Sand Business
-
ఆన్‌లైన్‌లోనూ.. సైకతం
ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఆన్లైన్లో అనేకం దొరుకుతున్న ఈ రోజుల్లో ఇప్పుడు తాజాగా ఇసుక వ్యాపారం కూడా సై..అంటూ దూసుకొచ్చింది. మీకూ కావాలా? చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. అందులో ఆర్డరిస్టే.. ఎంచక్కా ట్రాక్టర్ లోడు మీ ఇంటికే వస్తుంది. ఆ తర్వాతే డబ్బులివ్వండి. ఈ వాహనం బయల్దేరినప్పటి నుంచి లోడు దించే వరకు కదలికలను అధికారులు గుర్తిస్తారు. అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తారు. సాక్షి, బూర్గంపాడు(ఖమ్మం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ప్రాంతాల్లో మన ఇసుక వాహనంతో ఆన్లైన్లో బుకింగ్ ద్వారా సైకతం (ఇసుక) సరఫరాకు ప్రభుత్వం అనుమతించింది. ప్రసుత్తం 6 ప్రాంతాల నుంచి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. మన ఇసుక వాహనం పేరిట..జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడంతో..ఈ బండి ఇసుక రీచ్ నుంచి బయల్దేరాక ఎక్కడ ఉంది? ఎటు వెళ్తుంది? అనేది అధికారులకు తెలుస్తుంది. బుక్ చేసుకున్న వినియోగదారుడి ఇంటికి వెళ్లి లోడ్ దించాక..తనకు ఇసుక అందిందని ఆన్లైన్లో సమాచారమిస్తేనే ఆ ట్రాక్టర్‌కు కిరాయి వస్తుంది. ఇసుకను తరలించే ట్రాక్టర్‌కు కిలోమీటరుకు రూ.80 చొప్పున ప్రభుత్వం కిరాయి అందిస్తుంది. స్యాండ్ ర్యాంపు నుంచి 50, 60 కిలోమీటర్ల పరిధి వరకు సరఫరా చేసుకునే వీలుంది. ప్రతిరోజూ ఒక్కో ట్రాక్టర్‌కు అన్నిఖర్చులు పోనూ రూ.3వేల వరకు ఆదాయం వస్తుంది. ఇసుక రీచ్‌లు ఉన్న గ్రామ పంచాయతీలకు ఒక్కో ట్రిప్పుకు రూ.300 వస్తాయి. మరమ్మతులకు ట్రిప్పుకు రూ.100 కేటాయిస్తున్నారు. ఇసుకను ట్రాక్టర్లలో నింపేందుకు స్థానికంగా ఉన్న కూలీలకు కూడా ఉపాధి లభిస్తోంది. ఆన్లైన్ ప్రక్రియతో అక్రమాలు చోటు చేసుకోకుండా కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. 18,091ట్రిప్పులు బుక్ కావడంతో మరికొన్ని పంచాయతీల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ‘మన ఇసుక’ వాహనం రావాలంటే హెల్ప్‌డెస్క్ నంబర్లు ఇవే.. -
ఇసుకే బంగారమాయె..
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగంలో కీలకమైన ఇసుక ధరలు అమాంతంగా పెరగడంతో నిర్మాణ వ్యయం పెరిగి భవన నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరుస వర్షాలతో ఇసుక రవాణాలో అంతరాయం ఏర్పడుతుండగా, ఇదే అదనుగా దళారులు ఇసుక కొరతను సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతీరోజు సగటున 60 వేల మెట్రిక్ టన్నుల ఇసుక వినియోగం జరుగుతుండగా, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆన్లైన్ విధానంలో విక్రయిస్తోంది. ఆన్లైన్లో టన్ను ఇసుక ధర రూ.600 కాగా, రవాణా, ఇతర చార్జీలు కలుపుకుని లారీ యజమానులు, దళారులు సాధారణ రోజుల్లో రూ.1,200 నుంచి రూ.1,400 వరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 50 ఇసుక రీచ్‌లను టీఎస్ఐఐసీ నిర్వహిస్తుండగా, వర్షాలతో వరద పోటెత్తుతుండటంతో నదీ గర్భం నుంచి ఇసుక వెలికితీతకు అంతరాయం కలుగుతోంది. దీంతో టీఎస్ఎండీసీ ఆన్లైన్లో పరిమితంగా అనుమతులు జారీ చేస్తుండటంతో.. బహిరంగ మార్కెట్లో దళారులు టన్ను ఇసుకను రూ.3 వేలకు పైగా విక్రయిస్తున్నారు. నిర్మాణ వ్యయం పెరుగుతుండటంతో భవన నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. 15 రీచ్‌లలో మాత్రమే వెలికితీత రిజర్వాయర్ల పూడికతీత, గోదావరిలోని ఇసుక తిన్నె లు, పట్టా భూముల నుంచి టీఎస్ఎండీసీ ఇసుకను వెలికితీసేందుకు 13 జిల్లాల పరిధిలోని 50కి పైగా ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసింది. ఇసుక వెలికితీత ప్రధానంగా పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా రిజర్వాయర్ల పరిధిలోని 27 ఇసుక రీచ్‌ల వద్ద జరుగుతుండగా, గోదావరి వరదల మూలంగా ఇసుక వెలికితీతకు అంతరాయం కలుగుతోంది. అందుబాటులోని ఇసుకను ప్రభుత్వ పథకాలకు టీఎస్ఎండీసీ కేటాయిస్తోంది. ప్రస్తుతం సుమారు 15 రీచ్‌లలో పాక్షికంగా ఇసుక వెలికితీత జరుగుతున్నట్లు టీఎస్ఎండీసీ వర్గాలు చెప్తున్నాయి. స్టాక్ పాయింట్లలో 41 లక్షల క్యూబిక్ మీటర్లు వర్షాకాలంలో ఎదురయ్యే ఇసుక కొరతను దృష్టిలో పెట్టుకుని టీఎస్ఎండీసీ ముందు జాగ్రత్తగా 2 కోట్ల క్యూబిక్ మీటర్లు (సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నులు) నిలువ చేసేలా ప్రణాళిక సిద్దం చేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే నడుమ 65 లక్షల క్యూబిక్ మీటర్లను స్టాక్ పాయింట్లకు తరలించగా, ప్రస్తుతం 41 లక్షల క్యూబిక్ మీటర్లు (సుమారు 62 లక్షల మెట్రిక్ టన్నులు) అందుబాటులో ఉంది. వీటిని అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ పథకాలకు, ఇతరులకు ఆన్లైన్లో కేటాయిస్తున్నారు. అయితే రోజువారీ డిమాండుకు అనుగుణంగా ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌తో పాటు, మరో రెండు సబ్ స్టాక్పాయింట్లలో జంట నగరాల అవసరాల కోసం ఇసుక విక్రయిస్తున్నా, ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇసుక లేక.. ఇంటి పనులు నిలిపేశా..! ఇంటి నిర్మాణానికి ఇప్పటివరకు రూ.20 లక్షలు ఖర్చు చేశా. స్లాబ్ దశ వరకు పనులు జరిగాయి. ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు కనీసం 50 టన్నుల ఇసుక అవసరమవుతుందని అనుకుంటున్నా. అయితే మార్కెట్లో ప్రస్తుతం సన్న ఇసుక టన్ను ధర రూ.3,200, దొడ్డు ఇసుక రూ.2,500 వరకు ఉంది. నిర్మాణం ఆగిపోవద్దనే ఉద్దేశంతో ఎక్కువ ధర పెడతామనుకున్నా.. ఎక్కడా దొరకడం లేదు. దీంతో నిర్మాణ పనులను ప్రస్తుతానికి నిలిపేశా. ప్రభుత్వం చొరవ తీసుకుని ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలి. ––వరికుప్పల శంకర్, తమ్మలోనిగూడ, రంగారెడ్డి జిల్లా ప్లాస్టరింగ్ ఇసుక ధరలు పెరిగాయి గతంలో స్లాబ్ ఇసుక టన్ను రూ.1,100 వరకుండేది. ఇప్పుడు రెండింతలై రూ.2,200 వరకు పలుకుతోంది. ప్లాస్టరింగ్ ఇసుక ధర దాదాపు మూడింతలు పెరిగింది. ఇసుక ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందనే భయంతో పనులు నిలిపేస్తున్నాం. తప్పనిసరిగా కొనుగోలు చేయాలని అనుకున్నా దళారీలు ధరలు పెంచేశారు. ఇసుకపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే మాకు కూడా గిట్టుబాటయ్యే అవకాశం లేదు. ––మేతరి స్వామి, బిల్డర్, తుర్కయాంజాల్ వర్షాకాలం వల్లే.. వర్షాకాలంలో రీచ్‌ల నుంచి ఇసుక తీయడం సాధ్యం కాదు. రహదారులకు వెళ్లే దారులు బురదతో ఉండటంతో వాహనాలకు అనుమతినివ్వడం లేదు. వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో 65 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వచేశాం. దీంతో ఇసుక కొరతను దాదాపు 70 శాతం మేర ఎదుర్కొంటున్నాం. ఆన్లైన్లో టీఎస్ఎండీసీ నిర్దేశించిన ధర రూ.600కు టన్ను చొప్పున అత్యంత పారదర్శకంగా విక్రయిస్తున్నాం. వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో త్వరలో ఇసుక లభ్యత సాధారణ స్థితికి చేరుకుంటుంది. ––మల్సూర్, ఎండీ, టీఎస్ఎండీసీ -
ఇసుక ఆక ఆన్లైన్
తెలంగాణ సర్కార్ భారీ ఆదాయం సమకూర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇసుకను విక్రయించి సొమ్ము చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో ఇసుకను పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు హైదరాబాద్ తరువాత మెదక్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇసుకను పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇసుక కొరతతో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయనే ఉద్దేశంతో ఇసుకను విక్రయించడం ద్వారా ఒకవైపు అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చేస్తూనే మరోవైపు ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మెదక్‌జోన్: రాష్ట్రంలో ఎక్కడ ఇసుక ఉందో అక్కడి నుంచి కొరత ఉన్నచోటుకు తరలించి విక్రయించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మిడ్‌మానేరు డ్యాం నుంచి ఇసుకను పెద్ద పెద్ద లారీల్లో తరలించి మెదక్‌లో డంప్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరంలో మూడుచోట్ల డంప్ చేస్తుండగా ఆ తరువాత మెదక్ జిల్లా కేంద్రంలోనే డంప్ చేస్తునట్లు సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారి ఒకరు తెలిపారు. 20 నుంచి 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను డంప్ చేశాకే విక్రయాలు మొదలు పెడతారని తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం సర్కార్‌కు అత్యధికంగా ఆదాయం సమకూర్చేది మద్యం అయితే ఆ తరువాత ఇసుకతోనే ఉంటోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మద్యం తయారీ కోసం కొంత మొత్తం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇసుకకు అదేం ఉండదు. నిల్వ ఉన్న చోటు నుంచి తెచ్చి లేనిచోట విక్రయించడమే. కేవలం రవాణా ఖర్చు తప్ప మరే ఇతర ఖర్చు ఉండదు. దీంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రావడం ఖాయమంటున్నారు. జిల్లాలో ఇసుక తవ్వడం నిషేధం.. జిల్లాలో మంజీరనది, పుష్పలవాగు, పసుపులేరుతోపాటు పలు మండలాల్లోని వాగులు వంకల్లో ఇసుక ఉంది. వరుస కరువు కాటకాలతో ఇప్పటికే భూగర్భ జలాలు 42 మీటర్ల లోతుకి పడిపోయిన నేపథ్యంలో ఇసుకను తరలిస్తే మరింత ప్రమాద స్థాయిలోకి ఊటలు పడిపోతాయని, తాగునీటికి సైతం కష్టాలు తప్పవనే ఉద్దేశంతో జిల్లాలో ఇసుకపై నిషేధం విధించారు. అయినప్పటికీ అక్కడక్కడా అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. అక్రమ రవాణాకు చెక్ ఏకంగా ప్రభుత్వమే నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇసుకను విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనిద్వారా అక్రమార్కులు మంజీరనదితో పాటు ఇతర వాగులు, వంకల్లోంచి అక్రమంగా ఇసుకను తరలించకుండా అడ్డుకట్ట వేసినట్లయింది. అక్రమ రవాణకు అడ్డుకట్ట పడకుంటే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సదరు యజమానిపై కేసులు నమోదు చేసేందుకైనా వెనుకాడబోమని పలువురు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్లో బుకింగ్ ఇసుక అవసరం ఉన్న వ్యక్తులు ఆన్లైన్ ద్వారా (మీసేవలో) టీఎస్ఎండీసీ వెబ్సైట్లోకి వెళ్లి అవసరమైన ఇసుకను క్యూబిక్ మీటర్లలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డబ్బును మీసేవ నిర్వాహకులకే నేరుగా చెల్లించి రసీదుతో ఇసుక నిల్వకేంద్రానికి వెళ్లి వాహనంలో తరలించుకోవాల్సి ఉంటుంది. ఇసుక నిల్వకేంద్రం నుంచి తరలించేందుకు వాహన రవాణ ఖర్చు సదరు కొనుగోలు దారుడే భరించాల్సి ఉంటుంది. ఇసుకను కొనుగోలు చేసే ప్రాంతంలోనే వేబ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు. త్వరలో విక్రయాలు ప్రారంభం మెదక్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో ఇసుక నిల్వకేంద్రం ఏర్పాటు చేశాం. ఇక్కడ 20 నుంచి 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ అయ్యాక విక్రయాలు ప్రారంభిస్తాం. అవసరం ఉన్నవారు మీసేవ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. – రామకృష్ణ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల ప్రాజెక్టు అధికారి -
మళ్లీ.. ఫిల్టర్ ఇసుక!
కేశంపేట: గతంలో జోరుగా కొనసాగిన ఫిల్టర్ ఇసుక దందా.. అధికారులు, పోలీసుల దాడులతో కొంతకాలం ఆగిపోయింది. ప్రస్తుతం వరుసగా ఎన్నికలు వస్తుండటంతో అధికారులు ఈ విషయంపై దృష్టిసారించకపోవడంతో మళ్లీ ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. కేశంపేట మండలం బో«ధునంపల్లి గ్రామ శివారులో, తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామ శివారులోని వాగులో మటిని తీసి యాథేచ్ఛగా ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు. లింగారావుపల్లి శివారులో ఇసుకను ఫిల్టర్ చేసి బోధునంపల్లి గ్రామ శివారులో డంపు చేస్తున్నారు. ఈ ఇసుకను రాత్రి సమయాల్లో లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరస్తున్నారు. గతంలో రాయితో ఫిల్టర్లను నిర్మించి మట్టితో ఇసుకను తయారు చేసేవారు. ఈ విషయం అధికారులకు తెలిసి ఫిల్టర్లను ధ్వంసం చేసేవారు. ఇప్పుడు అక్రమార్కులు ట్రెండ్ మార్చి ట్రాక్టర్ ట్రాలీలోనే ఇసుకను ఫిల్టర్ చేస్తున్నారు. ఎవరైనా అధికారులు అటువైపు వస్తే తప్పించుకోవడానికి సులువుగా ఉంటుందని ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. రెండు మండలాలను వాగు విభజిస్తుండడంతో వాగు అవతలివైపు ఫిల్టర్లను, ఇవతలి వైపు డంపింగ్ ఏర్పాటు చేసుకొని దందాను కొనసాగిస్తున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం రెండు మండలాల మధ్య నడుస్తున్న నేపథ్యంలో రెండు మండలాల అధికారులు ఏకకాలంలో దాడి చేస్తే తప్ప ఈ దందా ఆగదని రైతులు పేర్కొంటున్నారు. -
ఇసుక రవాణాకు ‘కోడ్’ బ్రేక్
సాక్షి, మోర్తాడ్: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి న నేపథ్యంలో అభివృద్ధి పనులకు ఇసుకను రవాణా చేయడాన్ని నిలిపి వేస్తూ రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పెద్దవాగులో గుర్తించిన పలు పాయింట్ల నుంచి బుధ, శుక్రవారాలలో అభివృద్ధి పనుల కోసం ఇసుకను తరలించే వారు. మో ర్తాడ్ మండలంలోని సుంకెట్, ధర్మోరా, వేల్పూర్ మండలంలోని కుకునూర్, కోమన్‌పల్లి, వెంకటాపూర్ పాయింట్ల నుంచి ఇసుకను తరలించే వారు. జక్రాన్‌పల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి కూడా అభివృద్ధి పనుల కోసం ఇసుకను తరలించేందుకు అనుమతి ఇచ్చేవారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో గతంలో ప్రారంభించిన పనులతో పాటు, కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి పను లను నిలపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో రూ.కోట్లాది విలువ చేసే అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. అభివృద్ధి పనులను నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్ ముందుగానే ఆదేశించడంతో అభివృద్ధి పనుల కోసం ఇసుక అవసరం ఉండదని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. అభివృద్ధి పను లు జరుగనప్పుడు ఇసుక రవాణాకు అను మతి ఇవ్వకూడదని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఒకవేళ అభివృద్ధి పనులకు ఇసుకను తరలించేందుకు అనుమతి ఇస్తే తరలించిన ఇసుక పక్కదారి పట్టే అవకాశం ఉందని అధికారులు సందేహిస్తున్నారు. దీంతో ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వకపోవడమే మంచిదని అధికారులు ఆలోచిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నుంచి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వడం లేదు. ఇది ఇలా ఉండగా ప్రైవేటు భవనాల నిర్మాణం కోసం మాత్రం ఇసుక రవాణా చేసేందుకు అనుమతి ఇచ్చే అవకా శం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పనులకు ఒక ట్రిప్పునకు రూ.500 లను వసూలు చేస్తుండగా ప్రైవేటు నిర్మా ణాలకు ఇసుక కోసం రూ.900ల చొప్పున వసూలు చేస్తున్నారు. -
పోలీసులా.. తాబేదార్లా?: దాసోజు శ్రవణ్
ఇసుక వ్యాపారంపై కేటీఆర్ అబద్ధాలు సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలో పోలీసులు ప్రభుత్వానికి తాబేదార్లుగా మారారని, మంత్రి కేటీఆర్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై చేసిన విమర్శలను ఖండిస్తున్నామని పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ఇసుక పేరుతో కాంగ్రెస్ ఏనాడూ వ్యాపారం చేయలేదని, టీఆర్ఎస్ పార్టీ ఇసుక మాఫియాగా మారిందని ధ్వజమెత్తారు. ట్రక్కుకు రూ.8,250 ప్రభుత్వానికి చెల్లిస్తూ, మార్కెట్లో రూ.80 వేలకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన అద్దంకి దయాకర్, కేకే మహేందర్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఇసుక వ్యాపారంతో తమకు సంబంధం లేదని మంత్రి కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. సిరిసిల్ల దళితులపై దాడుల విషయంలో కేటీఆర్ మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. హిమాన్షు మోటార్స్‌పై కేటీఆర్ చెప్పినవి పచ్చి అబద్ధాలని, దానితో తనకు సంబంధం లేదని చెబుతున్న కేటీఆర్, మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లో చూపింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. టెండర్లు లేకుండా వెంకయ్య నాయుడు కుమారుడి కంపెనీ నుంచి ఇన్నోవాలను కొన్నది నిజం కాదా అని నిలదీశారు. అలాగే స్వర్ణ భారతి ట్రస్ట్‌కు రాయితీలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. వీటన్నిటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, లేదంటే గన్ పార్క్ దగ్గర బహిరంగ చర్చకు రావాలని సవాలుచేశారు. సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ టీఆర్ఎస్ తొత్తుగా మారారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. -
ఇసుక చిచ్చు!
