చిన్న ప్రాణానికి పెద్ద కష్టం | save for Child Life | Sakshi
Sakshi News home page

చిన్న ప్రాణానికి పెద్ద కష్టం

Published Tue, Apr 26 2016 4:46 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

చిన్న ప్రాణానికి పెద్ద కష్టం

చిన్న ప్రాణానికి పెద్ద కష్టం

* రక్తపు వాంతులతో అవస్థలు పడుతున్న చిన్నారి
* శస్త్ర చికిత్సకు రూ. 40 లక్షలు అవసరం
* దాతల కోసం ఎదురుచూపు

శృంగవరపుకోట : చిన్న ప్రాణానికి పెద్ద కష్టం వచ్చింది... ఆడుకోవాల్సిన వయసులో అమ్మ తప్ప మరో ప్రపంచం ఎరుగని దుస్థితి ఆ చిన్నారిది. రెక్కాడితే గాని డొక్కాడని పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు చిన్నారి ప్రాణం కాపాడేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రెండున్నరేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు. తన చిన్నారికి ప్రాణభిక్ష పెట్టమని ఆ తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే..ఎస్.కోట పట్టణంలోని మొండివీధిలో  ఆదిమూలం గణేష్, రామలక్ష్మి నివసిస్తున్నారు. గణేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. 2012లో వీరికి కొడుకు (లోకేష్) పుట్టాడు. అయితే 12 రోజులకే చిన్నారి అనారోగ్యం పాలవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మొదట్లో స్థానిక ఆస్పత్రుల్లో వైద్యం చేయించడంతో చిన్నారి ఆరోగ్యం కుదుటపడింది. మళ్లీ ఏడాది తర్వాత లోకేష్‌కు రక్తపు వాంతులు ప్రారంభమయ్యాయి. ఎడతెరపి లేకుండా వాంతులు కావడంతో చిన్నారిని పలు ఆస్పత్రుల్లో చూపించారు. చివరగా విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లగా లోకేష్ పోర్టల్ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు.  
 
శస్త్రచికిత్సకు రూ. లక్షలు కావాలి..
ప్రస్తుతం లోకేష్ పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ కేజీహెచ్‌లో వైద్యం అందిస్తున్నా శస్త్రచికిత్సకు సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. పేద కుటుంబానికి చెందిన తమకు ఇంత పెద్ద మొత్తం సమకూర్చడం సాధ్యం కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. తన కొడుక్కి ఇప్పటికీ మాట రాదని. ఆకలి అని కూడా చెప్పడని, ఎప్పుడు వాంతులు చేసుకుంటాడో తెలియదని.. వాడి కష్టం చూసి ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నానని తల్లి రామలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. దాతలు స్పందించి తనకుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటోంది. సహాయం చేయూల్సిన దాతలు 94926 21912, 73860 41986  నంబర్లను సంప్రదించాలని కోరారు.
 
అరుదైన సమస్య
కాలేయానికి వెళ్లే రక్తనాళాలు హైపర్‌టెన్షన్‌కు గురవడాన్ని పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు. దీంతో కాలేయానికి వెళ్లాల్సిన రక్తం వాంతుల రూపంలో, లేదా విరేచనం రూపంగానో బయటకు వచ్చేస్తుంది. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి.  
- డా. ఆర్.త్రినాథరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఎస్.కోట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement