ఇసుక అక్రమ రవాణాకు అంతే లేదా..? | Sand smuggling | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాకు అంతే లేదా..?

Published Sat, May 23 2015 3:57 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Sand smuggling

తమిళనాడుకు తరలివెళుతున్న ఇసుక
అక్రమంగా సరఫరా
పట్టించుకోని అధికారులు
వేయింగ్ మిషన్లు ఏర్పాటుచేస్తే అడ్డుకట్ట


 సూళ్లూరుపేట : ఇసుక అక్రమ రవాణాకు అంతే లేకుండా పోతోంది. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుకను తరలిస్తున్నా తమకేమీ పట్టనట్లు కొన్ని శాఖలకు చెందిన అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. తడ మండలం రామాపురం పేరుతో వెళ్లే లారీలన్నీ తమిళనాడుకే తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారికంగా రీచ్‌లు కేటాయించి అందులో పొదుపు మహిళలకు అజమాయిషీని అప్పగించారు.

ముఖ్యంగా సూళ్లూరుపేటలో అయిదు చోట్ల రీచ్‌లు కేటాయించారు. దీనికి అనుసంధానంగా స్టాక్‌పాయింట్‌లకు కూడా స్థలం ఇచ్చారు. ఇసుక రీచ్‌ల నుంచి స్టాకు పాయింట్‌కు పొదుపు మహిళలే ఇసుక తరలించాల్సి ఉంది. చలానా కట్టుకున్న ట్రాక్టర్లు వారికి స్టాకు పాయింట్‌లో ఇసుక తూకం వేసి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అలా కాకుండా ట్రాక్టర్లు వారు రూ. 1800 చలానా చెల్లించి రశీదు తేస్తే వారిని నేరుగా రీచ్‌ల్లోకి పంపేస్తున్నారు.

ట్రాక్టర్లు యజమానులు కూలీలకు  వంద రూపాయలు ఆశ చూపించి  టన్నుకు బదులు ఒకటిన్నర టన్ను లోడ్ చేసుకుని వెళుతున్నారు. మామూలుగా అయితే టన్ను ఇసుక ధర రూ.1800 గా నిర్ణయించారు.  అర టన్నుకు రూ. 600 అదనంగా చెల్లించాల్సి ఉంది. ప్రతి ట్రాక్టర్‌కు అరటన్ను ఇసుక అదనంగా వెళుతోంది కాబట్టి ప్రభుత్వ రాబడికి ఒక్కో ట్రాక్టరుకు రూ.600  గండికొడుతున్నారు. రీచ్‌లో వేయింగ్ మిషన్‌లాంటివి ఏర్పాటు చేస్తే అన్నీ బాగానే వుండేవి.

అలాంటివేమీ లేకపోవడంతో రీచ్‌లో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.  నెల్లూరు జిల్లాలో 86 ఇసుక రీచ్‌లున్నాయి. అన్ని ఇసుక రీచ్‌ల్లో ఇదే తరహా మోసాలు జరుగుతున్నాయి. దీనివల్ల భారీ ఎత్తున ప్రభుత్వాదాయానికి గండిపడుతోంది. అక్రమార్కులు తమ స్వార్థం కోసం ఇసున వక్రమార్గాల్లో సరఫరా చేసి లక్షలాది రూపాయలు సొమ్ముచేసుకుంటున్నారు.  ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇసుక రీచ్‌ల వద్ద వేయింగ్ మిషన్‌లు ఏర్పాటు చేస్తే కొంత మేరకు అడ్డుకట్ట వేయవచ్చు.  ఈ మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement