nomadic
-
‘హార్మోనియం’ బతుకులు అబ్బా!
సాక్షి, న్యూఢిల్లీ: ‘దూరాన ఊరు కనిపిస్తోంది. ఆకాశం దట్టంగా మబ్బుపట్టింది. వర్షం వస్తుందన్న భయంతో వడి వడిగా అడుగులు వేస్తున్నాం. ఆడవాళ్ల చంకల్లో పిల్లలు ఆకలితో కేకలు వేస్తున్నారు. మగవాళ్లు మూట ముళ్లె, తట్టా బుట్టా, టెంటు పట్టుకొని ప్రయాస పడి నడుస్తున్నారు. నడవలేక నడవలేక ముసలి ముతక మూలుగుతూ దగ్గుతూ వెంట వస్తున్నారు. ఇంతలో ఊరు రానే వచ్చింది. అంతలో చినుకు, చినుకు మొదలయింది. పిల్లల్ని ఎత్తుకొని ఆడవాళ్లు చెట్ల కింద చేరగా రోడ్డుపక్కన టెంట్లు వేసేందుకు మగవాళ్లు ప్రయత్నిస్తున్నారు. స్థానికులు రానే వచ్చారు. ఎవరని దబాయించారు. చెప్పాం. పోలీసులను పిలిపిస్తామని బెదిరించారు. మరో ఊరు చూసుకోమని సూచించారు. చేసేది లేక మళ్లీ మూట మూళ్లె సర్దుకున్నాం. వర్షం పెరిగింది. అలా రాత్రంతా తడుస్తూ మరో ఊరు వైపు వెళ్లాం. తడిసి ముద్దయిన పిల్లలకు జ్వరాలు వచ్చాయి. ముసలి వాళ్లు వణికిపోతున్నారు. మా సంగతి పక్కన పెట్టండి. పిల్లలు, ముసలివాళ్లకు ఆ రాత్రి గంజి మెతుకులు లేవు’ అని మహారాష్ట్రలోని సింధూదుర్గ్ జిల్లా దోడామార్గ్ గ్రామంలో తమకెదురైన ఓ అనుభవం గురించి సజింద్ యాదవ్ మీడియాకు వివరించారు. ఆయన గ్రామం మధ్యప్రదేశ్‌లోని గాంధీగ్రామ్. ఆయన గావ్లీ సంచార జాతికి చెందిన వ్యక్తి. ఆ గ్రామంలో ఆయనతోపాటు 400 గావ్లీ కుటుంబాలు ఉన్నాయి. వారు వర్షాలు కురిసే మూడు నెలల పాటే గ్రామంలో ఉంటారు. మిగతా తొమ్మిది నెలల పాటు దేశవ్యాప్తంగా తిరుగుతుంటారు. వారు ఎక్కువ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని గ్రామాలనే ఎంచుకుంటారు. ఏ గ్రామానికి వెళ్లిన ఆ గ్రామం శివారులో బట్టలు, చీరలతో టెంట్లు వేసుకుంటారు. వీరికి మిగతా సంచార జాతులకు కొంత తేడా ఉంది. మిగతా సంచార జాతుల వారు పిల్లా, జెల్లా, ముసలి, ముతకలను స్వస్థలంలో వదిలేసి వలసపోతుంటారు. వీరు మాత్రం అందరిని తీసుకునే సంచార యాత్ర మొదలు పెడతారు. ఇంతకు వీరు చేసే వృత్తి ఏమిటంటే భారత గ్రామీణ సంగీతంతో పెనవేసుకుపోయిన ‘హార్మోనియం’ను మరమ్మతు చేయడం. కొన్ని దశాబ్దాలుగా, తరాలుగా వీరు ఇదే వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. కొన్ని ఊళ్లలో పోలీసుల బెదిరింపులు, ప్రజల చీదరింపులు ఎదురయినా వీరు ఈ వృత్తిని వదిలి పెట్టడం లేదు. ఒకప్పుడు ఇంటింటా కాకపోయిన వీధి, వీధిన కనిపించే హార్మోనియంలను మరమ్మతు చేయడం వల్ల వీరికి బాగానే వచ్చేదట. ఇప్పడు నెలకు సరాసరి మూడు వేల రూపాయలు కూడా రావడం లేదని, పాడుపడిన హార్మోనియంను ఎంతో కష్టపడి రిపేరు చేస్తే వంద రూపాయలకు మించి ఇవ్వరని అఫ్సాన్ యాదవ్ కుమారుడు 22 ఏళ్ల సాజింద్ యాదవ్ తెలిపారు. తాము గత ఏడేళ్లలో మహారాష్ట్రలోని 15 గ్రామాలు తిరిగామని చెప్పారు. తమ స్వగ్రామంలో ఎలాంటి స్థలంగానీ, పనులుగానీ లేకపోవడం వల్ల నమ్ముకున్న వృత్తిపైనే ఆధారపడి తిరుగుతున్నామని చెప్పారు. తమకు ఎలాంటి గుర్తింపు కార్డులు లేనందున పొరుగూరులో తమకు ఎలాంటి పనులు ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. పస్తుతం తమ బృందంలో 60 మంది ఉండగా, 20 మంది పిల్లలే ఉన్నారని అన్నారు. మిగతా కుటుంబాలు కూడా బృందాలుగా విడిపోయి ఊరూర తిరుగుతుంటారని చెబుతుంటారు. హార్మోనియం స్థానంలో ఇప్పుడు కొత్త ఎలక్ట్రిక్ పరికరాలు రావడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని వాపోయారు. హార్మోనియం ఎక్కడ పుట్టింది? పశ్చిమ దేశాల్లో పుట్టినా ఈశాన్య దేశాల్లోనే హార్మోనియం పునర్జీవం పోసుకుంది. భారత్‌లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది కనుక భారత ఉప ఖండంలో పుట్టిందని భ్రమపడతారు. విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమం సందర్భంగా ఈ హార్మోనియంను బహిష్కరించాలా, వద్దా అన్న అంశం కూడా చర్చకు వచ్చింది. హార్మోనియం యూరప్‌లో పుట్టింది, బ్రిటన్‌కు ఎలాంటి సంబంధం లేదు కనుక బహిష్కరించాల్సిన అవసరం లేదన్న వాదన గెలిచింది. ఎందుకోగానీ ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) మాత్రం 1940 నుంచి 1971వరకు హార్మోనియంపై నిషేధం విధించింది. కోపెన్ హాగెన్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ క్రిస్టియన్ గాట్లిబ్ క్రట్జెస్టైయిన్ తొలిసారిగా హార్మోనియం ప్రొటోటైప్‌ను సృష్టించారు. ఆయన సంగీతం కోసం కాకుండా మానవ శరీరంపై విద్యుత్ తరంగాల ప్రభావాన్ని అధ్యయనం చేయడం కోసం దీన్ని కనిపెట్టారు. ఈ సాంకేతిక పరిజ్ఞానానికి ఆధునికతను జోడించి ఫ్రాన్స్‌కు చెందిన గాబ్రియెల్ జోసఫ్ గెన్నీ 1810లో ‘ఆర్గూ ఎక్స్ప్రెసిఫ్’ (భావాలు పలికించే పరికరం)ను కనిపెట్టారు. అదే ఫ్రాన్స్‌కు చెందిన అలెగ్జాండర్ డెబ్రిన్ దాన్ని మరింత అభివృద్ధి చేసి ‘హార్మోనియం’ అని పేరు పెట్టారు. ఆయన పేటెంట్ కూడా తీసుకున్నారు. హార్మోనియం అంటే గ్రీకు భాషలో సమన్వయం అని అర్థం. అంటే స్వరాల మధ్య సమన్వయం కావొచ్చు. భారత్‌లోని కోల్‌కతాలో ద్వారకానాథ్ ఘోస్ ఈ సంగీత పరికరాన్ని మరింత అభివృద్ధి చేసి ‘డ్వార్కిన్ అండ్ సన్స్’ పేరిట కంపెనీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వీటి ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ కంపెనీ చేతుల్లో పట్టుకొనే హార్మోనియంను 1875లో తీసుకొచ్చింది. మొదట మన ఏటీఎం బాక్సులంతా పెద్దగా ఉండి, కాళ్లు, చేతులతో ఆపరేట్ చేసే స్థాయి నుంచి కేవలం చేతులతో వాయించే స్థాయికి వచ్చింది. భారత్‌లో మెలోడియన్ అని కూడా పిలిచే ఈ హార్మోనియం భారత సంగీత ప్రపంచానికి దూరం అవుతోంది. రవీంద్రనాథ్ ఠాకూర్ తన అన్ని గీతాలకు హార్మోనియంపైనే బాణి కట్టారు. హార్మోనియం లేకుండా పండిట్ భీంసేన్ జోషి, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, బేగం అఖ్తర్ లాంటి శాస్త్రీయ సంగీత విద్వాంసులను ఊహించలేం. చరిత్రలో దాదాపు రెండువందల సంవత్సరాలపాటు కనుమరుగై తిరిగి భారత్‌లో పునర్జీవం పొందిన హార్మోనియంకు మళ్లీ ‘అచ్చేదిన్’ రాకపోవచ్చని సంగీత ప్రియులు అభిప్రాయపడుతున్నారు. తమకు మాత్రం కనుచూపు మేరలో ‘అచ్చేదిన్’ కనిపించడం లేదని గావ్లీ సంచార జాతి ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 5.10 కోట్ల మంది సంచార జాతులు ఉన్నాయి. వారిలో ఇప్పటికీ 90 శాతం మంది నిరక్షరాస్యులే. -
అబ్బాయి పుడితే... ‘అయ్యో! దేవుడా’ అని ఏడుస్తారు!
