మేడ్చల్, న్యూస్‌లైన్ : అటవీ ప్రాంతంపై మట్టి మాఫియా కన్ను పడింది. యథేచ్ఛగా మట్టి, ఇసుక తవ్వుకొని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఫలితంగా పచ్చదనంతో విరాజిల్లుతున్న మండలంలోని ఘనాపూర్ అటవీ ప్రాంతం క్రమేపీ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. మేడ్చల్ మండలంలో అసలే అటవీ ప్రాంతం తక్కువ. ఆ కారణంగానే ఇటీవల రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిసినా మేడ్చల్ మండలంలో మాత్రం భూమి తడిసేంత వర్షమే కురిసింది. కొన్నేళ్ల క్రితం హుడా, అటవీ శాఖల ఆధ్వర్యంలో ప్రఖ్యాత పుణ్య క్షేత్రమైన క్షేత్రగిరి గుట్ట చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిలో మొక్కలు నాటించారు.
అవి ప్రస్తుతం చెట్లుగా ఎదగడంతో ఘనాపూర్ గ్రామ శివారు నుంచి మెడిసిటి ఆస్పత్రి మధ్య అటవీ ప్రాంతం ఏర్పడింది. శివారులో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో మట్టి, ఎర్రమట్టి, ఇసుక ఎక్కువగా ఉండటంతో అక్రమార్కులు దీనిపై దృష్టి సారించారు. మార్కెట్‌లో ఎర్రమట్టికి ట్రాక్టర్‌కు రూ.2వేలు, ఇసుక రూ.1500వరకూ ధర పలుకుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న మట్టివ్యాపారులు ఘనాపూర్ అటవీ ప్రాంతంలో రాత్రివేళలో చెట్లు నరికివేయించి జేసీబీలతో తవ్వి మట్టి, ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. చెట్లను కూకటివేళ్లతో పెకలించి మట్టి తవ్వుకొని రోజూ 50 ట్రిప్పుల వరకూ మట్టి తరలించుకుపోతున్నట్టు తెలుస్తోంది.
మామూళ్ల మత్తులో అధికారులు!
ఇంత తతంగం నడుస్తున్నా మండల అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు మాత్రం మట్టి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయడం లేదు. వ్యాపారుల మామూళ్ల మత్తులో మునిగిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారులకు ప్రతి రోజూ ఒక్కో వ్యాపారి రూ.2వేల దాకాా ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో విధులు నిర్వర్తిస్తున్నామని చెప్పుకునేందుకు అధికారులు అప్పుడప్పుడూ దాడులు చేసి నామమాత్రపు జరిమానాలు విధించి సరిపెడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే విధంగా మట్టి తవ్వకం, ఇసుక తరలింపు కొనసాగితే ఉన్న కొద్ది అటవీ ప్రాంతం కనుమరుగయ్యే ప్రమా దం ఉందని, ఉన్నతాధికారులు ఇప్పటికైనా అక్రమార్కుల దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
అటవీ ప్రాంతంలో అక్రమార్కుల దందా!
Published Sat, Nov 16 2013 12:59 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
Advertisement
Advertisement