వేములలో ఎస్‌బీఐ బ్రాంచ్ ఏర్పాటు చేయండి
సాక్షి, కడప : వేముల మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని, తద్వారా అక్కడి ప్రజలకు లావాదేవీలు నిర్వహించుకునేందుకు ప్రయోజనకరంగా ఉంటుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం కడపలోని ద్వారకానగర్‌లో ఉన్న ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ జేఎస్‌ఎస్ ప్రసాద్‌ను ఎంపీ అవినాష్, వేముల మండలానికి చెందిన ఎంపీటీసీ, సర్పంచులతో వెళ్లి కలిశారు.
ఈ సందర్భంగా వేముల ప్రాంతంలో ముగ్గురాయికి సంబంధించిన వ్యాపార లావాదేవీలతోపాటు ఇతర రైతులకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వారు ఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా వేములలో కేవలం ఏపీజీబీ బ్యాంకుకు సంబంధించిన బ్రాంచ్ మాత్రమే ఉందని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆర్‌ఎం వెంటనే సర్వే చేయించి అందుకు అనుగుణంగా బ్రాంచ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వేముల మండల పరిశీలకుడు వేల్పుల రాము, సర్పంచులు, ఎంపీటీసీలు రాఘవేంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, పక్కీరప్ప, బయన్న, చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, నారాయణరెడ్డి, పుల్లయ్య, రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బస్సును పునరుద్ధరించండి
భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లెకు సంబంధించిన ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆర్టీసీ ఆర్‌ఎం గోపినాథరెడ్డిని కోరారు. సోమవారం సాయంత్రం ఆర్‌ఎంతో టెలిఫోన్‌లో ఎంపీ చర్చించారు. ఇప్పటికే ఆ రూటులో తిరిగే ఆటోలను సైతం తిరగనివ్వకుండా గ్రామస్తులు అడ్డుకున్నారని.. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సు నడపకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆర్‌ఎంకు వివరించారు. వెంటనే బస్సు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌ఎం హామీ ఇచ్చారు.
అంగన్‌వాడీ వర్కర్లను నియమించండి
భూమయ్యగారిపల్లెలో అంగన్‌వాడీ స్కూలు ఉంది. అయితే, అంగన్‌వాడీ వర్కర్లు లేకపోవడంతో అటు పిల్లలు, ఇటు గర్భవతులకు సమస్య ఎదురవుతోందని, వెంటనే అంగన్‌వాడీ వర్కర్లతోపాటు ఆయాలను నియమించాలని ఎంపీ వైఎస్ అవినాష్ ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ రాఘవరావును కోరారు. దీనిపై స్పందించిన పీడీ యుద్ధ ప్రాతిపదికన వర్కర్‌ను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి ఇన్‌ఛార్జిని నియమించి సమస్య లేకుండా చేస్తామని ఎంపీ వైఎస్ అవినాష్‌కు స్పష్టం చేశారు.