సమ్‌థింగ్ స్పెషల్ ‘‘అమ్మాయా? అబ్బాయా?’’ ‘‘అయ్యో! ఏం చెప్పేది...’’ ‘‘కొంపదీసి మగపిల్లాడా ఏమిటి?’’ ‘‘నిజమే...’’ ‘‘అయ్యో...పాపం సువర్ణ!! ఏంచేస్తాం మరి. ఆ దేవుడు అలా రాసి పెట్టాడు. మధ్యప్రదేశ్‌లోని మందసర్ పట్టణంలో ఒక ఆస్పత్రి ముందు వినిపించిన సంభాషణ ఇది. నలభై సంవత్సరాల సువర్ణకు మొదటి కాన్పులో మగపిల్లాడు పుట్టాడు. రెండో కానుపులో కూడా మగపిల్లాడే పుట్టడంతో సువర్ణ తట్టుకోలేక బోరుమని ఏడిచింది. రేఖ తన పది నెలల కొడుకును తేరిపార చూసినప్పుడల్లా దిగులుగా ముఖం పెడుతుంది. ‘‘ఈ అబ్బాయి... అమ్మాయి అయితే ఎంత బాగుండేది. దేవుడు నాకు ఎందుకు ఇలా అన్యాయం చేశాడు!’’ అనుకుంటుంది ఎప్పుడూ బాధగా. మధ్యప్రదేశ్‌లోని ‘నోమదిక్’ అనే ఒక తెగ ఉంది. ఈ తెగకు చెందిన వారే సువర్ణ, రేఖలు. ఈ ఇద్దరు మాత్రమే కాదు.. ‘నోమదిక్’ తెగకు చెందిన చాలామంది మహిళలు కొడుకు పుట్టడాన్ని ఎంతమాత్రం ఇష్టపడరు. ‘పున్నామ నరకం నుంచి తప్పించే వాడే కొడుకు’ అనే సెంటిమెంట్ వారికి లేదు. కొడుకు పుట్టడం అంటే ‘నరకం’లోకి పోవడం అని కూడా ఆందోళన పడతారు. ఆడపిల్ల పుడితే మాత్రం ఆరోజు పండగ జరుపుకుంటారు. ఎందుకిలా? నోమదిక్ తెగ ప్రధాన వృత్తి వ్యభిచారం. ఆడబిడ్డ పుడితే...భవిష్యత్తులో ఆర్థికంగా ఆదుకుంటుందని, మగబిడ్డ పుడితే ఆదుకోకపోగా భారంగా తయారవుతాడనీ అనుకుంటారు ఈ తెగ వాళ్లు. వీరి నివాసాలు ప్రధానంగా స్టేట్ హైవేను ఆనుకొని ఉంటాయి. చిన్న చిన్న గుడారాలలో, రెండు చిన్న గదుల ఇంట్లో వీళ్లు నివాసముంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇవి చిన్నపాటి వ్యభిచార కేంద్రాలు. నోమదిక్లో ఒక కుటుంబం ఆర్థికస్థాయి అనేది ఆ కుటుంబంలోని మగ,ఆడ సంతానం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువమంది ఆడపిల్లలు ఉన్న ఇంటితో పోల్చితే, ఎక్కువమంది మగపిల్లలు ఉన్నవారి ఆర్థికస్థాయి తక్కువగా ఉంటుంది. కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ‘‘ఆడపిల్ల పుడితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే మగపిల్లవాడైతే...ఉపాధి సంగతి ఎలా ఉన్నా...పెళ్లి చేయడం కూడా కష్టమే. కన్యాశుల్కంగా పది లక్షలు ఇస్తేగానీ ఒక మగవాడి పెళ్లి కాదు’’ అన్నారు యాభై సంవత్సరాల హీరాబాయి. మరోవైపు ఆడపిల్లల గురించి 58 సంవత్సరాల చందర్ ఇలా అంటాడు...‘‘నాకు అయిదుగురు అమ్మాయిలు. ఆర్థిక పరిస్థితికి లోటు లేదు. పొలంతో సహా రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. నాకు అయిదుగురూ అబ్బాయిలు పుట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో!’’ భవిష్యత్ కష్టాలను ఊహించుకొని...గర్భంలో ఉన్నది మగశిశువు అని తెలిస్తే గర్భస్రావం చేసుకున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఈ విషయాన్ని తెగ పెద్దలు ధ్రువీకరించారు కూడా. మరో చిత్రమైన విషయం ఏమిటంటే కూతుళ్లు లేని తల్లిదండ్రులు దత్తత తీసుకొనో, కొనుగోలు చేసో ఆడపిల్లల్ని ఇంటికి తెచ్చుకుంటున్నారు. దురదృష్టమేమిటంటే, చాలామంది తల్లిదండ్రులు తమ ఇంటి ఆడపిల్లల వల్ల తమ ఐశ్వర్యం పెరుగుతుందని ఆలోచిస్తున్నారు తప్ప వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. ఆరునెలల క్రితం సునీత అనే అమ్మాయికి ఎయిడ్స్ సోకిందని తెలిసినప్పటికీ...మిగిలిన వాళ్లు అదో పెద్ద విషయంగా పరిగణించలేదు. మరోవైపు దీనికి భిన్నంగా కొందరు జాగ్రత్తపడుతున్నారు. ఒక తరం ఆడపిల్లలు డబ్బులు దాచుకోవడానికి వ్యభిచారంలోకి దిగినా, తమ బిడ్డల్ని మాత్రం దీనిలోకి రానివ్వడం లేదు. జాగ్రత్తగా చదివిస్తున్నారు. ఇలా జాగ్రత్త పడిన కుటుంబాలలో మెడిసిన్ చదువుతున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. ‘‘నోమదిక్ తెగలో వ్యభిచారం అనేది ఒకే సమస్యలాగా కనిపించే అనేక సమస్యల సమహారం. వాటన్నిటిని పరిష్కరిస్తేగానీ...ప్రధాన సమస్య పరిష్కారం కాదు’’ అంటున్నారు సామాజిక విశ్లేషకులు. ఆ సమస్యలన్నీ పరిష్కారమై...వారి జీవితాల్లో కొత్త మార్పు ఒకటి రావాలని ఆశిద్దాం. -
సంచారజాతుల అభ్యున్నతికి ప్రత్యేక కమిషన్: దత్తాత్రేయ
సాక్షి,హైదరాబాద్: సంచార జాతుల వారి అభ్యున్నతికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు అవసరమని తద్వారా వారి ప్రగతికి బాటలు వేయవచ్చని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ జాతులవారు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి సం బంధిత మంత్రిత్వశాఖ దృష్టికి తెస్తానని హామీ ఇచ్చారు. బుధవారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో ‘కళా ప్రదర్శన - రాష్ట్ర మహాసభ’ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రబడ్జెట్లో రూ.500 కోట్లతో సంక్షేమ నిధిని వారి కోసం ఏర్పాటు చేయాలన్నారు. కర్మన్‌ఘాట్ వద్ద 1000 ఇళ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటుతో వారి సమస్యలను పరిష్కరించేందుకు వీలుంటుందని చెప్పారు. కార్మిక శాఖ తరపున ఉపాధి కల్పించి స్టైఫండ్ ఇచ్చి అనంతరం పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. ఈ జాతులను ఎస్టీల్లో చేర్చేం దుకు సీఎం కేసీఆర్ కృషి చేయాలన్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సంచార కులాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ సంచార జాతుల వృద్ధకళాకారులకు పింఛన్ ఇప్పిస్తానని చెప్పారు. నేషనల్ డి.ఎన్.టి.ఫోరం అధ్యక్షుడు బాలకృష్ణ రేనుకే మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం సంచార, విముక్త జాతులకు పది శాతం ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. నేషనల్ డి.ఎన్.టి. ఫోరం అధ్యక్షుడు ప్రొఫెసర్ బాలగురుమూర్తి మాట్లాడుతూ తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఉన్న సంచార జాతుల స్థితిగతులపై అధ్యయనానికి కమిషన్ ఏర్పాటు అవసరమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సంచార జాతుల సం ఘం అధ్యక్షుడు వై. వెంకటనారాయణ, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ ఐ.తిరుమల, కాంగ్రెస్ నేత వి. కృష్ణమోహన్ పాల్గొన్నారు. ప్రదర్శనతో హోరెత్తిన రవీంద్రభారతి సంచార జాతుల రాష్ట్ర మహాసభ సందర్భంగా రవీంద్రభారతి ప్రాంగణంలోనూ, రవీంద్రభారతి వేదికపైన నిర్వహించిన కళారూపాల ప్రదర్శన ఆకట్టుకుంది. గంగిరెద్దుల ఆటలు, బుర్రకథలు, తోలు బొమ్మల ఆటలు, యక్షగానాలు, నాటకాలు, బాగోతాలు, సర్కస్, పటం కథలు వీర నాట్యం మొదలైన కళా రూపాల ప్రదర్శనలు నిర్వహించారు.