తిరువనంతపురం: కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పాఠశాలలను మూసి వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కేరళలో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఓ 14 ఏళ్ల పేద విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది. కుటుంబంలో టీవీ, స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్నాననే బాధతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన బాలిక.. ఈ రోజు వాలంచెరిలోని ఆమె ఇంటి సమీపంలో మృతదేహంగా కనిపించింది. ఆ పక్కనే ఖాళీగా ఉన్న కిరోసిన్ బాటిల్ కూడా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహం దొరికిన ప్రదేశంలో సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంజేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపారు.(ఆ బాలికపై దాడి అమానుషం : రాహుల్)
మృతి చెందిన బాలిక 9 వ తరగతి చదువుతుందని.. క్లాస్‌లో ఎప్పుడు ఫస్ట్ వస్తుందని పాఠశాల అధికారులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు తమ వద్ద ఒక చిన్న టీవీ ఉందని.. కానీ మూడు నెలలుగా అది రిపేర్‌లో ఉందని తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలలుగా తమకు పని లేదని.. అందువల్లే టీవీని బాగు చేయించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ, రాహుల్ గాంధీ ఈ ఘటనపై స్పందించారు. బాలిక మరణం తనను కలచి వేసిందని పేర్కొన్నారు. అంతేకాక నియోజకవర్గంలో టీవీ, స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో లేని కుటుంబాలకు తాను సాయం చేస్తానని తెలిపారు. వారి జాబితాను ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖలో రాహుల్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment