సాక్షి, గుంటూరు
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహిస్తున్న ‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభకు జిల్లా నుంచి వేలాది మంది తరలి వెళుతున్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునే శక్తి ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని ఎలుగెత్తి చాటి చెప్పేందుకు శంఖారావం సభలో పాల్గొనేందుకు బయలుదేరారు. పార్టీ శ్రేణులతో పాటు సమైక్యాన్ని కాంక్షించే పలు ప్రజా, ఉద్యోగ సంఘాలు తరలి వెళుతున్నాయి.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో శుక్రవారం రాత్రి పార్టీ నేతలు, కార్యకర్తలు రైళ్లు, బస్సులలో హైదరాబాద్ బయలుదేరారు. సమైక్య సభకు వచ్చే వారి కోసం మొత్తం మూడు రైళ్లు, 610 బస్సులు ఏర్పాటు చేశారు. ఇవికాక ఎక్కడికక్కడ కార్లు కూడా బయలుదేరుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా ఇప్పటి ఇబ్బందుల కన్నా భవిష్యత్తులో తలెత్తే సమస్యలు ఎదురయ్యే ఇబ్బందులే ప్రమాదమని సమైక్య దండు కదిలింది. ఆ పార్టీ శాసన సభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి బస్సులు, కార్లలో పార్టీ కార్య కర్తలంతా శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలో పార్టీ కేడర్ మొత్తం శనివారం తెల్లవారు జామున బయలుదేరుతున్నారు. సత్తెనపల్లి నుంచి పార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో బస్సులు, కార్లలో ఆ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ శ్రేణులు సమైక్య శంఖారావానికి బయలుదేరారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి జిల్లా కన్వీనరు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో వేలాది మంది ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో తరలి వెళ్లారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి నుంచి 20 బోగీలతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. దుగ్గిరాల మండలం నుంచి బస్సులు ఏర్పాటు చేయడంతో వేలాదిగా పార్టీ కార్యకర్తలు, మహిళలు సమైక్య శంఖారావానికి వెళ్లారు.
తెనాలి నుంచి ప్రత్యేక రైలులో...
గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు వల్లభనేని బాలశౌరి తెనాలి నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడంతో అక్కడి నుంచి సమైక్య శంఖారావానికి శ్రేణులు తరలివెళ్లాయి. తెనాలి నుంచే అక్కడి సమన్వయకర్త గుదిబండి చిన వెంకటరెడ్డి బస్సులను ఏర్పాటు చేశారు. పొన్నూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు సమన్వయకర్త రావి వెంకటరమణ పొన్నూరు నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడంతో పార్టీ కేడర్ మొత్తం తరలి వెళ్లింది. బాపట్ల నుంచి కోన రఘుపతి ఆధ్వర్యంలో బస్సులు, ప్రత్యేక వాహనాలు, కార్లలో వెళ్లగా, గురజాల నియోజకవర్గంలో సీజీసీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి బస్సులు, కార్లు, రైలులో వెళ్లేందుకు అనువుగా ఏర్పాట్లు చేయడంతో పార్టీ కేడర్ కదిలింది. వేమూరు నియోజకవర్గంలో మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో కార్యకర్తలు తరలివెళ్లారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ నియోజకవర్గంలో డాక్టర్ నన్నపనేని సుధ, తాడికొండ నుంచి నియోజకవర్గ సమన్వయకర్తలు ఈపూరి అనూప్, మందపాటి శేషగిరిరావు, కొల్లిపర రాజేంద్రప్రసాద్, పెదకూరపాడు నియోజకవర్గంలో సమన్వయకర్తలు నూతలపాటి హనుమయ్య, బొల్లా బ్రహ్మనాయుడు, రాతంశెట్టి సీతారామాంజనేయులు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేయడంతో వేలాదిగా వెళ్లారు.
గుంటూరు నుంచి భారీగా తరలిన పార్టీ శ్రేణులు
గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. ఆ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులు, కారుల్లో పార్టీ శ్రేణులు చుట్టుగుంట నుంచి బయలుదేరారు. అప్పిరెడ్డి జెండా ఊపి వాహన శ్రేణిని బయలుదేరదీశారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ షౌకత్, నసీర్ అహ్మద్‌లు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేశారు. పార్టీ యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్ నాయుడు ఏర్పాటు చేసిన బస్సులు, కార్లలోనూ నగరం నుంచి యువత తరలి వెళ్లింది. ట్రేడ్ యూనియన్ నగర కన్వీనరు షేక్ గులాం రసూల్, పార్టీ నాయకుడు మహ్మద్ ముస్తఫా, విద్యార్థి యూనియన్ నగర కన్వీనర్ పానుగంటి చైతన్య, ఏటిగడ్డ నరసింహారెడ్డి, నూనె ఉమామహేశ్వర రెడ్డి ప్రైవేట్ బస్‌లు, కార్లు ఏర్పాటు చేశారు.