శ్రీకాకుళం: సదూర ప్రాంతాల్లో ఉంటున్నవారు రానున్న సంక్రాంతి పండగ సెలవుల్లో సొంత ఊర్లకు రాకపోకలు సాగించేందుకు ప్రయాణ పాట్లు తప్పేలా లేవు. నెల రోజుల క్రితమే జనవరి నెలాఖరు వరకు రైల్వే రిజర్వేషన్లు పూర్తికావడం, రిగ్రిట్‌గా చూపిస్తున్న రైల్వే రిజర్వేషన్‌తో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పండగ సీజన్‌లో అదనపు బోగీలు ఏర్పాటు చేసే దిశగా రైల్వే అధికారులు యోచించడం లేదు. ప్రత్యేక రైళ్లను నడుపుతారా లేదా అన్నది ఇప్పటివరకు ప్రకటనే చేయలేదు. గత ఏడాది వరకు ప్రత్యేక రైళ్లను నడిపితే అదనంగా వసూళ్లు చేస్తుండడాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. ఇటువంటి ట్రైన్లలో ధరలు రోజురోజుకు మారిపోతూ కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలా అని ఆర్టీసీ బస్సుల్లో వెళ్దామంటే వారు సైతం రిజర్వేషన్లు సైట్లను నిలుపుదల చేశారు. ప్రత్యేక బస్సులను నడిపినా 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసే పద్ధతి గతం నుంచి ఆర్టీసీ అమలు చేస్తోంది. సాధారణ రోజుల్లోనే రైల్వే చార్జీల కంటే ఆర్టీసీ చార్జీలు ఎక్కువ కాగా, పండగ రోజుల్లో డిమాండ్‌ను బట్టి రెండు నుంచి మూడు రెట్లు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు మరింత దారుణంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 20 శాతం వరకు రేట్లను పెంచేశాయి. సంక్రాంతి అనంతరం మరో వారం రోజుల పాటు టికెట్ ధరపై రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు అదనంగా వసూలు చేయడం పరిపాటిగా మారింది.
ఏటా ఇదే తరహాలో ప్రయాణికులను రైల్వే, ఆర్టీసీ, ప్రైవేటు యాజమాన్యాలు దోచేస్తున్నాయి. ఈ ఏడాది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు తొలుత 8 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు అని విద్యాశాఖ కేలండర్‌లో పొందుపరిచారు. అయితే జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్న కారణంగా ఈ సెలవులను 12 నుంచి 22వ తేదీ వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది. జన్మభూమి అని కారణం చెప్పకుండా వేరొక సాకు చూపించి ఈ సెలవులను మార్పు చేశారు.
చాలా మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు 8వ తేదీ నుంచి సెలవులని భావించి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఇప్పుడు వీరంతా వీటిని మార్చుకోవాల్సి ఉంది. ఇంకొందరు సెలవులపై స్పష్టత లేకపోవడంతో రిజర్వేషన్ చేయించకుండా ఇప్పటివరకు వేచి చూశారు. ఇప్పుడు స్పష్టత వచ్చినా రిజర్వేషన్లు దొరక్కపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైల్వే, ఆర్టీసీ అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక సర్వీసులను నడపాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment