సమంత సందడి..
కలిసి పనిచేసేందుకు ప్రత్యూష సపోర్ట్ చారిటీ, ఆంధ్రాహాస్పిటల్స్ ఒప్పందం
జీవన్మరణ వ్యాధులతో బాధపడేవారిని ఆదుకోవాలని నిర్ణయం
విలేకరుల సమావేశంలో వెల్లడించిన సమంత, డాక్టర్ రమణమూర్తి
ఆంధ్రాహాస్పిటల్స్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది : సమంత
ప్రాణాపాయంతో బాధపడే పిల్లలకు వైద్యం అందించేందుకు ప్రత్యూష సపోర్ట్ చారిటీస్ సంస్థ నిర్వాహకురాలు, సినీ హీరోయిన్ సమంత నగరంలోని ఆంధ్ర ఆస్పత్రితో కలిసి పనిచేయనున్నారు. ఆమె బుధవారం నగరంలోని ఆస్పత్రికి వచ్చి ఎండీ డాక్టర్ రమణమూర్తితో చర్చించారు.
లబ్బీపేట : ప్రముఖ సినీ హీరోయిన్ సమంత తన సేవా కార్యక్రమాలను నగరానికి విస్తరించారు. జీవన్మరణ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు ఇప్పటికే అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్న ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గవర్నర్‌పేటలోని ఆంధ్రాహాస్పిటల్స్‌లో చిన్నారుల వార్డును సమంత బుధవారం సందర్శించి, అక్కడి బాలలతో కొద్దిసేపు గడిపారు. అనంతరం సమంత విలేకరులతో మాట్లాడారు. చిన్నారులకు వైద్య సేవలందించేందుకు తాను 2012 అక్టోబర్‌లో ప్రత్యూష సపోర్టు చారిటీస్ ట్రస్టును ఏర్పాటుచేశానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యున్నత సేవలు అందించే ఆస్పత్రిగా గుర్తింపు పొందిన ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక నుంచి తమ సేవా సంస్థ ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి సేవలను మరింత విస్తృతం చేస్తుందని తెలి పారు.
ఆంధ్రా హాస్పిటల్స్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ పి.వి.రమణమూర్తి మాట్లాడుతూ ప్రాణాపాయ వ్యాధులతో బాధపడే పిల్లలు, అత్యవసర వైద్యం, ఇంటెన్సివ్ కేర్ ట్రీట్‌మెంట్ అవసరమైన పిల్లలకు తగిన ఆర్థికసాయం, అత్యుత్తమ వైద్యం అందించి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి రక్షించడమే తమ సంస్థల ఉద్దేశమన్నారు. వైద్య ఖర్చులో మూడో వంతు ప్రత్యూష చారిటీస్, మరో మూడో వంతు తమ ఆస్పత్రి భరిస్తాయని, మిగిలిన మొత్తం తల్లిదండ్రులు సమకూర్చుకోవాలని తెలిపారు. ఆస్పత్రి పిడియాట్రిక్ విభాగం చీఫ్ డాక్టర్ పి.వి.రామారావు మాట్లాడుతూ ఇప్పటికే ప్రత్యుష చారిటీ సహకారంతో ఆరు నెలల చిన్నారికి విజయవంతంగా గుండె ఆపరేషన్ చేశామని తెలిపారు. ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పాతూరి పద్మ, కార్డియాలజిస్టు డాక్టర్ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.