పోలీసులా.. తాబేదార్లా?: దాసోజు శ్రవణ్
ఇసుక వ్యాపారంపై కేటీఆర్ అబద్ధాలు
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలో పోలీసులు ప్రభుత్వానికి తాబేదార్లుగా మారారని, మంత్రి కేటీఆర్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై చేసిన విమర్శలను ఖండిస్తున్నామని పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ఇసుక పేరుతో కాంగ్రెస్ ఏనాడూ వ్యాపారం చేయలేదని, టీఆర్‌ఎస్ పార్టీ ఇసుక మాఫియాగా మారిందని ధ్వజమెత్తారు. ట్రక్కుకు రూ.8,250 ప్రభుత్వానికి చెల్లిస్తూ, మార్కెట్‌లో రూ.80 వేలకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన అద్దంకి దయాకర్, కేకే మహేందర్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు.
ఇసుక వ్యాపారంతో తమకు సంబంధం లేదని మంత్రి కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. సిరిసిల్ల దళితులపై దాడుల విషయంలో కేటీఆర్ మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. హిమాన్షు మోటార్స్‌పై కేటీఆర్ చెప్పినవి పచ్చి అబద్ధాలని, దానితో తనకు సంబంధం లేదని చెబుతున్న కేటీఆర్, మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్‌లో చూపింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. టెండర్లు లేకుండా వెంకయ్య నాయుడు కుమారుడి కంపెనీ నుంచి ఇన్నోవాలను కొన్నది నిజం కాదా అని నిలదీశారు. అలాగే స్వర్ణ భారతి ట్రస్ట్‌కు రాయితీలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. వీటన్నిటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, లేదంటే గన్ పార్క్ దగ్గర బహిరంగ చర్చకు రావాలని సవాలుచేశారు. సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ టీఆర్‌ఎస్ తొత్తుగా మారారని అద్దంకి దయాకర్ ఆరోపించారు.