
కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ లేదు
అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకే విభజన
సీమాంధ్రులకు ప్రత్యేక ప్యాకేజీ.. అభివృద్ధి వికేంద్రీకరణ
వాటర్ బోర్డు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేస్తాం
కేంద్ర మంత్రి జైరాం రమేష్
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్
కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ లేకుండా తెలంగాణ లేదని, సీమాంధ్రులకు రక్షణ లేదని పేర్కొన్నారు. ఆయన గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 60 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న దృష్ట్యా రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక, కారణాలతో పాటుగా స్థానికుల ఆకాంక్షను దృషిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశామన్నారు. సీమాంధ్రలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పారు. సీమాంధ్రలో తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, అమరావతి తదితర ప్రాంతాలు రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలపై వాటర్ బోర్డులను నియమించి సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కామన్‌అడ్మిషన్ విధానం ద్వారా పదేళ్ల పాటు రెండు ప్రాంతాలకు కొనసాగేలా చూస్తామని చెప్పారు.
రూ.లక్ష కోట్లతో ఇండస్ట్రియల్ కారిడార్..
సీమాంధ్ర ప్రాంతానికి స్పెషల్ ప్యాకేజీ ద్వారా ఐఐటీ, ట్రైబల్, అగ్రికల్చర్, సెంట్రల్ యూనివర్సిటీలు, సూపర్‌స్పెషాలిటీ హెల్త్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 10 నుంచి 15 ఏళ్లలోపు విశాఖపట్నం నుంచి చెన్నై వరకు రూ.లక్ష కోట్ల వ్యయంతో ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు పట్టణాలను మెట్రో సిటీలుగా తీర్చిదిద్దుతామని, న్యూ రైల్వే జోన్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఎస్సీసెల్ జాతీయ అధ్యక్షులు కొప్పులరాజు, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్‌వలి, కాండ్రు కమల, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ కూచిపూడి విజయ, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య తదితరులు పాల్గొన్నారు.
రక్షణ వలయంలో పార్టీ కార్యాలయం...
కేంద్ర మంత్రి జైరాం రమేష్ పర్యటన సందర్భంగా నగరంలో ఆయన తిరిగే మార్గంలో పోలీస్ సిబ్బందిని అధిక సంఖ్యలో ఏర్పాటుచేశారు. సమైక్యాంధ్ర వాదులెవరైనా ఆయన వాహనాన్ని అడ్డగిస్తారేమోనని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం 9గంటల కల్లా జిల్లా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయానికి పోలీస్ సిబ్బందితో అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యాలయం లోపలికి వచ్చే వారిని ప్రశ్నించి లోపలికి పంపించారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యకి ్తరాష్ర్ట విభజనచేసి సీమాంధ్రకు అన్యాయం చేశారని ప్రశ్నించగా మీరెవరు అడగటానికి, ప్రెస్‌వారా అని మంత్రి ప్రశ్నించారు.
నేను భారతీయ పౌరుడినని బదులివ్వడంతో వెంటనే ప్రజాప్రతినిధుల అనుచరులు అతడిని బయటకు పంపించివేశారు. కార్యకర్తలు పలుమార్లు లోపలికి తోసుకుంటూ వచ్చి మంత్రి ప్రసంగానికి అడ్డు తగలడంతో సెలైన్స్ ప్లీజ్ అంటూ కార్యకర్తలను కోరారు. మాజీ మంత్రి కన్నా, మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి కూడా జోక్యం చేసుకుని నిశ్శబ్ధంగా ఉండాలని వారించారు. సమావేశం అనంతరం పార్టీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేసి ఎన్నిక ల్లో గెలుపుకోసం పాటుపడాలని మంత్రి సూచించారు. సమావేశం అనంతరం కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి జె.డి.శీలం మాట్లాడుతూ జైరాం రమేష్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.