ఒకేరోజు రూ.2.49 కోట్లు..
♦ నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ నుంచి విత్‌డ్రా
♦ వ్యాపారులతో ఎస్‌బీఐ అధికారుల కుమ్మక్కు
♦ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో బయటపడిన నిర్వాకం
సాక్షి, విశాఖపట్నం: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో ఉన్న నగదును విత్‌డ్రా చేసుకో వాలంటే సవాలక్ష నిబంధనలు, పరిమితులతో జనం అల్లా డారు. కానీ ఆ వ్యాపారులకు అవి అడ్డురాలేదు. బ్యాంకు అధికారుల సహకారంతో ఒకేరోజు రూ. 2.49 కోట్లు విత్‌డ్రా చేసు కున్నారు. ఈ ఉదంతం పశ్చిమగోదా వరి జిల్లా తణుకు ఎస్‌బీఐలో చోటు చేసుకుంది. కొందరు వ్యాపారులతో బ్యాంకు అధికారులు కుమ్మకై నిబంధనలకు విరుద్ధంగా విత్ డ్రాకు సహ కరించారు. దీన్ని సీబీఐ పసి గట్టింది. ఐదుగురు బ్యాంకు అధికారులతోపాటు 8 మంది వ్యాపారులపై కేసు నమోదు చేసింది. వివరాల్ని సీబీఐ ఎస్పీ ఆర్.గోపాలకృష్ణ బుధవారం వెల్లడించారు. కేంద్రం పెద్దనోట్లను రద్దు చేశాక నగదు ఉప సంహరణపై పరిమితులు విధించడం తెలిసిందే.
అయితే తణుకు ఎస్‌బీఐ మెయిన్ బ్రాం చ్ ఏజీఎం కె.వి.కృష్ణారావు, అసిస్టెంట్ మేనేజర్ ఎస్.బాలాజీ, డిప్యూటీ మేనేజర్లు జి.ఇజ్రాయిల్ రాజు, ఎల్.వి. నవీన్, రామచంద్రరాజులు ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. శ్రీ రామకృష్ణ రా అండ్ పార్‌బాయిల్డ్ రైస్‌మిల్, పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విజయశ్రీ ఫుడ్స్, గౌతమ్ కన్‌స్ట్రక్షన్స్, మహేశ్వరి కోకోనట్ కంపెనీ, రవళి స్పెన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ హెయిర్ లిమిటెడ్, హేమాద్రి రైస్‌మిల్, నిషి ఎగ్ పౌల్ట్రీ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు చెందిన రూ.2.49 కోట్లను ఒక్కరోజులో విత్‌డ్రా చేయించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపి 14 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల నివాసాల్లో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లు, రూ.2.11 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.మరికొందరు ప్రభుత్వాధికారులూ నిబంధనలకు విరుద్ధంగా ఇదే బ్రాంచ్‌లో నగదు ఉపసంహరణ చేసుకున్నట్లు సీబీఐ గుర్తించింది.