మహానేతకు ఘనంగా నివాళి
తెలంగాణ, ఏపీలో శ్రద్ధాంజలి ఘటించిన ప్రజలు
* వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సేవా కార్యక్రమాలు
* వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు
సాక్షి, హైదరాబాద్ : మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 6 వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఆయనకు సర్వత్రా ఘనంగా నివాళులర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు వైఎస్సార్‌ను స్మరించుకుని శ్రద్ధాంజలి ఘటించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా బయలుదేరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కూడలి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ ఉంచిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వైఎస్సార్ అమర్‌హై, వైఎస్సార్ ఆశయాలు నెరవేరుస్తాం, జగన్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడినుంచి అందరూ నేరుగా శాసనసభా సమావేశాలకు వెళ్లారు.
అసెంబ్లీలో వైఎస్సార్ ఫొటోను పునరుద్ధరించాలి: ఉమ్మారెడ్డి
శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోయిన వైఎస్సార్ ఫొటోను అసెంబ్లీ లాంజ్‌లో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, అలాంటి మహానుభావుడి ఫొటోను తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలపై నిర్దిష్టమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి వైఎస్సార్ అని శ్లాఘించారు.
అందరినీ ఆదరించిన నేత: పొంగులేటి
అపర భగీరథుడు, ప్రతి పేదవాడికి సంక్షేమఫలాలు అందాలని కలలు కన్న మహానేత వైఎస్సార్ అర్ధంతరంగా మరణించడం తీరని నష్టమని పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ మరణంపై పార్టీలకు అతీతంగా అందరూ బాధపడ్డారన్నారు.
వైఎస్సార్ కలలు, ఆశయాలు నెరవేర్చుకోవడానికి రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్‌సీపీని అభివృద్ధి చేసుకుందామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వర్ధంతి కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, దుర్గాప్రసాదరాజు, ఇతర నాయకులు కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాష్, గాదె నిరంజన్‌రెడ్డి, మతీన్‌బై, పుత్తా ప్రతాపరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ ప్రపుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గాంధీభవన్‌లో శ్రద్ధాంజలి
దేశ చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి నేత మరొకరి లేరని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ ఆశయసాధనకు కాంగ్రెస్ పార్టీ పునరంకితమవుతుందన్నారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, కేవీపీ రామచంద్రరావు, ఆనం రామనారాయణరెడ్డి, దానం నాగేందర్, అంజన్‌కుమార్‌యాదవ్, కాసు కృష్ణారెడ్డి, వట్టి వసంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ చిత్రపటానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.