బతికించండి | save my life | Sakshi
Sakshi News home page

బతికించండి

Published Tue, Feb 4 2014 3:13 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

save my life

 జన్నారం, న్యూస్‌లైన్ :
 జన్నారం మండలం కామన్‌పల్లి గ్రామానికి చెందిన తోకల ప్రభాకర్ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కూతురు రజిత వివాహం చేశాడు. నాలుగు కాసులు సంపాదిస్తామని 2011లో రూ.1.10 లక్షలు ఖర్చు చేసి దుబాయ్ వెళ్లాడు. దుబాయ్ కంపెనీ తిరిగి ఇంటికి పంపించింది. మళ్లీ రూ.60 వేలు ఖర్చు చేసి వెళ్లాడు. అక్కడ 19 నెలలు పనిచేసి ఆరోగ్యం బాగా లేకపోవడంత తిరిగొచ్చాడు. ఈ సమయంలోనే రెండో కూతురు సరిత  వివాహం చేశాడు. తన కుమారుడు రాజేందర్‌ను డిగ్రీ వరకు చదివించాడు. ప్రభాకర్ ఖాళీగా కూర్చోలేక నాలుగు నెలలుగా గేదెలను మేపుతూ వచ్చిన ధాన్యం, డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
 
 పిడుగులాంటి వార్త..
 హాయిగా గడుపుతున్న ఆ కుటుంబంలో పిడుగులాంటి వార్త. ఆరోగ్యం బాగాలేదని జనవరి 28న కరీంనగర్‌లోని ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు రెండు కిడ్నీలు చెడిపోయాయని తెలిపారు. మరోసారి హైదరాబాద్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. రెండు కిడ్నీలు చెడిపోయాయని, వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించాలని సూచించారు. అసలే పేదలం. పనిచేస్తేగాని పూట గడవదు. వారానికోసారి డయాలసిస్ చేయించుకోవాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అని మదనపడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయినా ఉన్నది అమ్మి రూ.1.50 లక్షలు పెట్టి ఆస్పత్రులు తిరిగారు. అయినా కిడ్నీలు బాగు కాలేదు. కిడ్నీలు మార్చాలంటే రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని, అంత డబ్బు మా వద్ద లేదని, ఎవరైన ఆదుకుంటే చికిత్స చేయించుకుంటానని ప్రభాకర్ కోరుతున్నాడు.
 
 పశువుల కాపరిగా భార్య
 కుటుంబ పెద్ద జబ్బుతో మంచం పట్టాడు. ఇక కుటుంబాన్ని పోషించాల్సిన భారం భార్య అమృతపై పడింది. తన భర్త మేపే గేదెలను ఇప్పుడు ఆమె మేపుకుంటూ పశువుల కాపరిగా మారింది. గేదెలను మేపినందుకు గ్రామస్తులు ఇచ్చే ధాన్యంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమారుడు చదువు మానేసి తండ్రి ఆరోగ్యం చూసుకుంటున్నాడు. మనసున్న మారాజులు ఆపన్నహస్తం అందించి పేద కుటుంబంలో వెలుగులు నింపాలని వారు వేడుకుంటున్నారు.
 
 అన్ని ఆస్పత్రులు తిరిగాం..
 పేద కుటుంబమైన నాన్న నన్ను పెద్ద చదువులు చదివించాలనుకున్నాడు. మా కోసం బయట దేశం పోయి నన్ను డిగ్రీ వరకు చదివించాడు. ఇప్పుడు నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నాన్న జబ్బు పడ్డాడు. రెండు కిడ్నీలు చెడిపోయాయని వైద్యులు చెప్పారు. చేతిలో డబ్బులు లేవు. వారానికి రెండు సార్లు కరీంనగర్ లోని చెడిమెల ఆనందరావు ఆస్పత్రిలో డయాలసిస్ చేపిస్తున్నాము. వారానికి రూ.3 వేల వరకు ఖర్చు అవుతుంది. దాతలు స్పందించాలి. మా నాన్నను బతికించండి.
 - రాజెందర్, కుమారుడు
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement