విలేకరిపై ఇసుక మాఫియా హత్యాయత్నం
పశ్చిమ గోదావరి జిల్లా : తమ అక్రమాలపై కథనం ప్రసారం చేశారన్న కక్షతో ఐ న్యూస్ చానల్ విలేకరిపై ఇసుక మాఫియా హత్యాయత్నానికి తెగబడింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పిట్టల వేమవరంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ దాడిలో విలేకరితో పాటు అతని తల్లికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. సిద్ధాంతం, నడిపూడి గ్రామాల మధ్య అక్రమంగా ఇసుక ర్యాంప్ వేసి పగటిపూట మట్టిని.. రాత్రివేళ ఇసుకను కొందరు తరలిస్తున్నారు. దీనిపై ఈ నెల 1న ఐ న్యూస్‌లో కథనం ప్రసారమైంది. దీంతో ఇసుక మాఫియా రామారెడ్డిని హతమార్చేందుకు గుర్తు తెలియని నలుగురు వ్యక్తులను రంగంలోకి దించింది.
వారు బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో రామారెడ్డి ఇంటికి వెళ్లారు. ఓ వ్యక్తి రామారెడ్డి ఇంటి తలుపు కొట్టి.. సిద్ధాంతంలో గొడవ జరుగుతోందని, వెంటనే రావాలని పిలిచాడు. మరికొందరు బయట ఉన్నారని చెప్పాడు. అనుమానం వచ్చిన రామారెడ్డి.. ఆ వ్యక్తిని ఇంటి లోపలి నుంచే ఫొటో తీశాడు. అనంతరం తలుపు తీయగా.. ముసుగులు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇనుప రాడ్లతో విలేకరిపై దాడి చేశారు. రెండు కాళ్లను రాడ్లతో చితక్కొట్టారు.
మరో దుండగుడు రామారెడ్డి తలపై రాడ్డుతో బాదాడు. దీంతో అతను కిందపడిపోగా.. అతణ్ని గదిలోకి లాక్కెళ్లి దారుణంగా కొట్టారు. అడ్డువెళ్లిన అతని తల్లి వరలక్ష్మిపైనా దాడి చేశారు. ఇంతలో చుట్టుపక్కల వారు బయటకు రాగా.. వారిని బెదిరించి పంపేశారు. అనంతరం ఘటనాస్థలికి వచ్చిన స్థానికులు తీవ్రంగా గాయపడిన రామారెడ్డిని తణుకులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారమందుకున్న పెరవలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.