
మాట్లాడుతున్న సర్పంచ్ విజేంద్ర
గుమ్మఘట్ట: ‘ఈ నాలుగేళ్లు అనేక విషయాలలో సర్పంచుల హక్కులను కాలరాస్తూ నన్ను అడుగడుగునా అవమానించారు. ఇంతటి నీచమైన పాలన నా అనుభవంలో ఏనాడూ చూడలేదు. బాధ్యతగల పదవుల్లో ఉంటూ నీచ రాజకీయాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమో వారే పునరాలోచించుకోవాలి’ అంటూ గుమ్మఘట్ట మండలం గొల్లపల్లి సర్పంచ్ విజేంద్ర రాష్ట్ర గ్రామీణ, గృహనిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజులపై ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన స్థానికంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పటికైనా వీరి ప్రవర్తనలో మార్పు రాకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించడంతోపాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తామన్నారు. గ్రామప్రజలు సర్పంచ్‌గా తనను ఎన్నుకున్నప్పటికీ రాజ్యాంగేతర శక్తులుగా తయారైన జన్మభూమి కమిటీ సభ్యులే అన్నింటా ఆధిపత్యం చాటారని విచారం వ్యక్తం చేశారు. అధికారులు సైతం వారికి తొత్తులుగా మారి సర్పంచ్‌గా తనకు కనీస గౌరవమర్యాదలు కూడా ఇవ్వలేదని, అలాంటప్పుడు ఈ పదవి ఉండీ ఏం ప్రయోజనమని ఆవేదన చెందారు. మంత్రి కాలవ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ చైర్మెన్ పూల నాగరాజులే ఈ నాలుగేళ్లూ గ్రామాభివృద్ధికి పూర్తిగా అడ్డుపడ్డారని సోదాహరణంగా వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
♦ 2016లో రూ.12 లక్షలతో నాలుగు సీసీ రోడ్లు, 2017లో రూ.10 లక్షలతో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ ఆ పనులు చేపట్టకుండా మంత్రి, జెడ్పీ చైర్మన్లు అడ్డుపడ్డారు. పీఆర్ డీఈ రాజన్నను గట్టిగా నిలదీస్తే రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అప్పులు తెచ్చి రూ.22 లక్షలతో 6 రోడ్ల నిర్మాణానికి కంకర, ఇసుక, 1,600 బస్తాల సిమెంట్, ఇతర సామగ్రి సిద్ధం చేశాను. ఎర్త్ పనులు పూర్తి చేసి రోడ్డుపై కంకర పొడి కూడా చల్లి నిర్మాణం మొదలు పెట్టేటప్పుడు పీఆర్ డీఈ ఫోన్ చేసి మంత్రి, జెడ్పీ చైర్మన్ వద్దన్నారని, పనులు ఆపేయాలని చెప్పారు.
♦ రూ.10 లక్షలతో స్రీశక్తి భవన నిర్మాణానికి నన్ను బలవంతంగా ఒప్పించి నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పంప్‌హౌస్‌ను పగలగొట్టడంతోపాటు భక్తులు పూజించే భిల్వవృక్షాన్ని కూడా నాశనం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని అడ్డుకున్నా దౌర్జన్యంగా పనులు సాగిస్తున్నారు.
♦ నాకు సమాచారం ఇవ్వకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా ఏపీఓ వెంకటేశ్‌నాయక్, గ్రామ కార్యదర్శి వెంకటరాముడు కాంట్రాక్టర్లతో కుమ్మకై చెత్తశుద్ధి కేంద్రం నిర్మాణం చేపట్టారు.
♦ జనవరిలో జన్మభూమి కార్యక్రమంలో మంత్రి, జెడ్పీ చైర్మన్లను సన్మానించి గ్రామ సమస్యలు తీర్చాలని వేడుకున్నా వారు పట్టించుకోలేదు. గ్రామంలో నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలని వేదికపై పట్టుబడితే తప్పక న్యాయం చేస్తామని చెప్పిన మంత్రి తర్వాత మాట తప్పారు.
Comments
Please login to add a commentAdd a comment