
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలంటూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై బీఆర్‌ఎస్ తీవ్రంగా మండిపడింది. రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలకు రాజకీయ నేపథ్యం ఉందంటూ తిరస్కరించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించింది. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఇతర నేతలు గవర్నర్ చర్యను ఖండించారు.
మీరు తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారు?: హరీశ్‌రావు
వెనుకబడిన వర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని, వారిని ఎమ్మెల్సీలుగా నియమించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే బీఆర్‌ఎస్ సభ్యులంటూ గవర్నర్ తిరస్కరించడం దారుణమని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సర్కారియా కమిషన్ సూచనల మేరకు గవర్నర్‌గా పనిచేసేందుకు తమిళిసై అనర్హులని పేర్కొ న్నారు.
బీజేపీకి చెందిన గులాం అలీ ఖతానా, మహేశ్ జెఠ్మలానీ, సోనాల్ మాన్‌సింగ్, రాంషకల్, రాకేశ్ సిన్హా తదితరులను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఎలా నియమించారని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో జితిన్ ప్రసాద్, గోపాల్ అర్జున్ బూర్జీ, చౌదరీ వీరేంద్ర సింగ్, రజనీకాంత్ మహేశ్వరీ, సాకేత్ మిశ్రా, హన్స్‌రాజ్ విశ్వకర్మ తదితర బీజేపీ నేతలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆపారని, ఇప్పుడేమో ఎమ్మెల్సీ అభ్యర్దిత్వాలను తిరస్కరించారని.. తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
వెనుకబడిన వర్గాలను అవమానించడమే: ప్రశాంత్‌రెడ్డి
అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ)కు చెందిన దాసోజు శ్రవణ్, షెడ్యుల్డ్ తెగకు (ఎస్టీ) చెందిన కుర్రా సత్యనారాయణ అభ్యర్దిత్వాలను గవర్నర్ తిరస్కరించడం ఆయా వర్గాలను అవమానించడమేనని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. రాజ్‌భవన్‌ను అడ్డాగా చేసుకొని గవర్నర్ రాజకీయా లు చేస్తున్నారని, ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హతను తమిళిసై కోల్పోయారని వ్యాఖ్యానించారు.
ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు: ఇంద్రకరణ్‌రెడ్డి
గవర్నర్ తమిళిసై చర్య సమాఖ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు వంటిదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. గవర్నర్ తీరు రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు.
కిషన్‌రెడ్డి కుట్ర వల్లే తిరస్కరణ: శ్రీనివాస్‌గౌడ్
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన కుట్ర వల్లే గవర్నర్ ఎమ్మెల్సీల ఫైల్‌ను తిరస్కరించారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఇది బలహీన వర్గాలకు చెందిన వారిని అణచివేసే కుట్ర అని మండిపడ్డారు.
ఇది కక్ష సాధింపు కోసమే..
గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాజీవ్ సాగర్ వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో చర్చించి, ఆమోదించి పంపిన సిఫార్సు లను గవర్నర్ ఆమోదించకపోవటం సరికాదని, దీనికి రాజకీయ దురుద్దేశమే కారణమని విమర్శించారు.