‘హార్మోనియం’ బతుకులు అబ్బా! | Gawli Community Travels Hamlets To Repair Harmoniums | Sakshi
Sakshi News home page

‘హార్మోనియం’ బతుకులు అబ్బా!

Published Tue, Jul 17 2018 5:16 PM | Last Updated on Tue, Jul 17 2018 7:29 PM

Gawli Community Travels Hamlets To Repair Harmoniums - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘దూరాన ఊరు కనిపిస్తోంది. ఆకాశం దట్టంగా మబ్బుపట్టింది. వర్షం వస్తుందన్న భయంతో వడి వడిగా అడుగులు వేస్తున్నాం. ఆడవాళ్ల చంకల్లో పిల్లలు ఆకలితో కేకలు వేస్తున్నారు. మగవాళ్లు మూట ముళ్లె, తట్టా బుట్టా, టెంటు పట్టుకొని ప్రయాస పడి నడుస్తున్నారు. నడవలేక నడవలేక ముసలి ముతక మూలుగుతూ దగ్గుతూ వెంట వస్తున్నారు. ఇంతలో ఊరు రానే వచ్చింది. అంతలో చినుకు, చినుకు మొదలయింది. పిల్లల్ని ఎత్తుకొని ఆడవాళ్లు చెట్ల కింద చేరగా రోడ్డుపక్కన టెంట్లు వేసేందుకు మగవాళ్లు ప్రయత్నిస్తున్నారు. స్థానికులు రానే వచ్చారు. ఎవరని దబాయించారు. చెప్పాం. పోలీసులను పిలిపిస్తామని బెదిరించారు. మరో ఊరు చూసుకోమని సూచించారు. చేసేది లేక మళ్లీ మూట మూళ్లె సర్దుకున్నాం. వర్షం పెరిగింది. అలా రాత్రంతా తడుస్తూ మరో ఊరు వైపు వెళ్లాం. తడిసి ముద్దయిన పిల్లలకు జ్వరాలు వచ్చాయి. ముసలి వాళ్లు వణికిపోతున్నారు. మా సంగతి పక్కన పెట్టండి. పిల్లలు, ముసలివాళ్లకు ఆ రాత్రి గంజి మెతుకులు లేవు’ అని మహారాష్ట్రలోని సింధూదుర్గ్‌ జిల్లా దోడామార్గ్‌ గ్రామంలో తమకెదురైన ఓ అనుభవం గురించి సజింద్‌ యాదవ్‌ మీడియాకు వివరించారు.

ఆయన గ్రామం మధ్యప్రదేశ్‌లోని గాంధీగ్రామ్‌. ఆయన గావ్లీ సంచార జాతికి చెందిన వ్యక్తి. ఆ గ్రామంలో ఆయనతోపాటు 400 గావ్లీ కుటుంబాలు ఉన్నాయి. వారు వర్షాలు కురిసే మూడు నెలల పాటే గ్రామంలో ఉంటారు. మిగతా తొమ్మిది నెలల పాటు దేశవ్యాప్తంగా తిరుగుతుంటారు. వారు ఎక్కువ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని గ్రామాలనే ఎంచుకుంటారు. ఏ గ్రామానికి వెళ్లిన ఆ గ్రామం శివారులో బట్టలు, చీరలతో టెంట్లు వేసుకుంటారు. వీరికి మిగతా సంచార జాతులకు కొంత తేడా ఉంది. మిగతా సంచార జాతుల వారు పిల్లా, జెల్లా, ముసలి, ముతకలను స్వస్థలంలో వదిలేసి వలసపోతుంటారు. వీరు మాత్రం అందరిని తీసుకునే సంచార యాత్ర మొదలు పెడతారు. ఇంతకు వీరు చేసే వృత్తి ఏమిటంటే భారత గ్రామీణ సంగీతంతో పెనవేసుకుపోయిన ‘హార్మోనియం’ను మరమ్మతు చేయడం. కొన్ని దశాబ్దాలుగా, తరాలుగా వీరు ఇదే వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు.

కొన్ని ఊళ్లలో పోలీసుల బెదిరింపులు, ప్రజల చీదరింపులు ఎదురయినా వీరు ఈ వృత్తిని వదిలి పెట్టడం లేదు. ఒకప్పుడు ఇంటింటా కాకపోయిన వీధి, వీధిన కనిపించే హార్మోనియంలను మరమ్మతు చేయడం వల్ల వీరికి బాగానే వచ్చేదట. ఇప్పడు నెలకు సరాసరి మూడు వేల రూపాయలు కూడా రావడం లేదని, పాడుపడిన హార్మోనియంను ఎంతో కష్టపడి రిపేరు చేస్తే వంద రూపాయలకు మించి ఇవ్వరని అఫ్సాన్‌ యాదవ్‌ కుమారుడు 22 ఏళ్ల సాజింద్‌ యాదవ్‌ తెలిపారు. తాము గత ఏడేళ్లలో మహారాష్ట్రలోని 15 గ్రామాలు తిరిగామని చెప్పారు. తమ స్వగ్రామంలో ఎలాంటి స్థలంగానీ, పనులుగానీ లేకపోవడం వల్ల నమ్ముకున్న వృత్తిపైనే ఆధారపడి తిరుగుతున్నామని చెప్పారు. తమకు ఎలాంటి గుర్తింపు కార్డులు లేనందున పొరుగూరులో తమకు ఎలాంటి పనులు ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. పస్తుతం తమ బృందంలో 60 మంది ఉండగా, 20 మంది పిల్లలే ఉన్నారని అన్నారు. మిగతా కుటుంబాలు కూడా బృందాలుగా విడిపోయి ఊరూర తిరుగుతుంటారని చెబుతుంటారు. హార్మోనియం స్థానంలో ఇప్పుడు కొత్త ఎలక్ట్రిక్‌ పరికరాలు రావడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని వాపోయారు.

