అశ్లీలతే అనర్థాలకు కారణం | Kids Watching Adults in Smartphones | Sakshi
Sakshi News home page

అశ్లీలతే అనర్థాలకు కారణం

Published Wed, Dec 12 2018 1:30 PM | Last Updated on Wed, Dec 12 2018 1:30 PM

Kids Watching Adults in Smartphones - Sakshi

టీవీ, స్మార్ట్‌ఫోన్‌లు బాల్యంపై వికృత రాత రాస్తున్నాయి. గాడి తప్పేలా చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ పుణ్యమాని అశ్లీలం అరచేతిలో నాట్యం చేస్తుండటంతో కొందరు బాలలు రొచ్చులో చిక్కుకుంటున్నారు. తప్పటడుగు వేస్తున్నారు. కొందరు  బాల్యంలోనే లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

సాక్షి, అమరావతి బ్యూరో: నూజివీడు మండలం యనమదల గ్రామంలోని ఓ ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు లైంగిక దాడి చేశాడు. దీంతో ఇరు కుటుంబాల తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. కేసును విచారించిన పోలీసులకు దిగ్భాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. బాలుడికి ఆలోచన ఎలా వచ్చిందా అని ఆరా తీశారు. టీవీల్లో, సెల్‌ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు చూడడం, స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండటం, పెద్దల పర్యవేక్షణ లేకపోవడంతో అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటు పడ్డాడు. ప్రస్తుతం విజయవాడలోని జువైనల్‌ హోంలో ఉంటున్నాడు.

ఈవ్‌ టీజర్లగా మారే అవకాశం..
చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్‌లు వాడటంతో ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో కనిపించే కొన్ని అశ్లీల దృశ్యాలు, చిత్రాలు విద్యార్థుల భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సమయం దొరికితే స్మార్ట్‌ఫోన్‌ లోకంలో ఉంటున్నారు. ఇటీవల మానసిక నిపుణుల బృందాలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న పలువురు విద్యార్థులను వ్యక్తిగతంగా, బృందాలుగా విచారించారు. పదే పదే అశ్లీల దృశ్యాలు చూడటంతో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడాలని అనిపిస్తోందని సర్వేలో వెల్లడించారు. మరో వైపు వారు చూస్తున్న వీడియోల విషయం బయటపడుతుందేమోనన్న భయంతో తల్లిదండ్రులకు దూరంగా గడపుతూ సఖ్యత తగ్గిపోతోందని తేల్చారు.

నిరంతర పర్యవేక్షణ అవసరం...
ఉద్యోగాల బిజీలో తల్లిదండ్రులు ఉదయం ఏడు నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటి ముఖం చూసే అవకాశం ఉండడం లేదు. కొందరు పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. ఇది పిల్లలపై మానసికంగా ప్రభావం చూపుతోంది. ఎలా  చదువుతున్నారు..? ఏమి చేస్తున్నారు...? ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించకుండా వదిలేస్తున్నారు. స్నేహితులతో కలసి చదువుకుంటున్నామంటూ గది తలుపులు వేసుకొని లోపల ఉంటున్న పిల్లల వద్దకు అప్పుడప్పుడు తల్లిదండ్రులు వెళ్లి వారేం చేస్తున్నారో తప్పనిసరిగా పేదలు గమనించాలి. పుస్తకాలని, ప్రాజెక్ట్‌ వర్క్‌లని చెప్పి పేరెంట్స్‌తో డబ్బులు తీసుకుని వెళ్లే వారిపై శ్రద్ధ పెట్టాలి. లేకుంటే చెడుమార్గం వెళ్లే అవకాశం ఉంది.

క్రీడలు ఆడించాలి....
విద్యార్థులు, యువకులను క్రీడల్లో నిమగ్నం చేయాలి. తొంబై శాతం మంది మానసికోల్లాసం లేకపోవడంతోనే చెడు వ్యసనాలకు అలవాటు పడుతాన్నారు. ఇలాంటి వ్యసనాలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించి వారిని సకాలంలో స్పందించాలి. వారికిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో, క్రీడల్లో పాల్గనేలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఏకాగ్రత దెబ్బతింటుంది
పిల్లలకు చిన్నవయసులో అశ్లీల చిత్రాలు చూడటం వల్ల వారి ఏకాగ్రత దెబ్బతింటుంది. చదువుపై శ్రద్ధ ఉండదు. పిల్లలకు వీలున్నంత వరకు సెల్‌ఫోన్‌ ఇవ్వకపోవడం మంచిది. ఒకవేళ ఇవ్వాల్సివస్తే అనవసర సైట్లు బ్లాక్‌ చేసి ఇవ్వాలి. తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణం అవసరం. రాత్రి పూట పిల్లల వద్ద మొబైల్‌ ఫోన్లు ఉంచరాదు. తెలిసి తెలియని వయసులో సెక్స్‌ నాలెడ్జ్‌ లేకపోవడంతో వారు చూసిందే నిజం అని నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. చిన్న వయసులోనే సెక్స్‌ కోరికలు కలగడంతో అకృత్యాలకు పాల్పడుతున్నారు. కొంత మంది కేసుల పాలై శిక్షలు అనుభవిస్తున్నారు. ఈ మధ్య చోటుచేసుకుంటున్న నేరాలకు ముఖ్య కారణం అశ్లీల చిత్రాలే.–డాక్టర్‌ ఇండ్ల విశాల్‌రెడ్డి, ప్రముఖమానసిక వైద్య నిపుణుడు, విజయవాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement