సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. రాజ్యాంగంలోని 171(3), 171(5) అధికరణాల్లో నిర్దేశించిన మేరకు సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రం, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యతగానీ, ఆచరణాత్మక అనుభవంగానీ వీరికి లేదని.. అందువల్ల వారి అభ్యర్దిత్వాలను తిరస్కరిస్తున్నామని ప్రకటించారు.
దాసోజు శ్రవణ్ రాజకీయాలు, వ్యాపారం, విద్యా రంగాల్లో.. కుర్ర సత్యనారాయణ రాజకీయాలు, పారిశ్రామిక కార్మిక సంఘం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నట్టు ప్రతిపాదనల సారాంశం వెల్లడిస్తోందని గవర్నర్ వివరించారు. దీనిపై ఈ నెల 19న సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి గవర్నర్ తమిళిసై రాసిన లేఖలు సోమవారం బయటికి వచ్చాయి.
రాజ్యాంగబద్ధంగానే తిరస్కరణ
రాజ్యాంగంలోని 171(1ఈ), 171(5) అధికరణాల ద్వారా చట్టసభలకు సభ్యులను నామినేట్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని.. దానిని అనుసరించే తాను నిర్ణయం తీసుకున్నట్టు గవర్నర్ తమిళిసై తన లేఖల్లో స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 10లో పొందుపరిచిన షెడ్యూల్–3ను అనుసరించి శాసనమండలిలో సీట్ల కేటాయింపు జరపాల్సి ఉంటుందని వివరించారు.
ఆ చట్టంలోని షెడ్యూల్–3కు ఏపీ పునర్విభజన చట్టం–2014లోని సెక్షన్ 17 ద్వారా సవరణ జరిపి తెలంగాణ రాష్ట్రానికి 40 ఎమ్మెల్సీ సీట్లను కేటాయించారని, అందులో గవర్నర్ కోటా కింద నామినేట్ చేసే 6 సీట్లు కూడా ఉన్నాయని తెలిపారు. ఎన్నిక కాబోయే అభ్యర్థి ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కును లేదా రాష్ట్రంలో స్థిర నివాసాన్ని కలిగి ఉండాలని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 3, 6(2) సెక్షన్లు స్పష్టం చేస్తున్నాయన్నారు. సభ్యుల అనర్హతలపై సెక్షన్ 8 నుంచి 11 (ఏ) వరకు పొందుపరిచిన నిబంధనలు శాసనమండలికి నామినేట్ అయ్యే సభ్యులకు కూడా వర్తిస్తాయని వివరించారు.
కేబినెట్ నోట్ ఫైల్ పంపలేదు
ఇద్దరు ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనలతో ఇతర వివరాలు, ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జత చేయలేదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. మంత్రివర్గం, సీఎం సంబంధిత రికార్డులన్నింటినీ పరిశీలించినట్టు ధ్రువీకరించే కేబినెట్ నోట్ ఫైల్‌ను పంపలేదని.. ఎమ్మెల్సీలుగా వీరి అభ్యర్థిత్వాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం అనుసరించిన పద్ధతిని కూడా తెలియజేయలేదని తప్పుపట్టారు.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 8 నుంచి 11(ఏ) వరకు పేర్కొన్న అనర్హతలు వీరికి వర్తించవని ధ్రువీకరిస్తూ నిఘా విభాగం, ఇతర సంస్థల నుంచి ఎలాంటి నివేదికలూ అందలేదన్నారు. సిఫార్సుల కోసం పంపే ఫైలు సంబంధిత అన్ని రికార్డులతో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఇన్ని లోపాలకు తోడు అర్హతలను ధ్రువీకరించే ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడం సముచితం కాదని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి తిప్పిపంపుతున్నట్టు ప్రకటించారు.
ఇకపై రాజకీయ నేతలను సిఫార్సు చేయొద్దు
రాజ్యాంగంలోని సెక్షన్ 171 (5)లో ప్రస్తావించిన రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యత, అనుభవం కలిగి, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని చాలా మంది రాష్ట్రంలో ఉన్నారని, వారిని ఎమ్మెల్సీలుగా నియమించవచ్చని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. వారికి కేటాయించిన పదవుల్లో రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులను నియమిస్తే.. ఆయా రంగాల్లోని వారు చేసిన కృషిని, సాధించిన నిపుణతను విస్మరించినట్టు అవుతుందని స్పష్టం చేశారు.
అంతేగాకుండా రాజ్యాంగంలోని సెక్షన్ 171 (5) కింద వారికి కల్పించిన ప్రయోజనాలు సైతం నీరుగారిపోతాయన్నారు. అర్హుల అవకాశాలను లాక్కున్నట్టు అవుతుందని, ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇకపై సెక్షన్ 171(5) కింద నామినేట్ చేసే పదవుల కోసం రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవద్దని సీఎంకు, మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేశారు.
నెలన్నరకుపైగా పెండింగ్ తర్వాత
సుమారు రెండేళ్ల క్రితం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డిని మంత్రిమండలి నామినేట్ చేయగా.. కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆ స్థానంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారు.
తాజాగా ఎస్టీల్లోని ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బీసీ సామాజికవర్గానికి చెందిన దాసోజు శ్రవణ్‌కుమార్‌లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని జూలై 31న మంత్రివర్గం తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్‌కు ప్రతిపాదనలను పంపింది. అప్పటి నుంచి దాదాపు నెలన్నరకుపైగా ఆ సిఫార్సులు రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ గవర్నర్ లేఖ రాశారు.
కొత్త వారికి అవకాశం ఇస్తారా?
మరికొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే అంచనాల నేపథ్యంలో.. ఎమ్మెల్సీలను నామినేట్ చేయాలన్న ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా కొత్తవారిని నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం మరో తీర్మానం చేసి పంపిస్తుందా? వీరినే నియమించాలని మళ్లీ కోరుతుందా? అసలు ఈ అంశంపై బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న కొందరు బీఆర్‌ఎస్ నేతల్లో మళ్లీ ఆశలు చిగురించడం గమనార్హం. మరోవైపు ఈ పరిణామంతో గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కినట్టేనని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఆ ఎమ్మెల్సీలకు నో!.. ఇద్దరిని తిరస్కరించిన తమిళిసై
Published Tue, Sep 26 2023 1:18 AM | Last Updated on Tue, Sep 26 2023 4:51 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment