
మద్యం అమ్మకాలకు సంక్రాంతి కిక్కు
శ్రీకాకుళం క్రైం : పండుగ అంటే ఖుషీ చేయడమే. అందులోని సంక్రాంతి పండుగ మూడో రోజు కనుమ, ఆ తర్వాత వచ్చే ముక్కనుమ గురించి వేరే చెప్పనవసరం లేదు. ఆ రెండు రోజూలూ మందుబాబులదే అసలైన పండుగ. ఇంకేముంది ఎక్సైజ్ శాఖకు, మద్యం వ్యాపారులకు కాసుల కిక్కు ఎక్కింది. గత ఏడాది కంటే రూ.1.38 కోట్ల వరకు మద్యం అమ్మకాలు పెరిగాయి. పండుగ మూడు నాలుగు రోజులే కాకుండా ఈ నెల మొదటి వారం నుంచి 17వ తేదీ వరకు మద్యం దుకాణాలు, బార్‌లు కళకళలాడాయి. జిల్లాలో 230 మద్యం దుకాణాలు, 15 బార్లు ఉన్నాయి. ఒకప్పుడు ఎక్సైజ్ అధికారులు పండగకు అంత స్టాక్ పెట్టాలి.. ఇంత స్టాక్ పెట్టాలంటూ పరిమితులు, టార్గెట్లు పెట్టేవారు. ఈ ఏడాది అటువంటి ఒత్తిళ్లేవీ లేకపోవడంతో మద్యం వ్యాపారులు పండగను దృష్టిలో పెట్టుకుని ముందుగానే మద్యాన్ని దండిగా నిల్వ చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు బాగా పెరిగాయని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు.
రూ.31.31 కోట్ల అమ్మకాలు
ఈ ఏడాది పండగ రోజుల్లో జరిగిన అమ్మకాలు ఎక్సైజ్ అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు చాలా పెరిగాయి. ఈ నెల 1 నుంచి 17వ తేదీ వరకు జరిగిన అమ్మకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గత ఏడాది జనవరి నెల మొదటి 17 రోజుల్లో 75,404 కేసుల లిక్కర్, 43,242 కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. మొత్తం రూ.29.93 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అదే 17 రోజుల్లో 76,388 కేసుల లిక్కర్, 45,645 కేసుల బీరు అమ్మకాలతో మొత్తం రూ.31.31 కోట్ల వ్యాపారం జరిగింది. 984 కేసుల లిక్కర్, 2403 కేసుల బీర్లు.. వెరసి రూ.1.38 కోట్ల అమ్మకాలు పెరిగాయి. ఎక్సైజ్ అధికారులు మాత్రం తాము ఎటువంటి టార్గెట్లు ఇవ్వకపోయినప్పటికీ మద్యం అమ్మకాలు ఈ స్థాయిలో జరగటం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.