హార్మోనియం ఎక్కడ పుట్టింది?
పశ్చిమ దేశాల్లో పుట్టినా ఈశాన్య దేశాల్లోనే హార్మోనియం పునర్జీవం పోసుకుంది. భారత్‌లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది కనుక భారత ఉప ఖండంలో పుట్టిందని భ్రమపడతారు. విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమం సందర్భంగా ఈ హార్మోనియంను బహిష్కరించాలా, వద్దా అన్న అంశం కూడా చర్చకు వచ్చింది. హార్మోనియం యూరప్‌లో పుట్టింది, బ్రిటన్‌కు ఎలాంటి సంబంధం లేదు కనుక బహిష్కరించాల్సిన అవసరం లేదన్న వాదన గెలిచింది. ఎందుకోగానీ ఆకాశవాణి (ఆల్‌ ఇండియా రేడియో) మాత్రం 1940 నుంచి 1971వరకు హార్మోనియంపై నిషేధం విధించింది.

కోపెన్‌ హాగెన్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ క్రిస్టియన్‌ గాట్లిబ్‌ క్రట్జెస్టైయిన్‌ తొలిసారిగా హార్మోనియం ప్రొటోటైప్‌ను సృష్టించారు. ఆయన సంగీతం కోసం కాకుండా మానవ శరీరంపై విద్యుత్‌ తరంగాల ప్రభావాన్ని అధ్యయనం చేయడం కోసం దీన్ని కనిపెట్టారు. ఈ సాంకేతిక పరిజ్ఞానానికి ఆధునికతను జోడించి ఫ్రాన్స్‌కు చెందిన గాబ్రియెల్‌ జోసఫ్‌ గెన్నీ 1810లో ‘ఆర్గూ ఎక్స్‌ప్రెసిఫ్‌’ (భావాలు పలికించే పరికరం)ను కనిపెట్టారు. అదే ఫ్రాన్స్‌కు చెందిన అలెగ్జాండర్‌ డెబ్రిన్‌ దాన్ని మరింత అభివృద్ధి చేసి ‘హార్మోనియం’ అని పేరు పెట్టారు. ఆయన పేటెంట్‌ కూడా తీసుకున్నారు. హార్మోనియం అంటే గ్రీకు భాషలో సమన్వయం అని అర్థం. అంటే స్వరాల మధ్య సమన్వయం కావొచ్చు.

భారత్‌లోని కోల్‌కతాలో ద్వారకానాథ్‌ ఘోస్‌ ఈ సంగీత పరికరాన్ని మరింత అభివృద్ధి చేసి ‘డ్వార్కిన్‌ అండ్‌ సన్స్‌’ పేరిట కంపెనీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వీటి ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ కంపెనీ చేతుల్లో పట్టుకొనే హార్మోనియంను 1875లో తీసుకొచ్చింది. మొదట మన ఏటీఎం బాక్సులంతా పెద్దగా ఉండి, కాళ్లు, చేతులతో ఆపరేట్‌ చేసే స్థాయి నుంచి కేవలం చేతులతో వాయించే స్థాయికి వచ్చింది. భారత్‌లో మెలోడియన్‌ అని కూడా పిలిచే ఈ హార్మోనియం భారత సంగీత ప్రపంచానికి దూరం అవుతోంది. రవీంద్రనాథ్‌ ఠాకూర్‌ తన అన్ని గీతాలకు హార్మోనియంపైనే బాణి కట్టారు. హార్మోనియం లేకుండా పండిట్‌ భీంసేన్‌ జోషి, ఉస్తాద్‌ బడే గులాం అలీ ఖాన్, బేగం అఖ్తర్‌ లాంటి శాస్త్రీయ సంగీత విద్వాంసులను ఊహించలేం.

చరిత్రలో దాదాపు రెండువందల సంవత్సరాలపాటు కనుమరుగై తిరిగి భారత్‌లో పునర్జీవం పొందిన హార్మోనియంకు మళ్లీ ‘అచ్చేదిన్‌’ రాకపోవచ్చని సంగీత ప్రియులు అభిప్రాయపడుతున్నారు. తమకు మాత్రం కనుచూపు మేరలో ‘అచ్చేదిన్‌’ కనిపించడం లేదని గావ్లీ సంచార జాతి ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 5.10 కోట్ల మంది సంచార జాతులు ఉన్నాయి. వారిలో ఇప్పటికీ 90 శాతం మంది నిరక్షరాస్యులే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement