కిరణ్, బొత్సలకు సమైక్యాంధ్ర సెగ | samaikyandhra shock to cm kiran kumar reddy ,botsa satyanarayana | Sakshi
Sakshi News home page

కిరణ్, బొత్సలకు సమైక్యాంధ్ర సెగ

Published Mon, Aug 5 2013 12:47 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

కిరణ్, బొత్సలకు సమైక్యాంధ్ర సెగ - Sakshi

కిరణ్, బొత్సలకు సమైక్యాంధ్ర సెగ

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలకు సమైక్యాంధ్ర సెగ తగిలింది. మంత్రి ఎన్.రఘువీరారెడ్డి మాతృమూర్తి వైకుంఠ సమారాధనలో పాల్గొనేందుకు ఆదివారం వారు అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం వచ్చారు. రఘువీరాను పరామర్శించి.. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే సీఎం, పీసీసీ చీఫ్‌లను చూసిన ఉద్యమకారులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్దపెట్టున నినదించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిద్దరూ అక్కడినుంచి వెళ్లిపోయారు. మడకశిర పట్టణంలో జేఏసీ, వివిధ వర్గాల ఆధ్వర్యంలో భారీఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఒక యువకుడు ఆత్మహత్యకు యత్నించగా, రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సమైక్యవాదులు ధ్వంసం చేశారు. ఆరు వాహనాలపై దాడిచేసి అద్దాలు పగులగొట్టారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని అడ్డుకుని.. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అద్దాలు ధ్వంసం చేశారు.
 
 ఎంపీకి సమైక్యవాదుల ‘చింత’
 తిరుపతి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎంపీ చింతా మోహన్ ఏర్పాటుచేసిన సమావేశాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించాలని, తక్షణం ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్  చేశారు. వీరికి మద్దతుగా వంద బైక్‌లతో వచ్చిన స్కూటర్ మెకానిక్‌లు అతిథిగృహం బయట హారన్లు, నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు గెస్ట్‌హౌస్ గేట్లు మూసివేసి వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ తాను ఉత్తుత్తి రాజీనామాలు చేయనని, కేవలం కొందరు రాజకీయ ప్రయోజనాలు, ప్రచారం కోసం  రాజీనామాల నాటకమాడుతున్నారని ధ్వజమెత్తారు. అవసరమైతే ఒక రైలు బోగి నిండా పట్టే జనాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని వద్ద సమైక్యవాదాన్ని విన్పిస్తానన్నారు.
 
 ‘అనంత’ను అడ్డుకున్న విద్యార్థులు
 శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో ఆమరణదీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని జేఏసీ నేతలు అడ్డుకున్నారు, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఎంపీ పదవికి రాజీనామా సమర్పించి ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటున్నట్లు ఎంపీ తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement