పీసీపల్లి, పెద్దారవీడు, న్యూస్‌లైన్: ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. పీసీపల్లి మండలంలో పాలేటి రిజర్వాయర్ పేరు చెప్పుకొని ఇసుక తరలిస్తుంటే...పెద్దారవీడు మండలం తోకపల్లెలో తీగలేరు నుంచి ఇసుక తవ్వి అమ్ముకుంటున్నారు. పీసీపల్లి ప్రాంతంలో దళారులు ఏకంగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని మరీ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ఒక వ్యాపారి ఇసుక తరలించేందుకే ఏకంగా ఐదు ట్రాక్టర్లు కొత్తవి కొనుగోలు చేశాడంటే..ఇసుక చౌర్యం ఎంతమేర జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
ఇసుక తరలిస్తున్న వారిని ప్రశ్నిస్తే పాలేటి రిజర్వాయర్ కోసం తీసుకెళ్తున్నామని చెబుతున్నారు. అసలు రిజర్వాయర్ కోసం తీసుకెళ్తున్నారో..లేక బయటి ప్రాంతాలకు తరలిస్తున్నారో పట్టించుకోకుండా ఇసుక వ్యాపారులిచ్చే మామూళ్లకు తలొగ్గి అధికారులు అక్రమాలకు పచ్చజెండా ఊపుతున్నారు.
కాసులు కురిపిస్తున్న ఇసుక వ్యాపారం
మండలంలోని పాలేటిగంగ, వెంగళాపురం, పోతవరం, నేరేడుపల్లి, అలవలపాడు, బట్టుపల్లి, పెదవరిమడుగు, పాలేటిపల్లి, పాలేటి రిజర్వాయర్ చుట్టుపక్కల ఇసుక తరలిస్తున్నారు. కూలీలకు ట్రక్కు నింపితే రూ.500ల వరకు చెల్లించి యజమానులు ట్రక్కు ఇసుక రూ. 3500 వరకు అమ్ముకుంటారు. అదే టిప్పర్ అయితే దాదాపుగా రూ.15 వేల దాకా విక్రయిస్తారు. రోజూ ట్రాక్టర్లలో వంద లోడ్లకు పైగా ఇసుకను కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు, బొట్లగూడూరు, పొన్నలూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామాల్లో ఉండే చోటా అధికార పార్టీ నాయకుల అండ దండలతో వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. ఇసుక తరలింపుపై ఆర్డీఓ బాపిరెడ్డిని వివరణ కోరగా తహసీల్దార్లందరూ సమ్మెలో ఉండటంతో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించలేకపోతున్నామని, సమ్మె విరమించిన వెంటనే ఇసుక అక్రమ రవాణాకు చెక్‌పెడతామన్నారు.
తీగలేరు నుంచి...
పెద్దారవీడు మండలంలోని తోకపల్లె, రామాయపాలెం, ప్రగళ్లపాడు గ్రామాల సమీపంలో ఉన్న తీగలేరు కాలువ నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఎక్కువగా రాత్రిపూట జేసీబీలతో తవ్వి తీసుకెళ్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుక రూ. 2 వేల చొప్పున అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాల్లోని గ్రామాలకు ట్రాక్టర్ల యజమానులు ఇసుక తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ధర మారుతుంటుంది. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
భారీ స్థాయిలో ఇసుక తవ్వేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గతంలో తీగలేరు కాలువలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతుంటే రెవెన్యూ అధికారులు ఇద్దరు గ్రామ నౌకరులను ఏర్పాటు చేశారు. పగటిపూట ఒకరు, రాత్రిపూట మరొకరిని తహసీల్దార్ కాపలాగా నియమించారు. ఈ మధ్యకాలంలో కాపలా లేకపోవడంతో అక్రమార్కులకు అడ్డులేకుండా పోయింది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తవ్వెయ్.. దోచెయ్
Published Sat, Feb 15 2014 2:14 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement