
శివునికే శఠగోపం!
హిందూపురం :
జిల్లాలో ఆలయ భూములకు రక్షణ లేకుండా పోతోంది. యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో భూ మాఫియా ఎంతకైనా తెగబడుతోంది. ఎవరి భూములనైనా ఆక్రమించడానికి వెనకాడడం లేదు. ఈ క్రమంలో దేవాలయాల భూములు కూడా కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఆక్రమణలను పెద్దగా పట్టించుకోని ఆలయ కమిటీలు కూడా ప్రస్తుతం భూముల విలువ పెరిగిన నేపథ్యంలో పాత రికార్డులకు దుమ్ము దులుపుతున్నాయి. ఆలయ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటున్నాయి. వాటిని గుర్తించి తీరా అక్కడికి వెళ్లేటప్పటికి ఆక్రమణలకు గురై ఉంటుండడంతో ఏమి చేయాలో కమిటీలకు దిక్కుతోచడం లేదు. హిందూపురంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని శ్రీకంఠాపురం ఈశ్వరస్వామి మాన్యం భూమి 7.76 ఎకరాలు ఎస్‌డీజీఎస్ కాలేజీ ఆక్రమణలో ఉన్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వాపోతున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. 1923 రెవెన్యూ డైక్లాట్ రికార్డు ప్రకారం సర్వే నంబర్ 309లోని 7.76 ఎకరాల భూమి ఆలయ మాన్యంగా నమోదై ఉంది. సబ్ రిజిస్ట్రారు కార్యాలయం రికార్డుల్లో సైతం ఈ రోజుకూ ‘శ్రీకంఠాపురం ఈశ్వరస్వామి వారి పూజా నిమిత్తంగా’ అని ఉంది. ఈ భూమి విషయాన్ని ఆలయ కమిటీ గతంలో పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. ఇటీవల ఎస్‌డీజీఎస్ కాలేజీ నిర్వాహకులు దీన్ని కూడా కలుపుకుంటూ ప్రహరీ నిర్మాణానికి పూనుకున్నారు. దీనిపై ఆలయ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ను విచారణకు ఆదేశించారు. విచారణ సమయంలో ఆలయ కమిటీ సభ్యులు హాజరై భూమికి సంబంధించిన విషయాలు తెలియజేశారు. కళాశాల యాజమాన్యం తరఫున మాత్రం ఎవరూ హాజరు కాలేదని ఆలయ కమిటీ సభ్యుడు ఈశ్వరప్ప తెలిపారు.
రెనిన్యూ అధికారుల విచారణలో
వాస్తవాలు వెల్లడవుతాయి
కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేశాం. సర్వే నంబరు 309లోని 7.76 ఎకరాల భూమిని ఆలయ తాత్కాలిక ట్రస్టు సభ్యులలో ఒకరైన శివరామయ్య 1966లో కళాశాల పేరుపై విక్రయించినట్లు ఒక డాక్యుమెంట్ ఉంది. దాని ప్రకారం రూ.3,880 వైశ్యా బ్యాంకు ట్రస్టు పేరుపై శివునికే శఠగోపం!
జమ చేసినట్లు చూపించినప్పటికీ ఆ వివరాలు లభ్యం కావడం లేదు. శివరామయ్యకు ఈ భూమిని విక్రయించే అధికారం ఉందా? అసలు 1966లో లావాదేవీలు జరిపి జారీ చేసిన చెక్కు అసలైందేనా?.. తదితర విషయాలు రెవెన్యూ అధికారుల పరిశీలనలో వెల్లడి కావాల్సి ఉంది.
- దేవాదాయ శాఖ అసిస్టెంట్
కమిషనర్ మల్లికార్జున
ఆలయ భూములను సంరక్షిస్తాం
శివాలయ మాన్యం భూమి ఆక్రమణపై విచారణ చేసి.. తగు చర్యలు తీసుకుంటాం. ఆలయాలకు సంబంధించిన ఆస్తులను ఎవరూ అమ్మడానికి గానీ, కొనడానికి గానీ లేదు. అలాగేమైనా జరిగివుంటే చట్టపరంగా చర్యలు తీసుకుని..వాటిని సంరక్షిస్తాం.
-విశ్వనాథ్, తహశీల్దార్
అధికారులు స్పందించపోతే
మేమే స్వాధీనం చేసుకుంటాం
శివాలయానికి సంబంధించిన దాదాపు రూ.20 కోట్ల విలువైన భూమిని ఎస్‌డీజీఎస్ కళాశాల యాజమాన్యం మూడు నెలలుగా తన ఆధీనంలో ఉంచుకుంది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అధికారులు స్పందించకపోతే ఆలయ కమిటీ సభ్యులు, శ్రీకంఠాపురం ప్రజలతో కలిసి భూమిని స్వాధీనం చేసుకుంటాం. ఈ విషయంపై త్వరలో సమావేశం ఏర్పాటు చేసి తగిన కార్యాచరణ రూపొందిస్తాం.
- అశ్వర్ధప్ప, ఆలయ కమిటీ సభ్యుడు
1965లోనే కాలేజీకిచ్చారు
ఆలయ భూమిని మేం ఆక్రమించలేదు. 1965లోనే అప్పటి జిల్లా కలెక్టర్ ఆ భూమిని కాలేజీకి మార్కెట్ విలువ ప్రకారం కేటాయించారు. అప్పటి నుంచి మా స్వాధీనానుభవంలోనే ఉంది.
- రాంప్రసాద్, ఎస్‌డీజీఎస్ కళాశాల
కమిటీ సెక్రటరీ