తెలంగాణ సర్కార్ భారీ ఆదాయం సమకూర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇసుకను విక్రయించి సొమ్ము చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో ఇసుకను పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు హైదరాబాద్ తరువాత మెదక్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇసుకను పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇసుక కొరతతో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయనే ఉద్దేశంతో ఇసుకను విక్రయించడం ద్వారా ఒకవైపు అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చేస్తూనే మరోవైపు ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
మెదక్‌జోన్: రాష్ట్రంలో ఎక్కడ ఇసుక ఉందో అక్కడి నుంచి కొరత ఉన్నచోటుకు తరలించి విక్రయించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మిడ్‌మానేరు డ్యాం నుంచి ఇసుకను పెద్ద పెద్ద లారీల్లో తరలించి మెదక్‌లో డంప్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరంలో మూడుచోట్ల డంప్ చేస్తుండగా ఆ తరువాత మెదక్ జిల్లా కేంద్రంలోనే డంప్ చేస్తునట్లు సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారి ఒకరు తెలిపారు. 20 నుంచి 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను డంప్ చేశాకే విక్రయాలు మొదలు పెడతారని తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం సర్కార్‌కు అత్యధికంగా ఆదాయం సమకూర్చేది మద్యం అయితే ఆ తరువాత ఇసుకతోనే ఉంటోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మద్యం తయారీ కోసం కొంత మొత్తం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇసుకకు అదేం ఉండదు. నిల్వ ఉన్న చోటు నుంచి తెచ్చి లేనిచోట విక్రయించడమే. కేవలం రవాణా ఖర్చు తప్ప మరే ఇతర ఖర్చు ఉండదు. దీంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రావడం ఖాయమంటున్నారు.
జిల్లాలో ఇసుక తవ్వడం నిషేధం..
జిల్లాలో మంజీరనది, పుష్పలవాగు, పసుపులేరుతోపాటు పలు మండలాల్లోని వాగులు వంకల్లో ఇసుక ఉంది. వరుస కరువు కాటకాలతో ఇప్పటికే భూగర్భ జలాలు 42 మీటర్ల లోతుకి పడిపోయిన నేపథ్యంలో ఇసుకను తరలిస్తే మరింత ప్రమాద స్థాయిలోకి ఊటలు పడిపోతాయని, తాగునీటికి సైతం కష్టాలు తప్పవనే ఉద్దేశంతో జిల్లాలో ఇసుకపై నిషేధం విధించారు. అయినప్పటికీ అక్కడక్కడా అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు.
అక్రమ రవాణాకు చెక్
ఏకంగా ప్రభుత్వమే నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇసుకను విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనిద్వారా అక్రమార్కులు మంజీరనదితో పాటు ఇతర వాగులు, వంకల్లోంచి అక్రమంగా ఇసుకను తరలించకుండా అడ్డుకట్ట వేసినట్లయింది. అక్రమ రవాణకు అడ్డుకట్ట పడకుంటే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సదరు యజమానిపై కేసులు నమోదు చేసేందుకైనా వెనుకాడబోమని పలువురు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఆన్‌లైన్‌లో బుకింగ్
ఇసుక అవసరం ఉన్న వ్యక్తులు ఆన్‌లైన్ ద్వారా (మీసేవలో) టీఎస్‌ఎండీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అవసరమైన ఇసుకను క్యూబిక్ మీటర్లలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డబ్బును మీసేవ నిర్వాహకులకే నేరుగా చెల్లించి రసీదుతో ఇసుక నిల్వకేంద్రానికి వెళ్లి వాహనంలో తరలించుకోవాల్సి ఉంటుంది. ఇసుక నిల్వకేంద్రం నుంచి తరలించేందుకు వాహన రవాణ ఖర్చు సదరు కొనుగోలు దారుడే భరించాల్సి ఉంటుంది. ఇసుకను కొనుగోలు చేసే ప్రాంతంలోనే వేబ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు.
త్వరలో విక్రయాలు ప్రారంభం
మెదక్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో ఇసుక నిల్వకేంద్రం ఏర్పాటు చేశాం. ఇక్కడ 20 నుంచి 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ అయ్యాక విక్రయాలు ప్రారంభిస్తాం. అవసరం ఉన్నవారు మీసేవ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. – రామకృష్ణ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల ప్రాజెక్టు అధికారి
Comments
Please login to add a commentAdd a comment