సమన్వయంతోనే అభివృద్ధి | Samanvayantone development | Sakshi
Sakshi News home page

సమన్వయంతోనే అభివృద్ధి

Published Thu, Jan 9 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

Samanvayantone development

=జిల్లా కలెక్టర్ కిషన్
 =పథకాలను గ్రామస్థాయిలో అమలు చేయాలి
 =లోపాలుంటే అధికారుల దృష్టికి తేవాలి
 =బ్యాంకు ఖాతాలకు 16 నుంచి స్పెషల్ డ్రైవ్

 
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని కలెక్టర్ జి.కిషన్ సూచించారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో గ్రామ దర్శిని కార్యక్రమం అమలుపై జిల్లా, ఆదర్శ అధికారులు, సర్పంచ్‌లతో వరంగల్ డివిజన్‌స్థాయి సమీక్ష సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో గ్రామ ఆదర్శ అధికారుల విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు.

దశాబ్దాలుగా గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు జరుగుతున్నా ప్రజల అవసరాలకు అనుగుణంగా హేతుబద్దంగా ప్రయోజనం చేకూరడం లేదన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేసేందుకు దిక్సూచిగా ఉండేందుకు ఆదర్శ అధికారులను నియమించామన్నారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల అమలులో లోపాలుంటే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు.

వారంలో ఒకరోజు పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, హాస్టల్, రేషన్ షాపులను సందర్శించి వాటి పనితీరును పరిశీలించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు సేవాభావంతో పనిచేయాలన్నారు. గ్రామాల్లో ప్రతీ ఒక్కరిని అక్షరాస్యలుగా తీర్చిదిద్దాలన్నారు. ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు బ్యాంక్ అకౌంట్‌లు ప్రారంభించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

జిల్లా ఇన్‌చార్జ్ అధికారి, రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో వీధి దీపాలు నిరంతరాయంగా వెలగకుండా చూడాలన్నారు. ప్రతీ ఒక్కరు విద్యుత్‌ను పొదుపు చేయాలన్నారు. సమావేశంలో ఏజేసీ బి.సంజీవయ్య, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డీఆర్‌డీఏ పీడీ ఎస్.విజయ్‌గోపాల్, డీపీఓ మోహన్‌నాయక్, డ్యామా పీడీ హైమవతి, డీఎంఅండ్‌హెచ్‌ఓ పి.సాంబశివరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

కార్యక్రమం ఓకే..  సమస్యలకు పరిష్కారమే లేదు..

కార్యక్రమం బాగున్నా.. సమస్యలు మాత్రం సకాలంలో పరిష్కారం కావడం లేదని పలువురు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ దర్శిని కార్యక్రమం అమలుపై వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రతీ శుక్రవారం ఆదర్శ అధికారి గ్రామానికి వచ్చి సమావేశం నిర్వహించి  సమస్యలు తెలుసుకుంటున్నారని, ఇవి వారం తర్వాత జరిగే సమావేశం నాటికి కూడా పరిష్కారం కావడం లేదన్నారు.

ఆదర్శ అధికారుల సమావేశాల ద్వారా అభివృద్ధిలో ముందుకు పోయే మార్గం కనపడుతున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మరో సమస్యకు దారి తీస్తోందన్నారు. సమస్య పరిష్కారానికి నిధులు వెచ్చించే అధికారం ఆదర్శ అధికారికి లేకపోవడంతో ఫలితం లేకుండా పోతోందన్నారు. అలాగే రెండు నుంచి నాలుగు గ్రామాలకు ఒకే పంచాయతీ కార్యదర్శి ఉండడం మరో సమస్యగా మారిందన్నారు.

వారంవారం కాకుండా 15 రోజులకోసారి సమావేశాలు నిర్వహించాలని కొందరు సర్పంచ్‌లు, నెలకోసారి నిర్వహించాలని మరికొందరు సర్పంచ్‌లు సూచించారు. వలస వెళ్తున్న వారి ఓటు హక్కు, ఆధార్, రేషన్ కార్డు, పింఛన్‌ను తొలగించొద్దన్నారు. అధికారులతో మాట్లాడడానికి సర్పంచ్‌లకు సీయూజీ సిమ్‌లు అందించాలని, గౌరవ వేతనం పెంచాలని కోరారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలకు అనుకూలంగా లేని సర్పంచ్‌లున్న గ్రామాల్లో ఆ ఎమ్మెల్యే అధికారులను ప్రభావితం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని కొందరు సర్పంచ్‌లు ఆరోపించారు.
 
సృజనాత్మకత తో పని చేయాలి : కలెక్టర్
 
గ్రామ అదర్శ అధికారులు సృజనాత్మకతతో పని చేయాలని కలెక్టర్ జి.కిషన్ సూచించారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో అధికారులతో వరంగల్ డివిజన్‌స్థాయి సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ఆదర్శ అధికారులు అన్ని శాఖలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామ దర్శిని కరదీపికను పూర్తిగా చదివి అవ గాహన ఏర్పరచుకోవాలన్నారు. గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే ఆదర్శ అధికారులకు అందిస్తామన్నారు.  

ఇందిరమ్మ గృహ నిర్మాణం, పరిశుభ్రత, ఎన్‌బీఏ పథకాల అమలును తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. మార్చిలో పదో తరగతి పరీక్షలు ఉన్నందున పాఠ శాలలను తప్పనిసరిగా తనిఖీ చేసి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. ఈనెల 24న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించి ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించాలని ఆయన సూచించారు.

ఏజేసీబి.సంజీవయ్య మాట్లాడుతూ మంగళవారం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌ను త్వరగా ముగించాలన్నారు. సోమవారం మండలం నుంచి నివేదికలను తెప్పించుకొని, సమీక్ష నోట్‌ను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మండల అధికారులంతా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని అన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డీఎంఅండ్‌హెచ్‌ఓ పి.సాంబశివరావు, డీఆర్‌డీఏ పీడీ విజయ్‌గోపాల్, గృహ నిర్మాణ సంస్థ పీడీ లక్ష్మణ్, డ్వామా పీడీ హైమవతి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement