గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన విధుల నిర్వహణ, అనుభవాలపై రాసిన పుస్తకాన్ని రాజ్‌భవన్‌లో విడుదల చేస్తున్న తమిళిసై
ఆ గీత దాట లేదు..
సీఎంతో ఆప్యాయతలు లేవు.. విభేదాలూ లేవు. గవర్నర్, సీఎం మధ్య సంబంధాల్లో ఉండాల్సిన గీత ఇది. రాజకీయాలు వేరు.. రాజ్యాంగబద్ధ పదవి వేరు. ఈ రెండింటి మధ్య గీతను నేనే స్పష్టంగా గీసుకున్నా. దాన్ని ఎన్నడూ దాటలేదు.
సోదరిలా కలిసిపోయా..
గవర్నర్‌లా కాకుండా తెలంగాణ సోదరిగా ఇక్కడి సంస్కృతి అయిన కట్టు బొట్టును అనుసరిస్తూ ఇక్కడి ప్రజల్లో కలిసిపోయా. రాష్ట్ర ప్రజలు అపార ప్రేమ, ఆప్యాయతలను చూపారు. ఈ రాష్ట్ర గవర్నర్‌గా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా.
క్లిష్టమైన పని..
టీఆర్‌ఎస్.. ప్రాంతీయ పార్టీ. గవర్నర్ కాకముందు నేను వేరే పార్టీలో ఉన్నా. వేరే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రానికి గవర్నర్‌గా వ్యవహరించడం క్లిష్టమైన పని. ఈ విషయంలో సమన్వయంతో వ్యవహరిస్తున్నా.
సామాన్య ప్రజలను పక్షం రోజులకో, నెల రోజులకో ఒకసారి కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడానికి ప్రజాదర్బార్ నిర్వహించాలని గతంలో నిర్ణయించాం. వెబ్ పోర్టల్‌కు సైతం రూపకల్పన చేశాం. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ఇది మొదలుకాలేదు. సాధారణ పరిస్థితులు ఏర్పడితే ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తా. గతంలో చెప్పినట్టు గిరిజన గ్రామాలను సైతం సందర్శిస్తా.
– తమిళిసై
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించినా తాను ఇంకా ఆమోదించలేదని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సత్సంబంధాలే ఉన్నాయని, వివాదాలు, విభేదాలు లేవని స్పష్టం చేశారు.
గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఇప్పటివరకు ఆమె పాల్గొన్న కార్యక్రమాల ఫొటోలు, వివరాలతో ‘వన్ ఎమాంగ్ అండ్ ఎమాంగెస్ట్ ద పీపుల్’ పేరిట రూపొందించిన చిత్రమాలికను బుధవారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సీనియర్ జర్నలిస్టులు గవర్నర్ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా తమిళిసై మీడియాతో మాట్లాడారు.
స్నేహపూర్వకంగా సూచనలు..
‘డెంగ్యూ జ్వరాలు, వరదలు, కోవిడ్ మహమ్మారి వంటి సమయాల్లో ప్రభుత్వ ప్రయత్నాలను అభినందిస్తూనే నా ఆందోళనలను తెలియజేశా. కోవిడ్ సమయంలో కేవలం ఒకే ఆస్పత్రి (గాంధీ ఆస్పత్రి)లో కరోనా చికిత్స ఇస్తుంటే జిల్లా ఆస్పత్రుల్లో సైతం చికిత్స అందించాలని ఓ వైద్యురాలిగా సూచించా.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచాలని ప్రభుత్వాన్ని, సీఎంను పలుమార్లు కోరా. కొంతమేరకు ఆస్పత్రుల పరిస్థితులు మెరుగు అవుతున్నాయి. గవర్నర్‌లా కాకుండా తెలంగాణ సోదరిలా స్నేహపూర్వకంగా నా సూచనలు తెలియజేశా. విమర్శకు పోలేదు..’ అని పేర్కొన్నారు.
సీఎం సానుకూల స్పందన
‘నేను ముఖ్యమంత్రికి ఏం చెప్పాలనుకున్నానో స్పష్టంగా తెలియజేశా. ప్రజల మేలుకు నేను చేసిన సూచనల్లో చాలా వాటికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నేను పలుమార్లు కోరితే, తొలుత విభేధించిన సీఎం చివరకు అంగీకరించారు. ప్రతి విషయంలో సానుకూలంగా ముందుకు పోయా. ప్రభుత్వం సైతం అలాగే స్పందించింది.
మా మధ్య సత్సంబంధాలున్నాయి. తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సమ న్యాయం చేసినట్టు భావిస్తున్నా. గతంలో మద్రాస్ రాష్ట్రంగా తమిళనాడు, తెలుగు ప్రజలు కలిసి ఉన్నాం. అందుకే ఇక్కడి ప్రజలు సొంత ప్రజలుగా అనిపిస్తారు. రాష్ట్ర గవర్నర్‌గా నా విజయాలను ఇటీవల మరణించిన నా మాతృమూర్తికి అంకితం చేస్తున్నా.’ అని గవర్నర్ తెలిపారు.
గతంలో మూడు పేర్లు వెంటనే ఆమోదించా
‘కౌశిక్ రెడ్డిని సామాజిక సేవ కేటగిరీ కింద ఎమ్మెల్సీ పదవిలో నామినేట్ చేయాల్సి ఉంది. దీనిపైనే అధ్యయనం చేస్తున్నా. ఆయన బయోడేటా క్లియర్‌గా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వంతో ఎలాంటి అభిప్రాయ భేదాలు, అభ్యంతరాలు లేవు. అయితే ఆయన చేసిన కార్యక్రమాలు సామాజిక సేవ కేటగిరీలో ఫిట్ అవుతాయా? అని పరిశీలించి చూడాల్సి ఉంది. అందువల్ల నాకు మరికొంత సమయం కావాలి. గతంలో మరో ముగ్గురి పేర్లను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే తక్షణమే ఆమోదించా. వారికి సంబంధించిన ప్రతిపాదనల్లో స్పష్టత ఉండడంతో వెంటనే నిర్ణయం తీసుకున్నా..’ అని గవర్నర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment