
తెలంగాణకు దళితుడినే సీఎం చేస్తాం: జైరాం
కరీంనగర్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ ప్రకటించారు. ఆయన సోమవారం కరీంనగర్లో విలేకర్లతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ మైనార్టీ నేతలను ఎంపిక చేయమని ఏఐసీసీ ఎస్సీ కమిటీ ఛైర్మన్ కొప్పుల రాజుకు బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. సీమాంద్ర, తెలంగాణ జేఏసీలతో సంయుక్త జేఏసీ ఏర్పాటు చేస్తామని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఈ నెల 19న రెండు జేఏసీలతో భేటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందని జైరాం రమేష్ తెలిపారు. టీఆర్ఎస్తో పొత్తుపై అధిష్టానందే తుది నిర్ణయమని ఆయన అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వచ్చే జనవరిలో 1200 మెగావాట్ల బొగ్గు ఆథారిత ప్రాజెక్ట్ను ప్రారంభిస్తామన్నారు. జూన్ 2 తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలోని ఆదాయం తెలంగాణకే చెందుతుందని జైరాం రమేష్ తెలిపారు. సాంకేతికపరమైన అనుమతులు లభిస్తే ప్రాణహితకు జాతీయ హోదా దక్కుతుందని ఆయన చెప్పారు.