సంచారజాతుల అభ్యున్నతికి ప్రత్యేక కమిషన్: దత్తాత్రేయ
సాక్షి,హైదరాబాద్: సంచార జాతుల వారి అభ్యున్నతికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు అవసరమని తద్వారా వారి ప్రగతికి బాటలు వేయవచ్చని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ జాతులవారు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి సం బంధిత మంత్రిత్వశాఖ దృష్టికి తెస్తానని హామీ ఇచ్చారు. బుధవారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో ‘కళా ప్రదర్శన - రాష్ట్ర మహాసభ’ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రబడ్జెట్‌లో రూ.500 కోట్లతో సంక్షేమ నిధిని వారి కోసం ఏర్పాటు చేయాలన్నారు. కర్మన్‌ఘాట్ వద్ద 1000 ఇళ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటుతో వారి సమస్యలను పరిష్కరించేందుకు వీలుంటుందని చెప్పారు. కార్మిక శాఖ తరపున ఉపాధి కల్పించి స్టైఫండ్ ఇచ్చి అనంతరం పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. ఈ జాతులను ఎస్టీల్లో చేర్చేం దుకు సీఎం కేసీఆర్ కృషి చేయాలన్నారు.
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సంచార కులాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ సంచార జాతుల వృద్ధకళాకారులకు పింఛన్ ఇప్పిస్తానని చెప్పారు. నేషనల్ డి.ఎన్.టి.ఫోరం అధ్యక్షుడు బాలకృష్ణ రేనుకే మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం సంచార, విముక్త జాతులకు పది శాతం ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. నేషనల్ డి.ఎన్.టి. ఫోరం అధ్యక్షుడు ప్రొఫెసర్ బాలగురుమూర్తి మాట్లాడుతూ తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఉన్న సంచార జాతుల స్థితిగతులపై అధ్యయనానికి కమిషన్ ఏర్పాటు అవసరమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సంచార జాతుల సం ఘం అధ్యక్షుడు వై. వెంకటనారాయణ, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ ఐ.తిరుమల, కాంగ్రెస్ నేత వి. కృష్ణమోహన్ పాల్గొన్నారు.
ప్రదర్శనతో హోరెత్తిన రవీంద్రభారతి
సంచార జాతుల రాష్ట్ర మహాసభ సందర్భంగా రవీంద్రభారతి ప్రాంగణంలోనూ, రవీంద్రభారతి వేదికపైన నిర్వహించిన కళారూపాల ప్రదర్శన ఆకట్టుకుంది. గంగిరెద్దుల ఆటలు, బుర్రకథలు, తోలు బొమ్మల ఆటలు, యక్షగానాలు, నాటకాలు, బాగోతాలు, సర్కస్, పటం కథలు వీర నాట్యం మొదలైన కళా రూపాల ప్రదర్శనలు నిర్వహించారు.