పింఛా ఏటిలో ట్రాక్టర్లకు ఇసుక నింపుతున్న దృశ్యం
పీలేరు నియోజకవర్గంలోని పింఛానది ఇసుకాసురులకు కనక వర్షం కురిపిస్తోంది. కాసులకు కక్కుర్తిపడినఅధికారులకు తోడు అధికార పార్టీనేతల అండదండలతో ఇసుకమాఫియా రెచ్చిపోతోంది. రాత్రీపగలు తేడాలేకుండా యథేచ్ఛగా ఇసుకతోడేస్తున్నారు. భూగర్భజలాలుఅడుగంటుతున్నాయి మొర్రో..! అంటున్నా పట్టించుకునే దిక్కులేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
చిత్తూరు, పీలేరు: ఇసుకాసురుల ధాటికి పింఛా నది బావురు మంటోంది. డ్యాం నుంచి ఇప్పటికే నాలుగు కి.మీ మేర ఇసుక తోడేశారు. రోజుకు 300 ట్రాక్టర్లపైనే ఇసుక తరలుతున్నా పట్టించుకునే దిక్కులేదు. స్థా నిక అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేకపోతోందని పలువురు రైతులు వాపోతున్నారు.
ఈ ప్రాంతాలకే తరలింపు..
పింఛా నది నుంచి కలకడ, కేవీపల్లె, ఎర్రావారిపాళెం, రొంపిచెర్ల, చిన్నగొట్టిగల్లు, పీలేరు, పులిచెర్ల తో పాటు వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లె, రాయచోటి, సంబేపల్లె మండలాలకు అధికంగా ఇసుక తరలుతోంది. రాత్రింబవళ్లూ ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిపోతోంది.
మోడువారిన బంగరు భూములు
పింఛా నదికి ఇరువైపులా సుమారు రెండు వందలకుపైగా బోర్లు, బావులు ఉన్నాయి. ఐదు వేల ఎకరాలకుపైగా భూములు ఉన్నాయి. ఇవన్నీ మూడు పంటలు పండే భూములే. కానీ పింఛా నదిలో ఇసుక తోడేయడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోర్లు, బావులు బావురమంటున్నాయి. చేసేదిలేక రైతులు పొలాలను బీళ్లుగా వదిలేస్తున్నారు. జిల్లేళ్లమంద పంచాయతీ బసవన్నగారిపల్లె, కరణాలవారిపల్లె, పాతకురవపల్లె, కొత్తకురవపల్లె, పేయలవారిపల్లె, పెండ్లి పెంట, రెడ్డివారిపల్లె, వడ్డిపల్లె, దేవాండ్లపల్లె తదితర గ్రామాల్లో పొలాలు బీళ్లుగా మారాయి.
వారు ఫోన్ చేస్తే చాలు
ఇసుక తరలింపునకు పర్మిట్లు కావాలంటే ఒక్కో ట్రాక్టర్‌కు వారానికి రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు సమర్పించుకోవాలి. సొమ్ము ఇవ్వకపోతే పర్మిట్లు వచ్చే దాఖలాలు లేవు. ఎవరైనా పొరపాటున సొంత పనుల కోసం ఓ ట్రాక్టర్ ఇసుక తరలిస్తే ఇక వారిపని అంతే. వెంటాడిమరీ రెవెన్యూ అధికారులు ముçప్పుతిప్పలకు గురిచేస్తారు. అదే అధికార పార్టీ నాయకులకు అయితే ఎలాంటి నిబంధనలూ వర్తించవు. వారు ఫోన్ చేస్తే చాలు పర్మిట్లు క్షణాల్లో చేతికందుతాయి. అధికార పార్టీ నాయకులు తమ ట్రాక్టర్లతో తెల్లవారుజాము నుంచే ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు రెవెన్యూ అధికారులు బహిరంగంగానే వసూళ్లకు పాల్పడుతున్నారు.
లోడు ఇసుక రూ.2వేలు..
స్థానికంగా ఇసుక తక్కువ రేటు పలుకుతోంది. రూ.1,500మించి పోవడం లేదు. అదే ట్రాక్టర్ ఇసుకను ఇతర ప్రాంతాల్లో రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు. అందుకే పింఛా నది నుంచి యల్లమంద మీదుగా పీలేరు, రొంపిచెర్ల, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాళెంకు తరలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment