Child Life
-
అశ్లీలతే అనర్థాలకు కారణం
టీవీ, స్మార్ట్ఫోన్లు బాల్యంపై వికృత రాత రాస్తున్నాయి. గాడి తప్పేలా చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ పుణ్యమాని అశ్లీలం అరచేతిలో నాట్యం చేస్తుండటంతో కొందరు బాలలు రొచ్చులో చిక్కుకుంటున్నారు. తప్పటడుగు వేస్తున్నారు. కొందరు బాల్యంలోనే లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో: నూజివీడు మండలం యనమదల గ్రామంలోని ఓ ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు లైంగిక దాడి చేశాడు. దీంతో ఇరు కుటుంబాల తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. కేసును విచారించిన పోలీసులకు దిగ్భాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. బాలుడికి ఆలోచన ఎలా వచ్చిందా అని ఆరా తీశారు. టీవీల్లో, సెల్ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూడడం, స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం, పెద్దల పర్యవేక్షణ లేకపోవడంతో అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటు పడ్డాడు. ప్రస్తుతం విజయవాడలోని జువైనల్ హోంలో ఉంటున్నాడు. ఈవ్ టీజర్లగా మారే అవకాశం.. చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్లు వాడటంతో ఫేస్బుక్, యూట్యూబ్‌లలో కనిపించే కొన్ని అశ్లీల దృశ్యాలు, చిత్రాలు విద్యార్థుల భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సమయం దొరికితే స్మార్ట్‌ఫోన్ లోకంలో ఉంటున్నారు. ఇటీవల మానసిక నిపుణుల బృందాలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న పలువురు విద్యార్థులను వ్యక్తిగతంగా, బృందాలుగా విచారించారు. పదే పదే అశ్లీల దృశ్యాలు చూడటంతో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడాలని అనిపిస్తోందని సర్వేలో వెల్లడించారు. మరో వైపు వారు చూస్తున్న వీడియోల విషయం బయటపడుతుందేమోనన్న భయంతో తల్లిదండ్రులకు దూరంగా గడపుతూ సఖ్యత తగ్గిపోతోందని తేల్చారు. నిరంతర పర్యవేక్షణ అవసరం... ఉద్యోగాల బిజీలో తల్లిదండ్రులు ఉదయం ఏడు నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటి ముఖం చూసే అవకాశం ఉండడం లేదు. కొందరు పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. ఇది పిల్లలపై మానసికంగా ప్రభావం చూపుతోంది. ఎలా చదువుతున్నారు..? ఏమి చేస్తున్నారు...? ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించకుండా వదిలేస్తున్నారు. స్నేహితులతో కలసి చదువుకుంటున్నామంటూ గది తలుపులు వేసుకొని లోపల ఉంటున్న పిల్లల వద్దకు అప్పుడప్పుడు తల్లిదండ్రులు వెళ్లి వారేం చేస్తున్నారో తప్పనిసరిగా పేదలు గమనించాలి. పుస్తకాలని, ప్రాజెక్ట్ వర్క్‌లని చెప్పి పేరెంట్స్‌తో డబ్బులు తీసుకుని వెళ్లే వారిపై శ్రద్ధ పెట్టాలి. లేకుంటే చెడుమార్గం వెళ్లే అవకాశం ఉంది. క్రీడలు ఆడించాలి.... విద్యార్థులు, యువకులను క్రీడల్లో నిమగ్నం చేయాలి. తొంబై శాతం మంది మానసికోల్లాసం లేకపోవడంతోనే చెడు వ్యసనాలకు అలవాటు పడుతాన్నారు. ఇలాంటి వ్యసనాలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించి వారిని సకాలంలో స్పందించాలి. వారికిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో, క్రీడల్లో పాల్గనేలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏకాగ్రత దెబ్బతింటుంది పిల్లలకు చిన్నవయసులో అశ్లీల చిత్రాలు చూడటం వల్ల వారి ఏకాగ్రత దెబ్బతింటుంది. చదువుపై శ్రద్ధ ఉండదు. పిల్లలకు వీలున్నంత వరకు సెల్‌ఫోన్ ఇవ్వకపోవడం మంచిది. ఒకవేళ ఇవ్వాల్సివస్తే అనవసర సైట్లు బ్లాక్ చేసి ఇవ్వాలి. తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణం అవసరం. రాత్రి పూట పిల్లల వద్ద మొబైల్ ఫోన్లు ఉంచరాదు. తెలిసి తెలియని వయసులో సెక్స్ నాలెడ్జ్ లేకపోవడంతో వారు చూసిందే నిజం అని నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. చిన్న వయసులోనే సెక్స్ కోరికలు కలగడంతో అకృత్యాలకు పాల్పడుతున్నారు. కొంత మంది కేసుల పాలై శిక్షలు అనుభవిస్తున్నారు. ఈ మధ్య చోటుచేసుకుంటున్న నేరాలకు ముఖ్య కారణం అశ్లీల చిత్రాలే.–డాక్టర్ ఇండ్ల విశాల్‌రెడ్డి, ప్రముఖమానసిక వైద్య నిపుణుడు, విజయవాడ -
పాపకు ప్రాణం పోసిన జీజీహెచ్ వైద్యులు
గుంటూరు మెడికల్: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి ఉరివేసుకుని చనిపోతూ తన బిడ్డలను సైతం ఉరివేసి చంపాలనుకుంది. చుట్టుపక్కల వారు గమనించే సరికి తల్లి ఓ బిడ్డ చనిపోగా మరో పాప మాత్రం ఉరితాడుకు వేలాడుతూనే శ్వాస తీసుకోవటాన్ని గమనించారు. కొన ఊపిరిలో ఆస్పత్రికి వచ్చిన పాపకు గుంటూరు జీజీహెచ్ పిల్లల వైద్య విభాగం వైద్యులు మెరుగైన వైద్యసేవలను అందించి ప్రాణాలు కాపాడారు. పాప ఆరోగ్యం మెరగవ్వటంతో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎంఎస్ రాజు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. మే 18వ తేదీన పూసపాటి హేమశ్రీ అనే రెండున్నరేళ్ల చిన్నారిని బంధువులు తమ వద్దకు తీసుకొచ్చారని డాక్టర్ రాజు చెప్పారు. తల, మెడ భాగాల్లో వాపు ప్రారంభమై శ్వాసకి ఇబ్బంది పెరిగిందన్నారు. పాపకు ‘ట్రమటిక్ సర్వైకల్ వ్యాస్కులోపతి విత్ మైలోపతి ’వ్యాధిగా నిర్ధారణ చేసి 20 రోజులు పాటు ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యసేవలను అందించటంతో ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. డాక్టర్ బి.దేవకుమార్, డాక్టర్ పేరం ఝాన్సీ, డాక్టర్ కరిముల్లా, డాక్టర్ వాణిభాయ్, డాక్టర్ మీన ఇతర స్పెషాలిటీ వైద్యులు 28 రోజులపాటు వైద్యం అందించినట్లు వెల్లడించారు. -
చిన్న ప్రాణానికి పెద్ద కష్టం
* రక్తపు వాంతులతో అవస్థలు పడుతున్న చిన్నారి * శస్త్ర చికిత్సకు రూ. 40 లక్షలు అవసరం * దాతల కోసం ఎదురుచూపు శృంగవరపుకోట : చిన్న ప్రాణానికి పెద్ద కష్టం వచ్చింది... ఆడుకోవాల్సిన వయసులో అమ్మ తప్ప మరో ప్రపంచం ఎరుగని దుస్థితి ఆ చిన్నారిది. రెక్కాడితే గాని డొక్కాడని పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు చిన్నారి ప్రాణం కాపాడేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రెండున్నరేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు. తన చిన్నారికి ప్రాణభిక్ష పెట్టమని ఆ తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..ఎస్.కోట పట్టణంలోని మొండివీధిలో ఆదిమూలం గణేష్, రామలక్ష్మి నివసిస్తున్నారు. గణేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. 2012లో వీరికి కొడుకు (లోకేష్) పుట్టాడు. అయితే 12 రోజులకే చిన్నారి అనారోగ్యం పాలవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మొదట్లో స్థానిక ఆస్పత్రుల్లో వైద్యం చేయించడంతో చిన్నారి ఆరోగ్యం కుదుటపడింది. మళ్లీ ఏడాది తర్వాత లోకేష్‌కు రక్తపు వాంతులు ప్రారంభమయ్యాయి. ఎడతెరపి లేకుండా వాంతులు కావడంతో చిన్నారిని పలు ఆస్పత్రుల్లో చూపించారు. చివరగా విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లగా లోకేష్ పోర్టల్ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. శస్త్రచికిత్సకు రూ. లక్షలు కావాలి.. ప్రస్తుతం లోకేష్ పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ కేజీహెచ్‌లో వైద్యం అందిస్తున్నా శస్త్రచికిత్సకు సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. పేద కుటుంబానికి చెందిన తమకు ఇంత పెద్ద మొత్తం సమకూర్చడం సాధ్యం కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. తన కొడుక్కి ఇప్పటికీ మాట రాదని. ఆకలి అని కూడా చెప్పడని, ఎప్పుడు వాంతులు చేసుకుంటాడో తెలియదని.. వాడి కష్టం చూసి ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నానని తల్లి రామలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. దాతలు స్పందించి తనకుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటోంది. సహాయం చేయూల్సిన దాతలు 94926 21912, 73860 41986 నంబర్లను సంప్రదించాలని కోరారు. అరుదైన సమస్య కాలేయానికి వెళ్లే రక్తనాళాలు హైపర్‌టెన్షన్‌కు గురవడాన్ని పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు. దీంతో కాలేయానికి వెళ్లాల్సిన రక్తం వాంతుల రూపంలో, లేదా విరేచనం రూపంగానో బయటకు వచ్చేస్తుంది. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. - డా. ఆర్.త్రినాథరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఎస్.కోట.