తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావును అలిపిరి వద్ద అడ్డుకున్నందుకు శాప్స్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అలి పిరి వద్ద పుష్పాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ రాజ్యసభసభ్యుడు వీ.హనుమంతరావు కారును అడ్డుకున్న శాప్స్ నాయకులు ఎన్.రాజారెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, ఎస్వీయూ జేఏసీ నాయకుడు హరికృష్ణయాదవ్‌ను అలిపిరి పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా ఈ నెల 30 వరకు రిమాండ్ విధిస్తూ 4వ అదనపు జూనియర్ జడ్జి శోభారాణి తీర్పు చెప్పారు. దీంతో వారిని సబ్‌జైలుకు తరలించారు.
అలిపిరి స్టేషన్ వద్ద ఆందోళన
శాప్స్ నాయకులను స్టేషన్‌కు తీసుకెళ్లారనే విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్ శివప్రసాద్, జేఏసీ కన్వీనర్ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, శ్రీవెంకటేశ్వర చిల్డ్రన్స్ హైస్కూల్ అధినేత కె.ఎస్.వాసు, ఇతర నాయకులు ఆదివారం ఉదయం 7గంటలకు స్టేషన్ కు వెళ్లి నాయకులను పరామర్శించారు. అరెస్ట్ చేసిన ఉద్యమకారులను పోలీసులు వెంటనే విడుదలచేయాలని నాయకులు ఆందోళన చేశారు. స్టేషన్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
విషయం తెలుసుకున్న డీఎస్పీలు నరసింహారెడ్డి, శంకర్, సీఐలు రాజశేఖర్, నాగభూషణం, గిరిధర్‌రావు, ఎస్‌ఐలు అబ్బన్న, సురేష్‌కుమార్, హరిప్రసాద్ స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు నోటి దురుసుతనంతో మాట్లాడటం తగదన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, వీహెచ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్న ఒక మానసిక రోగిగా అభివర్ణించారు. తెలంగాణకు చెందిన లక్షలాది మంది శ్రీవారి దర్శనానికి వచ్చి వెళుతున్నారని, ఇటివలే తెలంగాణకు చెందిన మంత్రులు సునీతాలక్ష్మారెడ్డి, బసవరాజు సారయ్య కూడా వచ్చినప్పటికీ రెచ్చగొట్టే వాఖ్యలు చేయడంలేదని పేర్కొన్నారు.
డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, ఉద్యమకారులను అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. వాళ్లు ఏమైనా దొంగలా అని పేర్కొన్నారు. తాము 16 రోజులుగా శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నామని చెప్పారు. అక్రమ అరెస్టులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దళిత నాయకుడు మునిసుబ్రమణ్యం మాట్లాడుతూ, తిరుపతి ఎంపీ చింతామోహన్ సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వకపోవడం దారుణమని, ఆయనకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ టీఅర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మీద ప్రైవేటు కేసు వేస్తామని, ఆయన రెచ్చగొట్టే వాఖ్యలు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
శాప్స్ నాయకుల అరెస్టు
Published Mon, Aug 19 2013 3:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
Advertisement
Advertisement