Dasoju Shravan
-
ఎమ్మెల్సీల తిరస్కరణ పిటిషన్.. జనవరి 24కు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించిన విషయంలో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీల తిరస్కరణపై దాశోజు శ్రవణ్, సత్య నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. శ్రవణ్, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు.. ఆర్టికల్ 171 ప్రకారం క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేదని హైకోర్టుకు తెలియజేశారు. అయితే ఆర్టికల్ 361 ప్రకారం పిటిషనర్ల పిటిషన్‌కు అర్హత లేదని గవర్నర్ తరుపు కౌన్సిల్ కోర్టుకు తెలిపారు. పిటిషన్ మెంటేనబిలిటీపై విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. కాగా.. తదుపరి విచారణ జనవరి 24కు హైకోర్టు వాయిదా వేసింది. చదవండి: మాది చేతల ప్రభుత్వం: మంత్రి దామోదర రాజనర్సింహ -
ఆ ఎమ్మెల్సీలకు నో!.. ఇద్దరిని తిరస్కరించిన తమిళిసై
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. రాజ్యాంగంలోని 171(3), 171(5) అధికరణాల్లో నిర్దేశించిన మేరకు సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రం, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యతగానీ, ఆచరణాత్మక అనుభవంగానీ వీరికి లేదని.. అందువల్ల వారి అభ్యర్దిత్వాలను తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. దాసోజు శ్రవణ్ రాజకీయాలు, వ్యాపారం, విద్యా రంగాల్లో.. కుర్ర సత్యనారాయణ రాజకీయాలు, పారిశ్రామిక కార్మిక సంఘం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నట్టు ప్రతిపాదనల సారాంశం వెల్లడిస్తోందని గవర్నర్ వివరించారు. దీనిపై ఈ నెల 19న సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి గవర్నర్ తమిళిసై రాసిన లేఖలు సోమవారం బయటికి వచ్చాయి. రాజ్యాంగబద్ధంగానే తిరస్కరణ రాజ్యాంగంలోని 171(1ఈ), 171(5) అధికరణాల ద్వారా చట్టసభలకు సభ్యులను నామినేట్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని.. దానిని అనుసరించే తాను నిర్ణయం తీసుకున్నట్టు గవర్నర్ తమిళిసై తన లేఖల్లో స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 10లో పొందుపరిచిన షెడ్యూల్–3ను అనుసరించి శాసనమండలిలో సీట్ల కేటాయింపు జరపాల్సి ఉంటుందని వివరించారు. ఆ చట్టంలోని షెడ్యూల్–3కు ఏపీ పునర్విభజన చట్టం–2014లోని సెక్షన్ 17 ద్వారా సవరణ జరిపి తెలంగాణ రాష్ట్రానికి 40 ఎమ్మెల్సీ సీట్లను కేటాయించారని, అందులో గవర్నర్ కోటా కింద నామినేట్ చేసే 6 సీట్లు కూడా ఉన్నాయని తెలిపారు. ఎన్నిక కాబోయే అభ్యర్థి ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కును లేదా రాష్ట్రంలో స్థిర నివాసాన్ని కలిగి ఉండాలని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 3, 6(2) సెక్షన్లు స్పష్టం చేస్తున్నాయన్నారు. సభ్యుల అనర్హతలపై సెక్షన్ 8 నుంచి 11 (ఏ) వరకు పొందుపరిచిన నిబంధనలు శాసనమండలికి నామినేట్ అయ్యే సభ్యులకు కూడా వర్తిస్తాయని వివరించారు. కేబినెట్ నోట్ ఫైల్ పంపలేదు ఇద్దరు ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనలతో ఇతర వివరాలు, ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జత చేయలేదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. మంత్రివర్గం, సీఎం సంబంధిత రికార్డులన్నింటినీ పరిశీలించినట్టు ధ్రువీకరించే కేబినెట్ నోట్ ఫైల్‌ను పంపలేదని.. ఎమ్మెల్సీలుగా వీరి అభ్యర్థిత్వాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం అనుసరించిన పద్ధతిని కూడా తెలియజేయలేదని తప్పుపట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 8 నుంచి 11(ఏ) వరకు పేర్కొన్న అనర్హతలు వీరికి వర్తించవని ధ్రువీకరిస్తూ నిఘా విభాగం, ఇతర సంస్థల నుంచి ఎలాంటి నివేదికలూ అందలేదన్నారు. సిఫార్సుల కోసం పంపే ఫైలు సంబంధిత అన్ని రికార్డులతో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇన్ని లోపాలకు తోడు అర్హతలను ధ్రువీకరించే ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడం సముచితం కాదని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి తిప్పిపంపుతున్నట్టు ప్రకటించారు. ఇకపై రాజకీయ నేతలను సిఫార్సు చేయొద్దు రాజ్యాంగంలోని సెక్షన్ 171 (5)లో ప్రస్తావించిన రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యత, అనుభవం కలిగి, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని చాలా మంది రాష్ట్రంలో ఉన్నారని, వారిని ఎమ్మెల్సీలుగా నియమించవచ్చని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. వారికి కేటాయించిన పదవుల్లో రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులను నియమిస్తే.. ఆయా రంగాల్లోని వారు చేసిన కృషిని, సాధించిన నిపుణతను విస్మరించినట్టు అవుతుందని స్పష్టం చేశారు. అంతేగాకుండా రాజ్యాంగంలోని సెక్షన్ 171 (5) కింద వారికి కల్పించిన ప్రయోజనాలు సైతం నీరుగారిపోతాయన్నారు. అర్హుల అవకాశాలను లాక్కున్నట్టు అవుతుందని, ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇకపై సెక్షన్ 171(5) కింద నామినేట్ చేసే పదవుల కోసం రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవద్దని సీఎంకు, మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేశారు. నెలన్నరకుపైగా పెండింగ్ తర్వాత సుమారు రెండేళ్ల క్రితం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డిని మంత్రిమండలి నామినేట్ చేయగా.. కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆ స్థానంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారు. తాజాగా ఎస్టీల్లోని ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బీసీ సామాజికవర్గానికి చెందిన దాసోజు శ్రవణ్‌కుమార్‌లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని జూలై 31న మంత్రివర్గం తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్‌కు ప్రతిపాదనలను పంపింది. అప్పటి నుంచి దాదాపు నెలన్నరకుపైగా ఆ సిఫార్సులు రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ గవర్నర్ లేఖ రాశారు. కొత్త వారికి అవకాశం ఇస్తారా? మరికొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే అంచనాల నేపథ్యంలో.. ఎమ్మెల్సీలను నామినేట్ చేయాలన్న ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా కొత్తవారిని నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం మరో తీర్మానం చేసి పంపిస్తుందా? వీరినే నియమించాలని మళ్లీ కోరుతుందా? అసలు ఈ అంశంపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న కొందరు బీఆర్ఎస్ నేతల్లో మళ్లీ ఆశలు చిగురించడం గమనార్హం. మరోవైపు ఈ పరిణామంతో గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కినట్టేనని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
రాజ్‌భవన్ అడ్డాగా పాలిటిక్స్.. తమిళిసైపై మంత్రి వేముల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కోటాలో పంపిన(దాసోజు శ్రవణ్, సత్యనారాయణ) సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. ఈ క్రమంలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించలేనని, అర్హుల పేర్లను ప్రతిపాదించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో, గవర్నర్‌పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టే.. తాజాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రి ప్రశాంత్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత తమిళిసై సౌందరరాజన్‌కి లేదు. ఆమె రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని పాలిటిక్స్ చేస్తున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపి పంపితే వారికి రాజకీయా నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం అత్యంత దుర్మార్గం. అత్యంత వెనుక బడిన కులాలకు(ఎంబీసీ)చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్, షెడ్యుల్ తెగకు (ఎస్టీ) చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణ లను రిజెక్ట్ చేయడం యావత్ తెలంగాణ సమాజాన్ని అగౌరపర్చినట్టే. అప్రజాస్వామిక నిర్ణయం.. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమించబడబడలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్‌కు నైతిక విలువలు ఉంటే ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలి. సర్కారియ కమిషన్ చెప్పినట్టు రాజకీయాలకు సంబంధంలేని వారిని గవర్నర్లుగా నియమించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. సర్కారియ కమిషన్ సూచనలు తుంగలో తొక్కి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిని గవర్నర్‌గా నియమించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు -
కేసీఆర్ సర్కార్‌కు షాక్.. గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ ప్రభుత్వం మధ్య వ్యవహారం నువ్వా-నేనా అన్నట్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ తమిళిసై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్ తమిళిసై.. కేసీఆర్ సర్కార్‌కు మళ్లీ షాకిచ్చారు. రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన సిఫార్సులను తమిళిసై తిరస్కరించారు. ఇక, అంతకుముందు కూడా గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ప్రభుత్వ సిఫార్సులను కొద్దిరోజులు హోల్డ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కళలు, సాహిత్యం, సైన్స్ రంగంలో వీరిద్దరూ పెద్దగా కృషి చేయలేదు. గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అర్హతలు వీళ్లకు లేవు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదు అని అన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఇటీవలే బీజేపీలో చేరారు. అనంతరం, కొన్ని పరిణామాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్ అయ్యా.. సోనియా సమక్షంలో చేరుతున్నా: మైనంపల్లి -
ఫోన్ చేసి బెదిరింపులు.. దూషణలు
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): తనకు కొద్దిరోజులుగా కొందరు ఫోన్ చేస్తూ బెదిరిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని సైతం ఫోన్లో దుర్భాషలాడుతున్నారని తెలిపారు. వారంతా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచరులని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ స్నేహమెహ్రాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ఇచ్చే 24గంటల విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించానన్నారు. ఈ స్పందనపై రేవంత్‌రెడ్డి అనుచరులు, అభిమానులు అర్థరాత్రి వేళ తనకు ఫోన్ చేసి అసభ్యంగా దూషిస్తున్నారని.. కుటుంబ సభ్యుల్ని కూడా దుర్భాషలాడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ తండ్రి వయసున్న కేసీఆర్‌ను పట్టుకొని చార్లెస్ శోభరాజ్ అనవచ్చా?.. ఇష్టమొచ్చినట్లు సీఎంను దూషిస్తుంటే ఏమీ అనొద్దా..? అని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ మరో నయీమ్‌లా మారారని శ్రవణ్ విమర్శించారు. -
పోలీసులా.. తాబేదార్లా?: దాసోజు శ్రవణ్
ఇసుక వ్యాపారంపై కేటీఆర్ అబద్ధాలు సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలో పోలీసులు ప్రభుత్వానికి తాబేదార్లుగా మారారని, మంత్రి కేటీఆర్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై చేసిన విమర్శలను ఖండిస్తున్నామని పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ఇసుక పేరుతో కాంగ్రెస్ ఏనాడూ వ్యాపారం చేయలేదని, టీఆర్ఎస్ పార్టీ ఇసుక మాఫియాగా మారిందని ధ్వజమెత్తారు. ట్రక్కుకు రూ.8,250 ప్రభుత్వానికి చెల్లిస్తూ, మార్కెట్లో రూ.80 వేలకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన అద్దంకి దయాకర్, కేకే మహేందర్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఇసుక వ్యాపారంతో తమకు సంబంధం లేదని మంత్రి కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. సిరిసిల్ల దళితులపై దాడుల విషయంలో కేటీఆర్ మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. హిమాన్షు మోటార్స్‌పై కేటీఆర్ చెప్పినవి పచ్చి అబద్ధాలని, దానితో తనకు సంబంధం లేదని చెబుతున్న కేటీఆర్, మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లో చూపింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. టెండర్లు లేకుండా వెంకయ్య నాయుడు కుమారుడి కంపెనీ నుంచి ఇన్నోవాలను కొన్నది నిజం కాదా అని నిలదీశారు. అలాగే స్వర్ణ భారతి ట్రస్ట్‌కు రాయితీలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. వీటన్నిటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, లేదంటే గన్ పార్క్ దగ్గర బహిరంగ చర్చకు రావాలని సవాలుచేశారు. సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ టీఆర్ఎస్ తొత్తుగా మారారని అద్దంకి దయాకర్ ఆరోపించారు.