‘కాపు’లపై శ్వేతపత్రం విడుదల చేయూలి
బీసీ రిజర్వేషన్ పరిరక్షణ వేదిక చైర్మన్ సాంబశివరావు
తెనాలి టౌన్ : కాపులను బీసీల్లో చేరిస్తే బీసీలకు నష్టం జరగదని టీడీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ వేదిక చైర్మన్ సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపేటలోని ఎన్‌జీవో కల్యాణ మండపంలో బీసీ రిజర్వేషన్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన సాంబశివరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ పరిరక్షణ కోసం జిల్లాలవారీగా సభలు, సమావేశాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సభలు నిర్వహించి రాష్ట్ర రాజధానిలోని బీసీ ఐక్య గర్జనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎంబీసీ జాతీయ అధ్యక్షుడు యూవీ చక్రవర్తి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ పరిరక్షణ కోసం 54 శాతం ఉన్న బీసీలందరూ ఏకకులంగా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కుమ్మరి శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజవరపు ఏడుకొండలు, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోలా శంకర్, నాయకులు టి.ఆశోక్‌యాదవ్, కందుల సాంబశివరావు గౌడ్, పి.సుఖదేవయ్య, జి.అమేశ్వరరావు, జయలత, వేల్పూరి వెంకటేశ్వర్లు, గండికోట నరసింహారావు, వివిధ వర్గాలకు చెందిన బీసీ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.