గ్రావెల్ తవ్వకాల్లో సగానికి పైగా కోతకు గురైన చనమళ్లుపేట కొండ
విజయనగరం, నెల్లిమర్ల రూరల్: గ్రావెల్ తవ్వకాలకు నెల్లిమర్ల మండలం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ యథేచ్ఛగా గ్రావెల్, మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణాల కోసం పచ్చటి కొండలను సైతం దొలిచేస్తున్నారు. మండలంలో ఇటుక బట్టీల సంఖ్య రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మట్టి కోసం చెరువుల్లో నిత్యం పరిమితికి మించి తవ్వకాలు జరుపుతూ పుడమితల్లికి తూట్లు పొడుస్తున్నారు. దీనిని నివారించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప పర్యవేక్షణపై దష్టి సారించడం లేదు. గ్రామాల్లో మెజార్టీగా ఉన్న టీడీపీ నాయకులే వెనుకుండి ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా కొనసాగితే గ్రామాల్లో ప్రకృతికి నిలువుటద్దంలా కనిపించే పచ్చని కొండలు కూడా అంతరించే వనరుల జాబితాలో చేరుతాయేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బహిరంగంగానే తవ్వకాలు.....
మండలంలో దన్నానపేట, ఏటీ అగ్రహారం, తంగుడుబిల్లి, చనమళ్లుపేట, గుషిణి, టెక్కలి, బూరాడపేట, జగ్గరాజుపేట గ్రామాల్లో ప్రతినిత్యం గ్రావెల్, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల నుంచే సుధూర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. గతంలో వీటిపై అధికారుల పర్యవేక్షణ ఉండేది. దీంతో కొందరు అక్రమార్కులు రాత్రి సమయాల్లో మాత్రమే మట్టి తవ్వకాలు జరిపేవారు. ఇప్పుడు టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు అధికారులు తలగ్గొడంతో అక్రమార్కులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా భారీ యంత్రాలతో పట్టి, గ్రావెల్ తరలించుకుపోతున్నారు. ట్రాక్టర్ల యాజమానులు దూరాన్ని బట్టి ధరను నిర్ణయిస్తున్నారు. ఒక ట్రాక్టరు లోడు మట్టి రూ. 400 నుంచి 800 రూపాయల వరకు పలుకుతోంది. దూర ప్రాంతాలకైతే రూ.1500 2,500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇసుక రీచ్‌లు కూడా మండలంలో లేకపోవడంతో అక్రమార్కుల దృష్టి గ్రామాల్లో ఉండే కొండలపై పడింది. దీంతో వ్యాపారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కానిస్తూ ప్రకృతి వనరులను నాశనం చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
25కు పైగానే..
ఇటుకబట్టీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చెరువుల సమీపంలో ఏర్పాటు చేసి అదే చెరువుల్లో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. మండలంలో దాదాపు 25 ఇటుక బట్టీలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇటుకుల తయారీకి నిత్యం మట్టిని తరలిస్తూ రూ. లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు, గ్రామస్థాయి సిబ్బందికి భారీగా ముడుపులు అందుతున్నట్లు సమాచారం. సంవత్సరానికి రెండు సార్లు ఇటుకబట్టీల నిర్వాహుకులు అధికారులకు మామ్మూళ్లు అందజేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి, గ్రావెల్ తవ్వకాలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment