అబ్బాయి పుడితే... ‘అయ్యో! దేవుడా’ అని ఏడుస్తారు!
సమ్‌థింగ్ స్పెషల్
‘‘అమ్మాయా? అబ్బాయా?’’
‘‘అయ్యో! ఏం చెప్పేది...’’
‘‘కొంపదీసి మగపిల్లాడా ఏమిటి?’’
‘‘నిజమే...’’
‘‘అయ్యో...పాపం సువర్ణ!! ఏంచేస్తాం మరి. ఆ దేవుడు అలా రాసి పెట్టాడు.
మధ్యప్రదేశ్‌లోని మందసర్ పట్టణంలో ఒక ఆస్పత్రి ముందు వినిపించిన సంభాషణ ఇది. నలభై సంవత్సరాల సువర్ణకు మొదటి కాన్పులో మగపిల్లాడు పుట్టాడు. రెండో కానుపులో కూడా మగపిల్లాడే పుట్టడంతో సువర్ణ తట్టుకోలేక బోరుమని ఏడిచింది. రేఖ తన పది నెలల కొడుకును తేరిపార చూసినప్పుడల్లా దిగులుగా ముఖం పెడుతుంది. ‘‘ఈ అబ్బాయి... అమ్మాయి అయితే ఎంత బాగుండేది. దేవుడు నాకు ఎందుకు ఇలా అన్యాయం చేశాడు!’’ అనుకుంటుంది ఎప్పుడూ బాధగా. మధ్యప్రదేశ్‌లోని ‘నోమదిక్’ అనే ఒక తెగ ఉంది. ఈ తెగకు చెందిన వారే సువర్ణ, రేఖలు. ఈ ఇద్దరు మాత్రమే కాదు.. ‘నోమదిక్’ తెగకు చెందిన చాలామంది మహిళలు కొడుకు పుట్టడాన్ని ఎంతమాత్రం ఇష్టపడరు. ‘పున్నామ నరకం నుంచి తప్పించే వాడే కొడుకు’ అనే సెంటిమెంట్ వారికి లేదు. కొడుకు పుట్టడం అంటే ‘నరకం’లోకి పోవడం అని కూడా ఆందోళన పడతారు. ఆడపిల్ల పుడితే మాత్రం ఆరోజు పండగ జరుపుకుంటారు.
ఎందుకిలా?
నోమదిక్ తెగ ప్రధాన వృత్తి వ్యభిచారం. ఆడబిడ్డ పుడితే...భవిష్యత్తులో ఆర్థికంగా ఆదుకుంటుందని, మగబిడ్డ పుడితే ఆదుకోకపోగా భారంగా తయారవుతాడనీ అనుకుంటారు ఈ తెగ వాళ్లు. వీరి నివాసాలు ప్రధానంగా స్టేట్ హైవేను ఆనుకొని ఉంటాయి. చిన్న చిన్న గుడారాలలో, రెండు చిన్న గదుల ఇంట్లో వీళ్లు నివాసముంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇవి చిన్నపాటి వ్యభిచార కేంద్రాలు.
నోమదిక్‌లో ఒక కుటుంబం ఆర్థికస్థాయి అనేది ఆ కుటుంబంలోని మగ,ఆడ సంతానం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువమంది ఆడపిల్లలు ఉన్న ఇంటితో పోల్చితే, ఎక్కువమంది మగపిల్లలు ఉన్నవారి ఆర్థికస్థాయి తక్కువగా ఉంటుంది. కష్టాలు ఎక్కువగా ఉంటాయి.
‘‘ఆడపిల్ల పుడితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే మగపిల్లవాడైతే...ఉపాధి సంగతి ఎలా ఉన్నా...పెళ్లి చేయడం కూడా కష్టమే. కన్యాశుల్కంగా పది లక్షలు ఇస్తేగానీ ఒక మగవాడి పెళ్లి కాదు’’ అన్నారు యాభై సంవత్సరాల హీరాబాయి.
మరోవైపు ఆడపిల్లల గురించి 58 సంవత్సరాల చందర్ ఇలా అంటాడు...‘‘నాకు అయిదుగురు అమ్మాయిలు. ఆర్థిక పరిస్థితికి లోటు లేదు. పొలంతో సహా రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. నాకు అయిదుగురూ అబ్బాయిలు పుట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో!’’ భవిష్యత్ కష్టాలను ఊహించుకొని...గర్భంలో ఉన్నది మగశిశువు అని తెలిస్తే గర్భస్రావం చేసుకున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఈ విషయాన్ని తెగ పెద్దలు ధ్రువీకరించారు కూడా. మరో చిత్రమైన విషయం ఏమిటంటే కూతుళ్లు లేని తల్లిదండ్రులు దత్తత తీసుకొనో, కొనుగోలు చేసో ఆడపిల్లల్ని ఇంటికి తెచ్చుకుంటున్నారు.
దురదృష్టమేమిటంటే, చాలామంది తల్లిదండ్రులు తమ ఇంటి ఆడపిల్లల వల్ల తమ ఐశ్వర్యం పెరుగుతుందని ఆలోచిస్తున్నారు తప్ప వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. ఆరునెలల క్రితం సునీత అనే అమ్మాయికి ఎయిడ్స్ సోకిందని తెలిసినప్పటికీ...మిగిలిన వాళ్లు అదో పెద్ద విషయంగా పరిగణించలేదు. మరోవైపు దీనికి భిన్నంగా కొందరు జాగ్రత్తపడుతున్నారు. ఒక తరం ఆడపిల్లలు డబ్బులు దాచుకోవడానికి వ్యభిచారంలోకి దిగినా, తమ బిడ్డల్ని మాత్రం దీనిలోకి రానివ్వడం లేదు. జాగ్రత్తగా చదివిస్తున్నారు. ఇలా జాగ్రత్త పడిన కుటుంబాలలో మెడిసిన్ చదువుతున్న అమ్మాయిలు కూడా ఉన్నారు.
‘‘నోమదిక్ తెగలో వ్యభిచారం అనేది ఒకే సమస్యలాగా కనిపించే అనేక సమస్యల సమహారం. వాటన్నిటిని పరిష్కరిస్తేగానీ...ప్రధాన సమస్య పరిష్కారం కాదు’’ అంటున్నారు సామాజిక విశ్లేషకులు. ఆ సమస్యలన్నీ పరిష్కారమై...వారి జీవితాల్లో కొత్త మార్పు ఒకటి రావాలని ఆశిద్దాం.