► అధికార పార్టీలో వర్గ విభేదాలు ► ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తున్న నేతలు ► సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు జిల్లాలోని ఇసుక వ్యాపారం టీడీపీలో వర్గ విభేదాలు పెంచుతోంది. కొందరు నేతలు ఉచిత ఇసుక విధానాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇసుక తవ్వకాలకు సహకరించిన డ్వాక్రా గ్రూపుల మొత్తాలను ఎగవేయడం.. సరిహద్దు నియోజకవర్గాల్లో హల్చల్ చేయడం వంటి సంఘటనలు నేతల మధ్య విభేదాలు పెంచుతున్నాయి. అన్యాయానికి గురైన ద్వితీయశ్రేణి నాయకులు కొందరు సీనియర్ల సహకారంతో విషయాన్ని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళుతున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేతలు వర్గాలు, గ్రూపులుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన నేతల అక్రమాలను అవకాశం వచ్చిన సమయంలో సీఎం దృష్టికి తీసుకువెళ్లడం నేతలకు పరిపాటిగా మారింది. మరికొన్నింటి వివరాలు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపుతున్నారు. రానున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రి పుల్లారావు శాఖలను కొన్నింటినైనా తగ్గించేలా చేయాలని ఒక వర్గం ప్రయత్నిస్తుంటే, పుల్లారావు తన వ్యతిరేక వర్గ పరపతిని తగ్గించేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే యత్నం చేస్తున్నారు. ఉగాది పర్వదినాన జరిగిన సంఘటనను ఇందుకు ఉదాహరణగా పార్టీ నేతలు చెబుతున్నారు. గణాంకాలతో సహా ఫిర్యాదు.. ఉగాది పర్వదినాన తాడేపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు దండమూడి శైలజారాణి మండలంలో ఇసుక తవ్వకాల్లో జరుగుతున్న అవినీతిని సీఎంకు వివరించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇసుక రీచ్‌ల్లోని ఇసుకను పొన్నూరు నియోజకవర్గ నేతలు ఎక్కువుగా అమ్ముకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అమ్మకాల కారణంగా ప్రభుత్వం కోల్పోయిన ఆదాయ వివరాలను గణాంకాలతో సహా వివరించినట్టు తెలుస్తోంది. ఏడాది కాలంలో ఇసుక తవ్వకాలకు సహకరించిన డ్వాక్రా గ్రూపు సభ్యులకు, మత్స్యకారులకు చెల్లింపులు చేయకుండా, వారిపై బెదిరింపులకు దిగుతున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీని కొందరు నేతలు అపహాస్యం చేస్తున్నారని, అధికారులను అడ్డుపెట్టుకుని తమ సొంత అవసరాలకు, బడా కంపెనీలకు ఇసుక ఎలా అందిస్తున్నారో వివరించారు. రాజధాని నిర్మాణానికి ఇసుక తోలుతున్నామని చెబుతూ వేరే సొసైటీ సభ్యులు ఎవరినీ అక్కడకు రానీయకుండా అధికారులతో, పోలీసులతో ఎలా బెదిరిస్తున్నారో.. తదితర విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ వర్గాల సమాచారం. మంత్రి పుల్లారావు సమక్షంలోనే ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై మరికొన్ని వివరాలను సీఎం పుల్లారావు, ఇతర వర్గాల ద్వారా సేకరించినట్టు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదు సమయంలో మంత్రి పుల్లారావు అక్కడే ఉండటం కాకతాళీయంగా జరగలేదని, వ్యూహాత్మకంగానే పొన్నూరు నేతలపై మంత్రి ఫిర్యాదు ఇప్పించారనే అభిప్రాయం కూడా పార్టీలో లేకపోలేదు. పొక్లెయిన్లన్నీ వారివే.. ఉచిత ఇసుక విధానాన్ని టీడీపీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రతి రీచ్‌లోనూ రెండుమూడు పొక్లెయిన్లు ఏర్పాటు చేసుకోడానికి అధికారులు అనుమతి ఇస్తున్నారు. రీచ్‌లలో ఎవరైనా పొక్లెయిన్లు ఏ ర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొన్నా టీ డీపీ నేతలే వీటిని ఏర్పాటు చేసి నిబంధనలకు వి రుద్ధం గా లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను నింపుతున్నారు. రోజుకు సంపాదన రూ.లక్ష.. ట్రాక్టరు ట్రక్కులో ఇసుక లోడ్ చేయడానికి రూ.300 నుంచి రూ.500 వరకూ, లారీకి రూ.1000 వరకూ టీడీపీ నేతలు వసూలు చేస్తున్నారు. ఒక పొక్లెయిన్ ద్వారా రోజుకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వర కూ టీడీపీ నేతలు సంపాదిస్తున్నారు. గతం కంటే ఈ విధానమే బాగుందని, 210 సామర్థ్యం కలిగిన పొక్లెయిన్‌ను కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకుని టీడీపీ నేతలు ఈ వ్యాపారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. అన్ని రీచ్‌లలోనూ ముఖ్యనేతలకు చెందిన పొక్లెయిన్లే ఉండటంతో మిగిలిన నేతలు వీటిపైనా ఫిర్యాదు చేస్తున్నారు. -
మహిళ కంట్లో ‘ఇసుక’
వ్యాపారంలో మహిళా సంఘాలు అప్పులపాలయ్యూరుు. అధికార పార్టీ పెద్దలు రూ.కోట్లు వెనకేసుకుంటే నిబంధనలకు లోబడ్డ ఈ సంఘాలకు రుణభారమే మిగిలింది. రోజుకో విధానం మార్చుతూ సర్కారు గందరగోళం చేసింది. ర్యాంపుల నిర్వహణ కింద వెచ్చించిన మొత్తాలను చెల్లించాలంటూ మూడు మహిళా సంఘాలు కోర్టుకెక్కాయి. బకాయిలు చెల్లించడానికి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. * ఇసుక వ్యాపారంలో మహిళాసంఘాలు అప్పులపాలు * కోర్టును ఆశ్రయించిన కొన్ని సంఘాలు * ఇసుక కోసం డీడీలు తీసిన వారిది అదే పరిస్థితి శ్రీకాకుళం టౌన్: వంశధార.. నాగావళి నదుల్లో 34చోట్ల ఇసుక తవ్వకాలను ప్రభుత్వం మహిళాసంఘాలకు అప్పగించింది. ఏడాదిపాటు వాటితోనే అమ్మకాలు సాగించాలని సంఘాలతో పెట్టుబడులు పెట్టించింది. ర్యాంపుల వరకు రోడ్లు వేయించింది. తర్వాత యంత్రాలను సహితం అద్దెకు తెచ్చుకోమని చెప్పింది. ఒక్కోప్రాంతంలో ఒక్కో సంఘం ఈ బాధ్యతలను తీసుకుంది. తీరా బ్యాంకుల్లో ఉన్న సొమ్మున పెట్టుబడి పెట్టాక కొన్ని చోట్ల ర్యాంపులు ప్రారంభం కాలేదు. మరికొన్ని చోట్ల వ్యాపారమే జరగలేదు. దీనికితోడ 17 ర్యాంపుల్లో వ్యాపారం మొదలయ్యూక అధికార పార్టీ నేతల పెత్తనం ఆరంభమైంది. తాజాగా అసలు ర్యాంపులను మహిళా సంఘాల నుంచి తప్పించింది. మైనింగ్ అధికారులకు అప్పగించింది. దీంతో మహిళా సంఘాలు విస్తుపోయాయి. టీడీపీ ప్రభుత్వం ఇసుకపై సరైన విధానం అమలు చేయకపోవడంతో మహిళా సంఘాలు అవస్థలు పడ్డారుు. తొలుత మొదట మహిళా సంఘాలకు తవ్వకాలను కట్టబెట్టారు. వారి నుంచి ఇసుక పొందాంటే మీసేవా కేంద్రాల్లో డీడీలు చెల్లించి తర్వాత ర్యాంపుల వద్ద వాటిని అందజేస్తే తప్ప ఇసుక సరఫరా జరిగేది కాదు. కొన్నాళ్లు నదిలోని ఇసుకను రేవులనుంచి డంపింగ్ యార్డులకు చేరవేసి అమ్మకాలు జరిపేవారు. అలా అమ్మకానికి ఉంచిన రూ.36లక్షల విలువైన ఇసుక ఇప్పటికీ పలాస వద్ద కుప్పలుగా పడిఉంది. ఇసుక ఉచితమనేసరికి కొనేవారు లేక కుప్పలు తెప్పలుగా వదిలేశారు. ఆ ఇసుక కోసం మహిళా సంఘాలు రూ.36లక్షలు ఖర్చు చేశాయి. దీనికి తోడు కొన్ని చోట్ల ర్యాంపుల నిర్వహణకు పెట్టుబడులు పెట్టారు. ఇసుక తవ్వకుండా వాటిని నిలుపుదల చేశారు. జిల్లాలో 34 ర్యాంపులకు గతంలో అనుమతిస్తే నిర్వహణ కింద స్వయంశక్తి సంఘాలు సొంత సొమ్ము వెచ్చించాయి. యంత్రాల అద్దెలతో పాటు ర్యాంపుల వరకు వేసిన రోడ్లు, ఇతర అవసరాలకు రూ.లక్షల్లోనే ఖర్చుచేశాయి. అయితే పెట్టుబడులు చేతికందకుండానే పాలసీ మారిపోయింది. పోనీ ఇసుక అమ్ముదామంటే జన్మభూమి కమిటీలు పెత్తనం చేస్తున్నాయి. దీంతో ఇసుక నిర్వహణకు ముందుకు వచ్చిన కొన్ని సంఘాలు అప్పులపాలైయ్యాయి. 17 సంఘాలకు సుమారు రూ.60 లక్షలకు పైగా బకాయిలున్నాయి. వీటన్నింటికి అధికారుల దగ్గర సమాధానం కరువవుతోంది. ఆమదాలవలస నియోజక వర్గానికి చెందిన తోటాడ, అక్కివరం, సింగూరు ర్యాంపుల్లో కూడా మహిళా సంఘాలు చేతులు కాల్చుకున్నాయి. రూ.9లక్షలు ఖర్చు పెట్టాక ఇసుక విధానం మారిపోయింది. దీంతో సంఘాలు నష్టపోయాయి. ఈ నిధులు ఎవరిస్తాంటూ ఆ మూడు గ్రామాలకు చెందిన స్వయంశక్తి సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. మరోపక్క ఇసుక కోసం వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.2.20కోట్లుచెల్లించారు.. డీడీలు చెల్లించి మూడునెలలు గడిచినా ఇంతవరకు చెల్లింపులు జరగక పోవడంతో ఇసుక వ్యాపారులు కాళ్లు అరిగేలా డీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మహిళాసంఘాలకు పెట్టబడుల మొత్తాలు తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం యోచిస్తోందని డీఆర్డీఏ పీడీ తనూజారాణి సాక్షికి చెప్పారు. -
తమ్ముళ్లకు సిరులు
శ్రీకాకుళం టౌన్ : ఇసుక వ్యాపారం తెలుగు తమ్ముళ్లకు సిరులు కురిపిస్తోంది. ఉచిత విధానాన్నీ జన్మభూమి కమిటీలు అనుకూలంగా మలుచుకున్నాయి. అధికారులను డమ్మీలుగా చేసి అధికార పార్టీ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు. తొలుత జిల్లాలో మహిళా సంఘాల పేరుతో రూ.65కోట్ల ఇసుక వ్యాపారం జరిగితే అనధికారికంగా రూ.వందలకోట్లు విలువైన ఇసుకను అధికారపార్టీ పెద్దలే అమ్మేశారనేది బహిరంగ రహస్యం. ఇసుక విధానంలో లోపాలు ఉన్నాయంటూ ఈ-వేలంలో ఇసుక అమ్మకాలు సాగిస్తామని జనవరిలో ప్రభుత్వం ప్రకటించింది. రెండునెలలపాటు ఏవేలం లేకుండా చేశారు. ఇదే అదనుగా ఇంజినీరింగ్ పనులకంటూ ఇసుకను కొల్లగొట్టేశారు. విశాఖకు ఇసుక కావాలన్న సాకు చూపి నదుల్లో ఇష్టానుసారంగా ఇసుక తవ్వేశారు. ప్రభుత్వం ఈనెలలో ఆ విధానం తూచ్ అంది. అంతా ఉచితమని ప్రకటించింది. ఈ ఉచిత విధానాన్నీ తెలుగు తమ్ముళ్లు వదల్దేదు. ఏటి ఒడ్డు గ్రామాల్లో వీరంతా పాగా వేస్తున్నారు. అక్రమ వసూళ్లకు దిగుతున్నారు. వాల్టాచట్టం, పర్యావరణ అనుమతులకు లోబడి తవ్వకాలు జరపాలంటూ కలెక్టరు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారు. తాజాగా షరతులు ఇసుక రీచ్ పరిస్థితి చేజారిపోతుండటంతో కలెక్టరు ఇటీవల రంగంలోకి దిగారు. తన పరిధిలో నాలుగు రీచ్‌లకు పర్యావరణ అనుమతులిచ్చి అక్కడే తవ్వకాలు జరపాలని షరతు విధించారు. విశాఖ అవసరాలకు ఒకచోట, వంశధార ప్రాజెక్టు అవసరాలకు వేరొకచోట తవ్వకాలు జరుపుకునేందుకు అవకాశమిచ్చారు. తాజాగా మరో ఆరు రీచ్‌లకు అనుమతులిచ్చారు. జలుమూరు మండలం అందవరంతోపాటు అందవరం రేవును ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు, పొన్నాం రేవును విశాఖ అవసరాలకు కేటాయింపులిచ్చారు.కిల్లిపాలెం, ముద్దాడపేట, అంగూరు, దొంపాక, పెద్దసవళాపురం, పురుషోత్తపురం, యరగాం,బొడ్డేపల్లి రేవుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. నిర్మాణదారులకు తగ్గని బారం ఇసుక ఉచితమన్నా ప్రజలకు భారం తప్పలేదు. మరింత పెరగడం విశేషం. నది నుంచి ఒడ్డుపైకి నాటుబళ్లతో తరలించి ఇసుక ట్రాక్టర్లకు ఇస్తున్నామని వెయ్యి నుంచి రెండు వేల రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే టెక్కలి డివిజన్లో మాత్రం ఇసుక లభ్యత లేని కారణం చూపించి ట్రాక్టరు ఇసుక రూ.3 వేల నుంచి 4వేలకు విక్రయిస్తున్నారు. నదిపరివాహక ప్రాంతాల్లో తెలుగుతమ్ముళ్లు అక్రమ వసూళ్లకు తెగబడుతుండడంతో వారికి ముడపులు చెల్లించి ఆపై ట్రాక్టరు అద్దె, కళాసీల ఖర్చంటూ నిర్మాణ దారులనుంచి భారీగానే వసూలు చేస్తున్నారు. -
'ఇసుక అమ్మకాలలో వెయ్యి కోట్ల దోపిడీ'
హైదరాబాద్: ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తారా.. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీలో ఇసుక అమ్మకాలలో రూ.వెయ్యి కోట్ల దోపిడీ జరిగిందని బొత్స ఆరోపించారు. ఇసుక అమ్మకాలతో రూ.3 వేల కోట్లు ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు కేవలం రూ.850 కోట్ల లాభం మాత్రమే వచ్చిందని బాబు పేర్కొంటున్నారని చెప్పారు. అదేవిధంగా విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. 40 క్యూబిక్ మీటర్ ఇసుక ధరను టీడీపీ ప్రభుత్వం రూ.550కి పెంచిందని గుర్తుచేశారు. ఈ లెక్కన ప్రభుత్వానికి ఎంతకాదన్నా రూ.1650 కోట్ల ఆదాయం వస్తుందని బొత్స సత్యనారాయణ వివరించారు. -
‘ఇసుక’ దుమారంలో అధికారులే బలి
నియమ నిబంధనలు కాలరాస్తోన్న ప్రభుత్వ పెద్దలు ♦ డబ్బులు దండుకుంటున్న టీడీపీ నేతలు ♦ వారి పాపం అధికారుల మెడకు చుట్టుకుంటున్న వైనం ♦ క్రయవిక్రయాల నుంచి తప్పించాలంటున్న సిబ్బంది సాక్షి, హైదరాబాద్ : సర్కారు ఇసుక వ్యాపారంలో ప్రభుత్వ అధికారులు బలైపోతున్నారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో దోచుకుతింటున్న టీడీపీ ప్రజాప్రతినిధుల వల్ల వ్యాపారం చేస్తోంది ప్రభుత్వమే కాబట్టి వారి పాపం అధికారులు, కిందిస్థాయి సిబ్బంది మెడకు చుట్టుకుంటోంది. ఇసుక అమ్మకాల్లో అక్రమాలను అరికట్టడం కోసం రూపొందించిన నియమ నిబంధనలను ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలు కాలరాస్తున్న కారణంగా తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కోర్టు ముందు దోషిగా నిలబడాల్సి వస్తోంది. గతంలో కృష్ణా జిల్లాలో ఎమ్మార్వో వనజాక్షి ఇసుక మాఫియా చేతుల్లో దాడికి గురికావాల్సి వచ్చింది. ఇసుక మాఫియా ఆగడాలకు తాళలేక చివరకు రీచ్‌ల వద్ద ఇసుక క్రయవిక్రయాలను పర్యవేక్షించాల్సిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సిబ్బంది తమను విధుల నుంచి తప్పించాలని కోరుతున్నారు. ఈమేరకు ప్రకాశం జిల్లాలో కిందిస్థాయి సిబ్బంది తమను ఈ విధుల నుంచి త ప్పించాలని ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది కిందట కొత్త ఇసుక విధానాన్ని ప్రకటించిన తర్వాత కొంతకాలంగా దీని ద్వారా వచ్చే ఆదాయంపై దృష్టి కేంద్రీకరించడం మొదలుపెట్టింది. వ్యాపారం చేస్తోంది ప్రభుత్వమే కాబట్టి ఇందులో నియమ నిబంధనలు పూర్తిగా పక్కకుపోయాయి. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. అక్రమాలకు ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం పలు నియమ నిబంధనలతో గతేడాది ఆగస్టు 28న కొత్త ఇసుక విధానం తెచ్చిన సర్కారు.. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో వాటిని అమలు చేయకుండా పూర్తిగా గాలికొదిలేసింది. రీచ్‌లో కూలీల ద్వారా ఇసుక తవ్వకం వీలుకాని చోట్ల పొక్లెయిన్లను నామమాత్రంగా ఉపయోగించాలని స్పష్టంగా పేర్కొంది. వాస్తవ పరిస్థితుల్లో దాదాపు అన్ని ప్రధాన రీచ్‌ల్లోనూ పొక్లెయిన్ల వాడకం యథేచ్చగా కొనసాగుతోంది. నదులకు పరిసరాల్లోని దాదాపు 101 పెద్ద రీచ్‌లకుగాను అందులో 74 చోట్ల పొక్లెయిన్ల ద్వారానే ఇసుక తవ్వకాలకు అనుమతించారు. గోదావరి, కృష్ణా నదులున్న ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కటి మినహా అన్ని రీచ్‌ల్లో పొక్లెయిన్లను వాడుతున్నారు. ఇసుక అమ్మకాలు కేవలం స్టాక్ పాయింట్ వద్దనే జరగాలని పేర్కొన్నా... దాదాపు అన్ని చోట్ల రీచ్‌లోకి అనుమతి ఇస్తూ, అక్కడే వినియోగదారుల వాహనాలకు ఇసుకను లోడ్ చేస్తున్నారు. 359 ఇసుకరీచ్‌లు ఉంటే స్టాక్ పాయింట్లు కేవలం 22 మాత్రమే ఉన్నాయి. రీచ్‌లో కేవలం ఒక మీటరు లోతు మాత్రమే ఇసుక తవ్వకం జరపాలి. పొక్లెయిన్ల వాడకంతో దాదాపు అన్ని చోట్లా ఇసుక దొరికినంత వరకు లోతున తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రతి ఇసుక రీచ్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా... కేవలం 37 చోట్లే వాటిని అమర్చారు. -
కూలీలే బలి పశువులు!
రాయదుర్గం : ఇసుక దందాల్లో అధికార పార్టీ నేతలు లాభపడుతుండగా... బలవుతోంది మాత్రం పొట్ట కూటి కోసం కూలికి వెళ్తున్న బడుగు జీవులు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అసలు దొంగలు దొరల్లా తిరుగుతున్నారు. కూలీలు మాత్రం కేసుల్లో ఇరుక్కొంటున్నారు. దీనివల్ల వారి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆదివారం రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం రచ్చుమర్రి వద్ద వేదావతి హగరి నది నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకుని.. 15 మందిని అరెస్టు చేసిన విషయం విదితమే. వీరందరూ కర్ణాటక ప్రాంతానికి చెందిన కూలీలే. ఇంతటితో పోలీసులు చేతులు దులుపుకున్నారు. కీలక పాత్రధారి అయిన కర్ణాటకకు చెందిన మంజును ఇంత వరకు పట్టుకోలేదు. ఓ అధికార పార్టీ ముఖ్యనేత జోక్యం వల్ల ఈ కేసు విచారణలో పురోగతి కన్పించలేదన్న విమర్శలున్నాయి. ఈ సంఘటన వెలుగులోకి వచ్చి 48 గంటలు కాకముందే ఇదే నియోజకవర్గంలోని గుమ్మఘట్ట మండలంలో టీడీపీ ఎమ్పీటీసీ సభ్యుడి పొలంలో 50 ట్రిప్పుల ఇసుక డంపింగ్ బయటపడింది. ఇక్కడ ఇసుకను ఇతరులు డంపింగ్ చేశారంటూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేసులను నిష్పక్షపాతంగా విచారించాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తూతూమంత్రంగా విచారణ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులే నిందితుల పేర్లు వెల్లడించి, ఆ వ్యక్తులను సైతం పట్టుకోకపోవడం ఈ విమర్శలకు బలం చేకూర్చుతోంది. రచ్చుమర్రి ఇసుక కుంభకోణంలో కణేకల్లు మండలానికి చెందిన ముఖ్య నేతల హస్తం ఉందని ఆ మండల ప్రజలు కోడై కూస్తున్నా.. పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. వారితో సత్సంబంధాలు ఉన్న ఓ వ్యక్తి ద్వారా కేసును నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బొమ్మనహాళ్ మండలంలో కూడా కర్ణాటక సరిహద్దున కొంత మంది టీడీపీ నేతలు ఇసుక డంపింగ్ చేశారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు. రాయదుర్గం మండలంలోనూ ఇదే పరిస్థితి. నేతలకు చీవాట్లు పెట్టిన ఎమ్మెల్యే! తాను ముఖ్యమంత్రి చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్నానని, ఇసుక దందాను బట్టబయలు చేసి పరువుతీశారంటూ ఆయా మండలాల నేతలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చీవాట్లు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అవాక్కైన నేతలు కేసులను నీరుగార్చే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. -
ఇసుక బుక్కేస్తున్నారు..!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ‘‘ఇసుక వ్యాపారులతో ఏగలేక పోతున్నాం. రైతులం ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. అధికారులు పూర్తిగా వదిలే శారు. మీరన్నా ఇసుక తవ్వకాలను ఆపించి బోర్లు ఎండిపోకుండా చూడాలి సార్...’’ అంటూ ఇటీవల ఓ ప్రైవేటు టీవీచానల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల గ్రామానికి చెందిన ఓ యువరైతు చేసిన వేడుకోలు. ఈ ఒక్క ఉదాహరణ చాలు జిల్లాలో ఇసుక దందా ఏ రీతిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవడానికి. వాస్తవానికి అటు రెవెన్యూ, ఇటు పోలీసు శాఖలకు చెందిన అధికారులు అంతగా దృష్టి సారించకపోవడం వల్లే ఇసుక వ్యాపారం మూడు లారీలు.. అరవై ట్రిప్పులుగా విరాజిల్లుతోంది. ఉన్నతాధికారులకు కూతవేటు దూరంలో ఉండే గ్రామాల్లో ఎక్కడబడితే అక్కడ వేలాది ఇసుక కుప్పలు రహదారుల వెంట, చెలకల్లో, గ్రామ శివార్లలో కనిపిస్తున్నాయి. కానీ, అధికారులకు ఇవి ఎందుకు కనపడడం లేదన్నది బేతాళ ప్రశ్న. నల్లగొండ మండల పరిధిలోని నర్సింగ్‌భట్ల గ్రామానికి వెళితే చాలు ఎంత పెద్దమొత్తంలో ఇసుక డంపులు ఉన్నాయో తెలిసిపోతుంది. కనగల్ వాగూ ఇప్పటికే లూటీ అయ్యింది. ఈ రెండు మండలాల పరిధిలోని వాగుల నుంచి నిత్యం 60 నుంచి70 లారీలు ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నాయి. పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ అక్రమ దందా జోరుగా సాగుతోందన్నది ప్రధాన విమర్శ. ఇసుక లారీలు రాత్రి 10 గంటలు దాటాక మొదలు పెట్టి ఉదయం 9 గంటల వరకు హైదరాబాద్‌కు వెళ్తుంటాయి. ఈ లారీలకు కొందరు యువకులను ఎస్కార్టుగా నియమించుకుంటున్నారు. కార్లలో, లేదంటే మోటార్ బైక్‌లపై ముందు వారెళ్తుంటే వాహనాలు బారులు దీరి వెళుతున్నాయి. మరికొందరు వ్యాపారులు ముందే తమ వాహనాలు వెళ్లాల్సిన మార్గంలోని పోలీసుస్టేషన్లతో మాట్లాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇవి కాకుండా ఇంకొందరు పోలీసులు లారీలను అడ్డగిస్తూ లారీకి కనీసం రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు పోలీసులకేం తీసిపోవడం లేదు. ఉదాహరణగా నల్లగొండ తహసీల్దార్ కార్యాలయాన్నే తీసుకుంటే ఇక్కడ పనిచేస్తున్న ఓ ముగ్గురు ఉద్యోగులు ఇసుక వసూళ్ల దందాలో రారాజులుగా మారారు. ఈ ముగ్గురూ ఇసుక లారీల నుంచి చేస్తున్న వసూళ్ల వ్యవహారం బహిరంగ రహస్యంగా మారింది. దేవరకొండ రోడ్డులోని ఓ ఫంక్షన్‌హాల్ వెనుక గుండ్లపల్లి, కంచనపల్లి, హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో కాపు కాసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ‘డబ్బులు ఇస్తే వదిలేస్తున్నారు. ఇవ్వకపోతే వాల్టా కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని..’ ఇటీవల ఓ నాయకుడు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టుకుని ఫైన్ వేసిన లారీల నుంచి ఇసుకను రెవెన్యూ కార్యాలయంలో అన్లోడ్ (డంప్) చేయాల్సి ఉంది. లారీకి రూ. 25 వేల ఫైన్ వేస్తున్న అధికారులు ఇసుకను అన్లోడ్ చేయించకుండా వదిలేసేందుకు ఒక్కోలారీ నుంచి రూ. 15 వేల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారని సమాచారం. ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు రూ.25వేల ఫైన్ వేసిన ఏ ఒక్క లారీలోని ఇసుకను డంప్ చేయించలేదంటున్నారు. ఇసుక అక్రమ దందాను నియంత్రించాల్సిన రెండు శాఖల అధికారులే వసూళ్లకు అలవాటు పడడంతో వాగుల్లో ఇసుక కనుమరుగవుతోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటి ప్రమాదకరస్థాయికి చేరుకునే ముప్పు పొంచి ఉంది. ఉన్నతాధికారులు మేల్కొని చర్యలు తీసుకోకుంటే వాగులే కాదు, వ్యవసాయ బోర్లూ అడుగంటే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
తవ్వేస్తున్నారు
వాకాడు, న్యూస్‌లైన్: కంచే చేను మేస్తోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందంలోని కొందరు సభ్యులే అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్నారు. అధికారుల్లోనే కొందరు అండగా నిలవడంతో ఇసుక వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా స్వర్ణముఖి నదిలోని ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. జిల్లాలోని ఇసుక రీచ్‌ల్లో మైనింగ్‌కు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల గడువు ఇటీవల పూర్తయింది. ఈ క్రమంలో ఇసుకకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. లంచాలకు అలవా టు పడ్డ కొందరు అధికారులను లోబరచుకుని వాకాడు, కోట, చిట్టమూరు మండలాల పరిధిలోని స్వర్ణముఖి నదిలో పలుచోట్ల ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రేయింబవళ్లు ట్రాక్టర్లలో ఇ సుక తరలించేస్తున్నారు. సందట్లో సడేమియా : ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆయా పంచాయతీ కార్యదర్శుల నుంచి కూపన్లు పొంది ఇసుక తో లుకోవచ్చు. ఇతరులు అయితే నిర్ణీత మొత్తం చలానా కట్టి పర్మిట్లు పొందాలి. ఈ అనుమతుల మంజూరు విషయంలో కొన్ని పంచాయతీల కార్యదర్శులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ అ క్రమ రవాణాను అడ్డుకోవాల్సిన టాస్క్‌ఫోర్స్ బృందంలోని కొందరు స భ్యులు మరింత ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున తీసుకుని ట్రాక్టర్లకు రైట్..రైట్ చెబుతున్నారని ఇసుక లోడింగ్‌కు వెళ్లే కూలీలే చెబుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలకు వాహనాలు కూడా కేటాయించారు. అయితే ఈ బృందాల్లోని కొందరు ఇసుక రేవుల్లోనే మకాం వేసి డబ్బులు దం డుకోవడం చూసిన వారు విస్తుపోతున్నారు. ప్రధానంగా వాకాడు, బాలిరెడ్డిపాళెం, కాశీపురం ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కాశీపురంలో అయితే స్థానిక సర్పంచ్ రసీదులు ముద్రించి ట్రాక్టర్‌కు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. అక్రమ రవాణా విషయాన్ని తహశీల్దార్ కల్యాణ్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా కఠినచర్యలు చేపడతానని తెలిపారు. పర్మిట్ల కంటే అదనంగా ఇసుక తోలితే ఆ వాహనాలు సీజ్ చేస్తామని చెప్పారు. -
తవ్వెయ్.. దోచెయ్
పీసీపల్లి, పెద్దారవీడు, న్యూస్‌లైన్: ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. పీసీపల్లి మండలంలో పాలేటి రిజర్వాయర్ పేరు చెప్పుకొని ఇసుక తరలిస్తుంటే...పెద్దారవీడు మండలం తోకపల్లెలో తీగలేరు నుంచి ఇసుక తవ్వి అమ్ముకుంటున్నారు. పీసీపల్లి ప్రాంతంలో దళారులు ఏకంగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని మరీ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ఒక వ్యాపారి ఇసుక తరలించేందుకే ఏకంగా ఐదు ట్రాక్టర్లు కొత్తవి కొనుగోలు చేశాడంటే..ఇసుక చౌర్యం ఎంతమేర జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక తరలిస్తున్న వారిని ప్రశ్నిస్తే పాలేటి రిజర్వాయర్ కోసం తీసుకెళ్తున్నామని చెబుతున్నారు. అసలు రిజర్వాయర్ కోసం తీసుకెళ్తున్నారో..లేక బయటి ప్రాంతాలకు తరలిస్తున్నారో పట్టించుకోకుండా ఇసుక వ్యాపారులిచ్చే మామూళ్లకు తలొగ్గి అధికారులు అక్రమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. కాసులు కురిపిస్తున్న ఇసుక వ్యాపారం మండలంలోని పాలేటిగంగ, వెంగళాపురం, పోతవరం, నేరేడుపల్లి, అలవలపాడు, బట్టుపల్లి, పెదవరిమడుగు, పాలేటిపల్లి, పాలేటి రిజర్వాయర్ చుట్టుపక్కల ఇసుక తరలిస్తున్నారు. కూలీలకు ట్రక్కు నింపితే రూ.500ల వరకు చెల్లించి యజమానులు ట్రక్కు ఇసుక రూ. 3500 వరకు అమ్ముకుంటారు. అదే టిప్పర్ అయితే దాదాపుగా రూ.15 వేల దాకా విక్రయిస్తారు. రోజూ ట్రాక్టర్లలో వంద లోడ్లకు పైగా ఇసుకను కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు, బొట్లగూడూరు, పొన్నలూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామాల్లో ఉండే చోటా అధికార పార్టీ నాయకుల అండ దండలతో వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. ఇసుక తరలింపుపై ఆర్డీఓ బాపిరెడ్డిని వివరణ కోరగా తహసీల్దార్లందరూ సమ్మెలో ఉండటంతో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించలేకపోతున్నామని, సమ్మె విరమించిన వెంటనే ఇసుక అక్రమ రవాణాకు చెక్పెడతామన్నారు. తీగలేరు నుంచి... పెద్దారవీడు మండలంలోని తోకపల్లె, రామాయపాలెం, ప్రగళ్లపాడు గ్రామాల సమీపంలో ఉన్న తీగలేరు కాలువ నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఎక్కువగా రాత్రిపూట జేసీబీలతో తవ్వి తీసుకెళ్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుక రూ. 2 వేల చొప్పున అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాల్లోని గ్రామాలకు ట్రాక్టర్ల యజమానులు ఇసుక తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ధర మారుతుంటుంది. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. భారీ స్థాయిలో ఇసుక తవ్వేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గతంలో తీగలేరు కాలువలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతుంటే రెవెన్యూ అధికారులు ఇద్దరు గ్రామ నౌకరులను ఏర్పాటు చేశారు. పగటిపూట ఒకరు, రాత్రిపూట మరొకరిని తహసీల్దార్ కాపలాగా నియమించారు. ఈ మధ్యకాలంలో కాపలా లేకపోవడంతో అక్రమార్కులకు అడ్డులేకుండా పోయింది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.