కాంగ్రెస్ నుంచి వెలిచాల, రోహిత్‌రావు, సబ్బని
బీజేపీ నుంచి రాణిరుద్రమ, పొల్సాని
స్వతంత్రుడిగా అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి
జోరుగా నేతల రహస్య సర్వేలు, మొదలైన మంతనాలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులతోపాటు స్వతంత్రులు రంగంలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే బరిలో నిలవనున్న అభ్యర్థులు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారు.
సెప్టెంబరులో పట్టభద్రుల ఎన్‌రోల్‌మెంట్ ప్రారంభంకానుంది. 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎవరినీ బరిలోకి దించలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జీవన్‌రెడ్డి గెలుపొందారు. తాజాగా ఇటీవల కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎనిమిది స్థా నాలు గెలుచుకోవడంతో ఎలాగైనా కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని మరోసారి కై వసం చేసుకోవాలని వ్యూహరచనలో మునిగింది.
కాంగ్రెస్ నుంచి ముగ్గురి పేర్లు
⇒ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమిపాలైన వెలిచాల రాజేందర్‌రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దివంగత ఎమ్మెస్సార్ మనవడు మేన్నేని రోహిత్‌రావు, హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన సబ్బని వెంకట్‌లు ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
⇒ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన వెలిచాల రాజేందర్‌రావు తనకు 15 రోజులు ముందు టికెట్ కేటాయించడంతో ఆ సమయంలో ఓటర్లందరినీ కలుసుకోలేకపోయానని తనకు ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నట్లు సమాచారం. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో తన తండ్రి వెలిచాల జగపతిరావుకు సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేశారని.. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని తనకు టికెట్ కేటాయిస్తే విజయం ఖాయమని అధిష్టానం వద్ద విన్నవించుకున్నట్లు వినికిడి.
⇒ దివంగత సీనియర్ నేత ఎమ్మెస్సార్ మనవడు రోహిత్‌రావు తనకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని, తాత చేసిన సేవలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన పేరును పరిశీలించాలని కోరుతున్నట్లు సమాచారం.
⇒ హుజూరాబాద్‌కు చెందిన సబ్బని వెంకట్ ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో హుజూరాబాద్ టికెట్ తనకు కాకుండా వొడితెల ప్రణవ్‌కు కేటాయిస్తే చిత్తశుద్ధితో పనిచేశానని తన పేరును ఎమ్మెల్సీ టికెట్ కోసం పరిశీలించాలని అధిష్టానం వద్ద ఇప్పటికే విన్నవించుకోవడం తెలిసిందే.
బీజేపీ నుంచి వీరే..
భారతీయ జనతా పార్టీ నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీచేసి ఓటమిపాలైన జి.రాణిరుద్రమదేవితోపాటు ఆ పార్టీ సీనియర్‌నేత, న్యాయవాది పొల్సాని సుగుణాకర్‌రావు పార్టీ అభ్యర్థిత్వం కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విస్తృతమైన సంబంధాలతోపాటు పాత, కొత్త కలయికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే పథకాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం చేకూరుస్తాయని సుగుణాకర్‌రావు అధిష్టానం వద్ద గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. రాణిరుద్రమదేవి తనదైన శైలిలో టికెట్ కోసం ప్రయత్నాలతోపాటు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
బరిలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవసరమైతే ప్రధాన పార్టీల అభ్యర్థిత్వం, లేనట్లయితే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో నిలిచేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియతోపాటు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నాలుగు జిల్లాల పరిధిలో అల్ఫోర్స్ విద్యాసంస్థలు విస్తరించి ఉండడంతోపాటు వేలాది మంది విద్యార్థులను, పట్టభద్రులతో ఉన్న సంబంధాలు తన విజయానికి సోపానంగా ఉంటాయని ఆలోచిస్తున్నారు. 2019లోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించినా రాకపోవడంతో విరమించుకున్నారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టాలనే నరేందర్‌రెడ్డి అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
బీఆర్‌ఎస్‌లో భారీ పోటీ
మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, బీఎన్ రావు, యాదగిరి శేఖర్‌రావు తదితరులు మరోసారి గులాబీ సత్తా చాటేందుకు వ్యూహరచనలో మునిగితేలుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పోటీ చేసేందుకు ముందుకొస్తున్న ఆశావహులు ఎవరికి వారు సర్వేలు చేయించుకుంటూ అనుచరగణంతో మంతనాలు సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment