మహిళ కంట్లో ‘ఇసుక’
వ్యాపారంలో మహిళా సంఘాలు అప్పులపాలయ్యూరుు. అధికార పార్టీ పెద్దలు రూ.కోట్లు వెనకేసుకుంటే నిబంధనలకు లోబడ్డ ఈ సంఘాలకు రుణభారమే మిగిలింది. రోజుకో విధానం మార్చుతూ సర్కారు గందరగోళం చేసింది. ర్యాంపుల నిర్వహణ కింద వెచ్చించిన మొత్తాలను చెల్లించాలంటూ మూడు మహిళా సంఘాలు కోర్టుకెక్కాయి. బకాయిలు చెల్లించడానికి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
* ఇసుక వ్యాపారంలో మహిళాసంఘాలు అప్పులపాలు
* కోర్టును ఆశ్రయించిన కొన్ని సంఘాలు
* ఇసుక కోసం డీడీలు తీసిన వారిది అదే పరిస్థితి
శ్రీకాకుళం టౌన్: వంశధార.. నాగావళి నదుల్లో 34చోట్ల ఇసుక తవ్వకాలను ప్రభుత్వం మహిళాసంఘాలకు అప్పగించింది. ఏడాదిపాటు వాటితోనే అమ్మకాలు సాగించాలని సంఘాలతో పెట్టుబడులు పెట్టించింది. ర్యాంపుల వరకు రోడ్లు వేయించింది. తర్వాత యంత్రాలను సహితం అద్దెకు తెచ్చుకోమని చెప్పింది. ఒక్కోప్రాంతంలో ఒక్కో సంఘం ఈ బాధ్యతలను తీసుకుంది. తీరా బ్యాంకుల్లో ఉన్న సొమ్మున పెట్టుబడి పెట్టాక కొన్ని చోట్ల ర్యాంపులు ప్రారంభం కాలేదు. మరికొన్ని చోట్ల వ్యాపారమే జరగలేదు. దీనికితోడ 17 ర్యాంపుల్లో వ్యాపారం మొదలయ్యూక అధికార పార్టీ నేతల పెత్తనం ఆరంభమైంది. తాజాగా అసలు ర్యాంపులను మహిళా సంఘాల నుంచి తప్పించింది. మైనింగ్ అధికారులకు అప్పగించింది. దీంతో మహిళా సంఘాలు విస్తుపోయాయి.
టీడీపీ ప్రభుత్వం ఇసుకపై సరైన విధానం అమలు చేయకపోవడంతో మహిళా సంఘాలు అవస్థలు పడ్డారుు. తొలుత మొదట మహిళా సంఘాలకు తవ్వకాలను కట్టబెట్టారు. వారి నుంచి ఇసుక పొందాంటే మీసేవా కేంద్రాల్లో డీడీలు చెల్లించి తర్వాత ర్యాంపుల వద్ద వాటిని అందజేస్తే తప్ప ఇసుక సరఫరా జరిగేది కాదు. కొన్నాళ్లు నదిలోని ఇసుకను రేవులనుంచి డంపింగ్ యార్డులకు చేరవేసి అమ్మకాలు జరిపేవారు. అలా అమ్మకానికి ఉంచిన రూ.36లక్షల విలువైన ఇసుక ఇప్పటికీ పలాస వద్ద కుప్పలుగా పడిఉంది.
ఇసుక ఉచితమనేసరికి కొనేవారు లేక కుప్పలు తెప్పలుగా వదిలేశారు. ఆ ఇసుక కోసం మహిళా సంఘాలు రూ.36లక్షలు ఖర్చు చేశాయి. దీనికి తోడు కొన్ని చోట్ల ర్యాంపుల నిర్వహణకు పెట్టుబడులు పెట్టారు. ఇసుక తవ్వకుండా వాటిని నిలుపుదల చేశారు. జిల్లాలో 34 ర్యాంపులకు గతంలో అనుమతిస్తే నిర్వహణ కింద స్వయంశక్తి సంఘాలు సొంత సొమ్ము వెచ్చించాయి. యంత్రాల అద్దెలతో పాటు ర్యాంపుల వరకు వేసిన రోడ్లు, ఇతర అవసరాలకు రూ.లక్షల్లోనే ఖర్చుచేశాయి. అయితే పెట్టుబడులు చేతికందకుండానే పాలసీ మారిపోయింది. పోనీ ఇసుక అమ్ముదామంటే జన్మభూమి కమిటీలు పెత్తనం చేస్తున్నాయి. దీంతో ఇసుక నిర్వహణకు ముందుకు వచ్చిన కొన్ని సంఘాలు అప్పులపాలైయ్యాయి. 17 సంఘాలకు సుమారు రూ.60 లక్షలకు పైగా బకాయిలున్నాయి. వీటన్నింటికి అధికారుల దగ్గర సమాధానం కరువవుతోంది.
ఆమదాలవలస నియోజక వర్గానికి చెందిన తోటాడ, అక్కివరం, సింగూరు ర్యాంపుల్లో కూడా మహిళా సంఘాలు చేతులు కాల్చుకున్నాయి. రూ.9లక్షలు ఖర్చు పెట్టాక ఇసుక విధానం మారిపోయింది. దీంతో సంఘాలు నష్టపోయాయి. ఈ నిధులు ఎవరిస్తాంటూ ఆ మూడు గ్రామాలకు చెందిన స్వయంశక్తి సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. మరోపక్క ఇసుక కోసం వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.2.20కోట్లుచెల్లించారు.. డీడీలు చెల్లించి మూడునెలలు గడిచినా ఇంతవరకు చెల్లింపులు జరగక పోవడంతో ఇసుక వ్యాపారులు కాళ్లు అరిగేలా డీఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మహిళాసంఘాలకు పెట్టబడుల మొత్తాలు తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం యోచిస్తోందని డీఆర్‌డీఏ పీడీ తనూజారాణి సాక్షికి చెప్పారు.