబుతూ సమైక్యవాదులు రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రను కొనసాగించాలని కోరుతూ చేపట్టిన ఉద్యమం 60వ రోజు శనివారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మంగళగిరిలో ఆదర్శ రైతుల ప్రదర్శన చేసి రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. దుగ్గిరాలలో ఉపాధ్యాయులు ప్రదర్శన చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. నరసరావుపేటలో అధ్యాపకులు వాహనాలు తుడుస్తూ నిరసన తెలిపారు.
తెనాలిలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. బాపట్లలో పాత బస్టాండు వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చిలకలూరిపేటలో మున్సిపల్ ఉద్యోగులు దీక్షలు చేపట్టారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయించారు. యడ్లపాడు మండలం బోయపాలెం డైట్ కళాశాల విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. మాచర్లలో ముదిరాజ్‌సంఘ నాయకుల ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్‌ల ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయాలను బంద్ చేయించి, రాస్తారోకో నిర్వహించారు.
గుంటూరులో...
విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంటర్ బోర్డు ఆర్జేడీ కార్యాలయం వద్ద జూనియర్ కళాశాలల అధ్యాపకులు చెవిలో పూలు, కళ్లకు గంతలు కట్టుకుని ఆకులు తింటున్న విధంగా సీమాంధ్ర ఎంపీల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి హిందూకళాశాల సెంటర్ వరకు ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించి, అనంతరం 60 మంది ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. కలెక్టరేట్ ఎదుట పంచాయతీరాజ్ ఉద్యోగులు వంటావార్పు, సహకార ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
Advertisement
Advertisement