‘షార్టు’గానే కానిచ్చారు! | 'Sartugane kaniccaru! | Sakshi
Sakshi News home page

‘షార్టు’గానే కానిచ్చారు!

Published Tue, Mar 24 2015 3:24 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM

'Sartugane kaniccaru!

అనంతపురం సెంట్రల్ : మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు, పామాయిల్, కందిపప్పు సరఫరా చేయడానికి నిర్వహించిన టెండర్లలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. షార్ట్ టెండర్ల ముసుగులో రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు మాత్రమే అవకాశం కల్పించేలా నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.కోట్లు విలువజేసే నిత్యావసర వస్తువుల సరఫరాకు రూ.లక్షల్లో బ్యాంకు పూచీకత్తు ఉండాలనే నిబంధనతో చిన్న వ్యాపారుల ఆశలపై గండి పడింది. ఫలితంగా  టెండర్లలో తక్కువ మంది మాత్రమే పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే... ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 17 ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు పామాయిల్, కందిబేడలు సరఫరాకు ఈ నెల 16న, కోడిగుడ్ల సరఫరాకు ఈనెల 17న టెండర్ ప్రకటన విడుదల చేశారు.

పామాయిల్, కందిబేడల సరఫరాకు సంబంధించి షెడ్యూళ్లు దాఖలు చేయడానికి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. గురువారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం సమక్షంలో టెండర్లు ఖరారు చేయనున్నారు. కోడిగుడ్ల సరఫరాకు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ దరఖాస్తులు విక్రయిస్తారు. మూడు గంటలలోగా షెడ్యూళ్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. అయితే.. టెండర్లలో పాల్గొనేందుకు సవాలక్ష నిబంధనలు పెట్టారు. గడువు మాత్రం ఒకరోజే ఇచ్చారు. ముఖ్యంగా పామాయిల్ సరఫరా చేసే కాంట్రాక్టరు రూ.10 లక్షలు, కందిబేడలు సరఫరా చేసే కాంట్రాక్టరు రూ.20 లక్షలు బ్యాంకు పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది.

గతంలో సరఫరా చేసిన అనుభవం, వాహన సౌకర్యాలు తప్పనిసరి. ఇలాంటి ఆరు ఆరు రకాల నిబంధనలు పెట్టారు. వీటిలో పేర్కొన్న అంశాలన్నీ సరి చూసుకోవడానికి చిన్న కాంట్రాక్టర్లకైతే కనీసం వారం పడుతుంది. అయితే.. ఐసీడీఎస్ అధికారులు మాత్రం బడా కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చేలా ఒకరోజు మాత్రమే అవకాశమిచ్చారు. పామాయిల్ సరఫరాకు 10 దరఖాస్తులు మాత్రమే అమ్ముడుపోయాయి. అందులోనూ ఆరుగురు దరఖాస్తుదారులు మాత్రమే షెడ్యూళ్లు దాఖలు చేశారు.

కందిబేడల  సరఫరాకు 11 దరఖాస్తులు అమ్ముడుపోగా..ఆరు దాఖలయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఐసీడీఎస్ అధికారులు నిర్వహించిన షార్ట్ టెండర్ ప్రభావం చిన్న కాంట్రాక్టర్లపై ఏ విధంగా పడిందో అర్థమవుతోంది. ఎక్కువ మంది బ్యాంకు పూచీకత్తు చూపించలేమనే భావనతో తప్పుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గురువారం టెండర్ ప్రారంభం సమయంలో మరెంత మంది తప్పుకుంటారో వేచి చూడాలి.
 
ఉన్నతాధికారుల పర్యవేక్షణ... భారీ బందోబస్తు

ఐసీడీఎస్ టెండర్లు ైరె ల్వే టెండర్లను తలపించాయి. గతంలో కనీసం ఒక కానిస్టేబుల్ లేకుండానే టెండర్లు నిర్వహించే అధికారులు.. ఈ ఏడాది మాత్రంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. బుధవారం ‘సాక్షి’లో ‘ఐసీడీఎస్ టెండర్లలో దౌర్జన్యకాండ’ శీర్షికన వెలువడిన కథనం ద్వారా ముఖ్యప్రజాప్రతినిధి అనుచరులు చేపడుతున్న బరితె గింపు కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. ఈ కథనంతో ఐసీడీఎస్ అధికారులే కాకుండా జిల్లా కలెక్టర్ శశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అప్రమత్తమయ్యారు. బుధవారం అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ ఆధ్వర్యంలో ఒక సీఐ, ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది, స్పెషల్‌పార్టీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్వయాన జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఐసీడీఎస్ కార్యాలయానికి వచ్చి టెండర్ల నిర్వహణను పరిశీలించారు. అనంతపురం ఆర్‌డీఓ ఉస్సేన్‌సాహెబ్, తహశీల్దార్ షేక్ మహబూబ్‌బాషాలను అక్కడే ఉండాల్సిందిగా ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం మూడు గంటల వరకూ కార్యాలయంలోనే ఉన్నారు. ఐసీడీఎస్‌లోని కొందరి అధికారుల తీరుపై విమర్శలు రావడంతో ప్రాజెక్టు డెరైక్టర్ జుబేదాబేగం కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటి వరకూ సెక్షన్‌లో పనిచేసిన అధికారులను తప్పించి వివిధ ప్రాజెక్టుల సీడీపీఓలు, సూపర్‌వైజర్‌లు, సమగ్ర బాలల పరిరక్షణ సమితి(ఐసీపీఎస్) అధికారులను టెండర్ల ప్రక్రియలో పాలుపంచుకునేలా ఆదేశించారు. ఫలితంగా బుధవారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దరఖాస్తులు స్వీకరణ ముగిసింది.
 
18 ఏఎన్‌జీ 22 బి: మహిళా, శిశు సంక్షేమ శాఖ  కార్యాలయం ముందు పోలీసు బందోబస్తు
18 ఏఎన్‌జీ 22 డి : ఐసీడీఎస్ టెండర్ల నిర్వహణపై అధికారులకు సూచనలిస్తున్న జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement